Smart TV Screen Cleaning Tips: OTT (Over The Top) ప్లాట్‌ఫామ్‌లు వచ్చిన తర్వాత, చాలా మంది, ముఖ్యంగా కుటుంబ సభ్యులు కలిసి సినిమా హాళ్లకు వెళ్లి సినిమాలు చూడటం మానేశారు. బదులుగా, అందరూ హాయిగా ఇంట్లోనే కూర్చుని సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు, స్పోర్ట్స్‌, సీరియల్స్‌ సహా ఇతర స్ట్రీమింగ్‌ కంటెంట్‌ను ఆస్వాదించడం ప్రారంభించారు. ఈ కారణంగా, స్మార్ట్ టీవీలు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. డిమాండ్‌ పెరిగే సరికి స్మార్ట్‌ టీవీల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పెద్ద స్క్రీన్‌లు, నాణ్యమైన రంగులు, శబ్దాన్ని స్పష్టంగా వినిపించే సాంకేతికతలు స్మార్ట్‌ టీవీ ఫీచర్లలో భాగమయ్యాయి. దీంతో, ఇంట్లోనే సినిమా తరహా వాతావరణాన్ని స్మార్ట్ టీవీలు అందిస్తున్నాయి, గొప్ప వినోద అనుభవాన్ని పంచుతున్నాయి. 


స్మార్ట్‌ టీవీలను చూస్తూ ఎంజాయ్‌ చేయడమే కాదు, వాటిని జాగ్రత్తగా నిర్వహించడం కూడా ముఖ్యం. స్మాల్ట్‌ టీవీ స్క్రీన్‌ను శుభ్రం చేసేటప్పుడు కొన్ని విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, లేకపోతే పెద్ద నష్టం జరగవచ్చు. ఒక్కోసారి, ఆ టీవీని పాత సామాను కింద ఉల్లిపాయలకు వేసి, కొత్త టీవీ కొనాల్సిరావచ్చు.


స్మార్ట్‌ టీవీ స్క్రీన్‌ను తుడిచేటప్పుడు తీసుకోవాల్సి జాగ్రత్తలు (Precautions while cleaning a smart TV screen)


మైక్రో ఫైబర్ క్లాత్‌ను మాత్రమే ఉపయోగించాలి
స్మార్ట్ టీవీ స్క్రీన్‌ లేదా ఏదైనా డిజిటల్‌ డివైజ్‌ స్క్రీన్‌ను శుభ్రం చేయడానికి ఎప్పుడూ మైక్రోఫైబర్ క్లాత్‌ను మాత్రమే ఉపయోగించండి. ఈ వస్త్రంతో తుడిస్తే స్క్రీన్‌ బాగా శుభ్రం అవుతుంది & స్క్రీన్‌ మీద గీతలు పడతాయన్న భయం కూడా ఉండదు. చాలా మంది టవల్ లేదా బనీన్‌ క్లాత్‌ లేదా మందపాటి వస్త్రాన్ని తుడవడానికి ఉపయోగిస్తుంటారు. ఇది స్క్రీన్‌ను దెబ్బతీస్తుంది. ఈ తప్పు ఎప్పటికీ చేయకండి. 


టీవీని ఆఫ్‌లో పెట్టండి & అన్‌-ప్లగ్‌ చేయండి
దాదాపుగా, స్మార్ట్ టీవీ స్క్రీన్‌ను పొడి వస్త్రంతోనే తుడవండి. తప్పనిసరై తడి వస్త్రం పెట్టాల్సి వచ్చినప్పుడు, టీవీని స్విచ్ఛాఫ్‌ చేయండి. టీవీ ప్లగ్‌ను కూడా సాకెట్‌ నుంచి తొలగించండి. లేకపోతే కరెంట్‌ షాక్‌ కొట్టే ప్రమాదం ఉంది & తడి క్లాత్‌ కారణంగా టీవీ స్క్రీన్‌ కూడా పాడుకావచ్చు.


నమ్మకమైన స్ప్రే మాత్రమే ఉపయోగించండి
ఈ రోజుల్లో, మార్కెట్లో అనేక రకాల శుభ్రపరిచే స్ప్రేలు అందుబాటులో ఉన్నాయి. కానీ, వాటిని జాగ్రత్తగా వాడాలి. కొంతమంది, టీవీ స్క్రీన్‌ను మిలమిలా మెరిపించడానికి ఎక్కువ గాఢతతో కూడిన రసాయనాలు ఉన్న స్ప్రేలను ఉపయోగిస్తారు. ఇది స్క్రీన్‌ను దెబ్బతీస్తుంది. 


నేరుగా స్క్రీన్‌ మీద చల్లవద్దు
స్మార్ట్ టీవీ స్క్రీన్‌ సహా ఎలాంటి ఎలక్ట్రానికి తెరలను శుభ్రపరిచేటప్పుడైనా ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఎలాంటి ద్రావణాన్ని నేరుగా స్క్రీన్‌పై చల్లడం, పోయడం లేదా స్ప్రే చేయడం వంటివి చేయకూడదు. దీనివల్ల స్క్రీన్‌ ఆ మెరకలు శాశ్వతంగా నిలిచిపోవచ్చు. కాబట్టి, క్లీనింగ్‌ క్లాత్‌ మీద ద్రావణాన్ని చల్లి, దానితో స్క్రీన్‌తో శుభ్రం చేయాలి.


స్క్రీన్‌పై ఒత్తిడి పెట్టవద్దు
చాలా మంది, స్క్రీన్‌ మీద మరకలు పోవడానికి లేదా పూర్తిగా శుభ్రం చేయడం కోసం గట్టిగా ఒత్తి పెట్టి తుడుస్తుంటారు. పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి. స్మార్ట్‌ టీవీ స్క్రీన్ చాలా సున్నితంగా ఉంటుంది. స్క్రీన్ వెనకవైపున కూడా సున్నితమైన అంతర్గత భాగాలు ఉంటాయి. స్క్రీన్ మీద ఒత్తిడి పెంచినప్పుడు స్క్రీన్‌తో పాటు అంతర్గత భాగాలు దెబ్బతినవచ్చు. స్క్రీన్ పాడైతే దాని మరమ్మతు ఖర్చు దాదాపు కొత్త టీవీ ధర అంత అవుతుంది. లేదా, మరమ్మతు చేసినా ఉపయోగం ఉండకపోవచ్చు, కొత్త టీవీ కొనవలసి రావచ్చు. కాబట్టి, స్క్రీన్‌పై ఒత్తిడి పెంచకుండా శుభ్రం చేయడం మరిచిపోవద్దు.