Spandana Sphoorty Q2 Results: హైదరాబాదీ కంపెనీ, మైక్రో లెండర్ స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిడెడ్ (Spandana Sphoorty Financial Ltd), ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో (Q2FY23) మంచి పనితీరు కనబరిచింది. రెండో త్రైమాసికంలో రూ.55.2 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోని నష్టాలను దాటుకుని ఈసారి లాభాలను మూటగట్టుకుంది. పైగా, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఆదాయం తగ్గినప్పటికీ లాభాన్ని పెంచుకోవడం విశేషం.
ఆదాయం - లాభం
2022-23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి, రూ.311 కోట్ల మొత్తం ఆదాయాన్ని కంపెనీ ఆర్జించింది. 55.2 కోట్ల రూపాయల పన్ను అనంతర లాభాన్ని (PAT) సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.310 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మొదటి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికం ఆదాయం దాదాపు 20 శాతం పెరిగింది. అయితే, మొదటి త్రైమాసికంలో రూ.220 కోట్ల నష్టాన్ని ఈ కంపెనీ మూటగట్టుకుంది. దానికి వ్యతిరేకంగా ఈసారి లాభాలు ఆర్జించింది.
రుణదాత మొత్తం ఆదాయం గత ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ.396 కోట్ల నుంచి ఈసారి తగ్గింది.
వడ్డీ ఆదాయం (Interest income) కూడా, గత ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ.350.5 కోట్ల నుంచి ఈసారి రూ.276.5 కోట్లకు తగ్గింది. 21 శాతం (YoY) క్షీణించింది.
రెండో త్రైమాసికంలో మొత్తం రూ.1391 కోట్ల రుణాలను స్పందన స్ఫూర్తి అందించింది. మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఈ మొత్తం 5 శాతం అధికం.
2022 సెప్టెంబర్ చివరి నాటికి, స్థూల నిరర్థక ఆస్తుల (GNPAs) నిష్పత్తి 7.47 శాతం కాగా నికర నిరర్ధక ఆస్తుల నిష్పత్తి (NNPAs) 3.96 శాతంగా తేలాయి. మొత్తం కేటాయింపులు (Provisions) రూ.303 కోట్లుగా కంపెనీ తెలిపింది. నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో (AUM) ఇది 5.23 శాతం. ఇంత శాతం ఉండడం ఆందోళనకర విషయం.
కంపెనీ AUM గత త్రైమాసికం కంటే ఈ త్రైమాసికంలో (QoQ) దాదాపు 5 శాతం పెరిగి రూ.5,782 కోట్లకు చేరుకుంది.
పెరిగిన కొత్త కస్టమర్లు
కొత్త కస్టమర్లను సంపాదిచడం మీద కంపెనీ ప్రధానంగా దృష్టి పెట్టింది. రెండో త్రైమాసికంలో పంపిణీ చేసిన రూ.1391 కోట్ల రుణాల్లో 46 శాతాన్ని కొత్త కస్టమర్ల కోసమే కేటాయించింది. దీంతో, తన వినియోగదారులు 16 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది.
మొత్తం లోన్ బుక్‌లో రూరల్ పోర్ట్‌ఫోలియో పెరిగింది. అంతకుముందున్న 85 శాతం నుంచి 88 శాతానికి వృద్ధి చెందింది. గ్రామీణ ప్రాంతాల మీద కంపెనీ ఫోకస్ పెంచిందని ఈ వృద్ధి చెబుతోంది.
సోమవారం సెషన్‌లో 28.85 రూపాయలు పెరిగిన స్పందన స్ఫూర్తి షేరు ధర, రూ.606.05 కు చేరింది. 5 శాతం అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.