Sugar Companies Shares: ఇవాళ్టి ‍(మంగళవారం) వీక్‌ మార్కెట్‌లోనూ, ఇంట్రా డే ట్రేడింగ్‌లో చక్కెర కంపెనీల షేర్లు ఫోకస్‌లోకి వచ్చాయి, 13 శాతం వరకు లాభపడ్డాయి. 


ఉగర్ షుగర్స్ (Ugar Sugars) 13 శాతం ర్యాలీ చేసి రూ.75.35కి చేరుకోగా, శ్రీ రేణుక షుగర్స్ ‍‌(Shree Renuka Sugars), అవధ్ షుగర్ అండ్ ఎనర్జీ (Avadh Sugar & Energy), ఉత్తమ్ షుగర్ (Uttam Sugar), దాల్మియా భారత్ షుగర్ (Dalmia Bharat Sugar), ధంపూర్ షుగర్ ‍‌(Dhampur Sugar), త్రివేణి ఇంజినీరింగ్ (Triveni Engineering), ద్వారికేష్ షుగర్ (Dwarikesh Sugar), బల్‌రాంపూర్ చినీ మిల్స్ ‍‌(Balrampur Chini Mills) 2 నుంచి 5 శాతం వరకు పెరిగాయి. 


రేటింగ్ ఏజెన్సీ ICRA గణాంకాల ప్రకారం, పెరిగిన చక్కెర ఉత్పత్తులు & ఇథనాల్‌ రేట్ల దన్నుతో, FY23లో షుగర్‌ కంపెనీల ఆపరేటింగ్ మార్జిన్‌లు 13 శాతం నుంచి 13.5 శాతం పరిధిలో ఉండే అవకాశం ఉంది. 


ICRA ఆదాయ అంచనాలు
చక్కెర రియలైజేషన్లు, ఇథనాల్ రియలైజేషన్లు, ఆరోగ్యకరమైన చక్కెర ఎగుమతి (FY22 కంటే తక్కువగా ఉండే అవకాశం), ఇంటిగ్రేటెడ్‌ షుగర్‌ మిల్స్‌లో మెరుగుపడిన ఇథనాల్ వాల్యూమ్స్‌ వల్ల  FY23లో చక్కెర కంపెనీల ఆదాయాలు స్థిరంగా ఉండవచ్చని ICRA అంచనా వేసింది. అందువల్లే ఇవాళ్టి బలహీన మార్కెట్‌లోనూ చక్కెర షేర్లు బలంగా పెరిగాయి.


రేణుక షుగర్స్
శ్రీ రేణుక షుగర్స్ ఇవాళ ఇంట్రా డే ట్రేడ్‌లో 5 శాతం ర్యాలీ చేసి, 11 సంవత్సరాల గరిష్ట స్థాయి రూ.68.70 ని తాకింది. 2011 సెప్టెంబరు తర్వాత గరిష్ట స్థాయిలో ట్రేడ్ అవుతోంది. గత నెల రోజుల్లో, S&P BSE సెన్సెక్స్‌లోని 3.5 శాతం నష్టంతో పోలిస్తే, ఈ స్టాక్ దాదాపు 30 శాతం లాభపడింది. 


గత 6 నెలల కాలంలో దాదాపు 18 శాతం వృద్ధితో సాదాసీదాగా కనిపించినా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) లెక్కేస్తే మాత్రం డబుల్‌ వాల్యూ కనిపిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో రూ.30.40 గా ఉన్న షేరు ధర, ఈ తొమ్మిదిన్నర నెలల కాలంలోనే 112 శాతం పెరిగి ఇవాళ్టి రూ.68.70 మార్క్‌ను టచ్‌ చేసింది.


దేశంలో మంచి రుతుపవనాల నేపథ్యంలో, రాబోయే సీజన్‌లో (అక్టోబర్-సెప్టెంబర్) కూడా చెరకు లభ్యత బాగుంటుందని శ్రీ రేణుక షుగర్స్ మేనేజ్‌మెంట్‌ అంచనా వేస్తోంది. కంపెనీ ఆర్థిక పనితీరు, మొత్తం వృద్ధి మీద మేనేజ్‌మెంట్‌ చాలా ఆశాజనకంగా ఉంది.


ప్రపంచంలోని అతి పెద్ద చక్కెర ఉత్పత్తి సంస్థల్లో శ్రీ రేణుక షుగర్స్ ఒకటి. అంతేకాదు, ప్రపంచంలోని అతి పెద్ద షుగర్‌ రిఫైనర్లలోనూ ఇది ఒకటి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.