Nifty 50: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం మధ్యలో అమెరికా జోక్యంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీని ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఫలితంగా సోమవారం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుప్పకూలాయి. వారంలోని మొదటి ట్రేడింగ్ రోజు భారీ పతనంతో ప్రారంభమైంది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే ఉదయం 9:25 గంటలకు సెన్సెక్స్ 700 పాయింట్లు పడిపోయింది. NSE నిఫ్టీ కూడా 182.90 పాయింట్లు తగ్గి 24,929.50 వద్ద ప్రారంభమైంది. ఇన్ఫోసిస్ షేర్లలో 2 శాతం క్షీణత కనిపించింది.
గత వారం భారత మార్కెట్లు చాలా స్థిరంగా పెరుగుదలను సూచించాయి. ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత ఈక్విటీలు గత వారం పాజిటివ్‌గా ముగిశాయి. శుక్రవారం, బిఎస్‌ఇ సెన్సెక్స్ 1,046.30 పాయింట్లు లేదా 1.29 శాతం పెరిగి 82,408.17 వద్ద స్థిరపడగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 319.15 పాయింట్లు లేదా 1.29 శాతం పెరిగి 25,112.40 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 1,289.57 పాయింట్లు (1.58 శాతం) లాభపడింది. నిఫ్టీ 393.8 పాయింట్లు (1.59 శాతం) జోడించింది, ఇది మధ్యప్రాచ్య ఆందోళనల మధ్య కూడా స్థిరమైన పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను సూచిస్తుంది.
అయితే ఇవాళ ఉదయం 8:52 గంటలకు GIFT నిఫ్టీ 24,998.50 వద్ద ప్రారంభమైంది. ప్రీ-ఓపెన్ ట్రేడింగ్ గంటలో, సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా పడిపోయి 81,700 వద్ద ట్రెడ్ అవ్వగా, నిఫ్టీ 170 పాయింట్లకుపైగా నష్టపోయి 24,940 కి పడిపోయింది. తర్వాత మార్కెట్లు ప్రారంభమైనప్పుడు కూడా దేశీయ సూచీలు భారీగా పడిపోయాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకుపైగా పడిపోయి 81,889 వద్ద నిలిచింది. నిఫ్టీ 136 పాయింట్లు తగ్గి 24,976 వద్ద ట్రేడవుతోంది.
30 షేర్ల సెన్సెక్స్‌లో భారత్ ఎలక్ట్రానిక్స్, భారతి ఎయిర్‌టెల్ మాత్రమే పాజిటివ్‌గా ఉన్నాయి. ఇన్ఫోసిస్, HCL టెక్, హిందూస్తాన్ యూనిలీవర్, ఎటర్నల్, పవర్‌గ్రిడ్ ఆధిపత్యం చెలాయించాయి. మార్కెట్ మొదటి గంటల్లో నిఫ్టీ మైక్రోక్యాప్ 250 భారీగా నష్టపోయింది. మొత్తం ఐటీ ఇండెక్స్ 1.26 శాతం నష్టపోయింది.
ఈరోజు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 17 పైసలు తగ్గి రూ.86.76కు చేరుకుంది. ఒక రోజు ముందు రూపాయి మారకపు విలువ 86.59 వద్ద ముగిసింది.
జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వి.కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఇరాన్ మూడు అణు స్థావరాలపై అమెరికా బాంబు దాడులు పశ్చిమ ఆసియాలో సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. అయినప్పటికీ, మార్కెట్‌లో ప్రభావం చాలా స్వల్పంగానే ఉంటుందని అన్నారు.
ప్రపంచ ట్రెండ్, విదేశీ పెట్టుబడిదారుల వ్యాపార కార్యకలాపాలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ చీఫ్ వైస్ రీసెర్చ్ అజిత్ మిశ్రా ప్రకారం, ఈ వారం ప్రపంచ సూచిక మార్కెట్‌కు చాలా ముఖ్యమైందిగా పేర్కొన్నారు. దీనిలో అందరి దృష్టి ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తత, US ఆర్థిక డేటా, ఫెడరల్ రిజర్వ్ అధికారుల వ్యాఖ్యలపై ఉంటుందనిఅన్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తత ప్రభావంమోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లోని వెల్త్ మేనేజ్‌మెంట్ చీఫ్ రీసెర్చ్ సిద్ధార్థ్ ఖేమ్కా మాట్లాడుతూ, భవిష్యత్తులో ప్రపంచ సూచికలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెప్పారు. US తయారీ, సేవా PMI డేటాతో పాటు, పెట్టుబడిదారులు భౌగోళిక రాజకీయ రంగంలో మరిన్ని పరిణామాలను గమనిస్తూ ఉంటారు అని అభిప్రాయపడ్డారు.