మీరు ఇప్పటికీ బిజినెస్ రియాలిటీ షో షార్క్ టాంక్ ఇండియాను చూడకపోతే మీరు చాలా మిస్సవుతున్నట్లే. ప్రపంచంలోనే టాప్ ర్యాంక్ బిజినెస్ రియాలిటీ షోల్లో ఒకటైన షార్క్ ట్యాంక్ మొదటి నుంచి ఎంతో అటెన్షన్ సంపాదించింది. 


ఈ షోను మొదట 2001లో జపాన్‌లో లాంచ్ చేశారు. నిపోన్ టీవీలో ‘టైగర్స్ ఆఫ్ మనీ’ పేరుతో ఈ షో ఎయిర్ అయింది. ఆ తర్వాత 2005లో డ్రాగన్స్ డెన్ పేరుతో యూకేలో 2005లో రూపొందించారు. ఆ తర్వాత 2009లో అమెరికాలో కూడా ప్రారంభించారు. 13 సీజన్ల నుంచి నిర్విరామంగా ఈ షో అమెరికాలో జరుగుతూనే ఉంది.


ఈ షో మనదేశంలో ప్రస్తుతం చివరి దశలో ఉంది. తమ ఉత్పత్తులను, వ్యాపార ఐడియాలను మార్కెటింగ్ చేసుకోవడానికి ఔత్సాహిక వ్యాపారులకు ఇది మంచి వేదికగా మారింది. ఇందులో పెట్టుబడులు పెట్టే వారిని ‘జడ్జిలు’ లేదా ‘షార్క్’లుగా పిలుస్తారు. ఎవరైనా మంచి వ్యాపార ఆలోచనలు ఉన్నవారు ఈ షోకు రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు.


ఇందులో జడ్జిలుగా వ్యవహరించే షార్క్‌ల వివరాలు ఇవే..


1. అమన్ గుప్తా
ఈయన ప్రముఖ ఆడియో బ్రాండ్ బోట్ లైఫ్ స్టైల్ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుతం కంపెనీ సీఎంవోగా కూడా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా 23 డీల్స్‌లో ఆయన రూ.6.69 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు రెడ్డిట్‌లోని ఒక పోస్టులో పేర్కొన్నారు.


2. నమితా థాపర్
ఎంక్యూర్ ఫార్మాసూటికల్స్ సీఈవో నమితా థాపర్ కూడా ఈ షోలో భారీగా ఇన్వెస్ట్ చేశారు. 15 డీల్స్‌లో రూ.4.48 కోట్ల వరకు ఆవిడ ఇన్వెస్ట్ చేయడం విశేషం. ఈ కంపెనీ ఐపీవోల ద్వారా రూ.4,000 కోట్లు సమీకరించే ఆలోచనలో ఉందని సమాచారం.


3. పీయూష్ బన్సల్
మనందరికీ ఎంతో పరిచయం ఉన్న లెన్స్ కార్ట్ కంపెనీ సీఈవో ఈయనే. మొత్తంగా 16 డీల్స్ ద్వారా రూ.4.19 కోట్లను ఈయన ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. లెన్స్‌కార్ట్‌కు ఈయన సహ వ్యవస్థాపకుడిగా కూడా ఉన్నారు. 2008లో వీరు లెన్స్‌కార్ట్‌ను స్థాపించారు.


4. అష్నీర్ గ్రోవర్
భారత్ పే సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అయిన అష్నీర్ గ్రోవర్ 15 వెంచర్లలో రూ.3.96 కోట్లను ఇన్వెస్ట్ చేశారు.


5. అనుదీప్ మిట్టల్
షాదీ.కాం వెబ్‌సైట్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన పేరెంట్ కంపెనీ సీఈవో ఈయనే. మొత్తంగా 16 డీల్స్‌లో రూ.3.71 కోట్ల పెట్టుబడులను ఈయన పెట్టారు.


6. వినీతా సింగ్
షుగర్ కాస్మోటిక్స్ సహ వ్యవస్థాపకులు వినీతా సింగ్ మొత్తంగా ఆరు డీల్స్‌ను ఫైనల్ చేశారు. వీటిలో రూ.1.52 కోట్ల పెట్టుబడులను పెట్టారు.