Tirumala Laddu: తిరుమల శ్రీనివాసుడిడ దర్శనానికి లక్షల మంది భక్తులు వస్తుంటారు. ముందుగానే దర్శన టికెట్లు కొనుగోలు చేసి స్వామి దర్శనం చేసుకుంటారు. రద్దీ లేకుండా ప్రశాంతంగా దేవుణ్ని చూసి తరిస్తారు. ఇంత వరకు బాగానే ఉన్నా... ఆ తర్వాత ప్రసాదం కోసం మాత్రం క్యూలైన్‌లో నిలబడాల్సి వస్తుంది. అక్కడే రద్దీ ఎక్కువగా ఉంటోంది. అందకే దీన్ని నియంత్రించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త ఆలోచన చేసింది. లడ్డూ కియోస్క్‌లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా కోడ్ జనరేట్ చేసుకుంటే లడ్డూ కేంద్రంలో రద్దీని కొంత వరకు తగ్గించవచ్చని ఆలోచిస్తోంది. 

అందుబాటులోకి లడ్డూ కియోస్క్‌లు

తిరుమలలో లడ్డూ కౌంటర్ వద్ద ఎక్కువ సమయం రద్దీ ఉంటోంది. దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రయోగాత్మకంగా కియోస్క్‌లను ప్రవేశ పెట్టింది. వీటిని ఆదివారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక్కడ ఓ కోడ్‌తో ఉన్న టికెట్‌ను తీసుకొని లడ్డూ కౌంటర్‌లో ఇస్తే వెంటనే లడ్డూలు ఇస్తారు. లడ్డూ కౌంటర్‌కు వెళ్లి డబ్బులు చెల్లించి ప్రసాదం తీసుకునే తిప్పలు తప్పించేందుకు ఈ విధానం అమలులోకి తెచ్చారు. 

ఐదు కియోస్క్‌లు ప్రారంభం 

తిరుమలలో ఆదివారం ఐదు కియోస్క్‌లను అధికారులు ప్రారంభించారు. ఈ కియోస్క్‌లను యూనియన్‌ బ్యాంక్, కెనరా బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. లడ్డూ విక్రయ కేంద్రం వద్దే ఐదింటిని స్టార్ట్ చేశారు. ఎంబీసీ విచారణ కేంద్రం వద్ద మరో మూడు ఏర్పాటు చేశారు. సీఆర్వో విచారణ కేంద్రం, శ్రీపద్మావతి విచారణ కేంద్రం, ప్రముఖ అతిథిగృహాల వద్ద కూడా పెట్టాలని చూస్తున్నారు. 

లడ్డూ టికెట్స్‌ ఎలా పొందాలి?శ్రీనివాసుడి భక్తులు తమ దర్శన టికెట్‌ నంబర్‌ను కియోస్క్‌లో ఎంటర్ చేయాలి. తర్వాత తనకు ఎన్ని లడ్డూలు కావాలనే విషయం కూడా అక్కడే ఎంటర్ చేయాలి. తర్వాత క్యూఆర్ కోడ్ వస్తుంది. అ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లడ్డూలు ఎన్ని కావాలో అంత నగదు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత ఓ రిసీట్ వస్తుంది. దాన్ని తీసుకెళ్లి లడ్డూ కౌంటర్‌లో ఇవ్వాలి. అప్పుడు వాళ్లు మీకు కావాల్సిన లడ్డూలు అందజేస్తారు. 

అదనంగా లడ్డూలు కావాల్సిన వాళ్లు నగదు చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి టైంలోనే లడ్డూల కోసం రద్దీ నెలకొంటోంది. దాదాపు వచ్చిన భక్తులంతా కూడా అదనపు లడ్డూల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగానే లడ్డూ కౌంటర్‌లో రద్దీ ఉంటోంది. దీన్ని నియంత్రించేందుకు ఈ కియోస్క్‌లను ఏర్పాటు చేసింది. 

టికెట్‌ లేకపోయినా లడ్డూ టికెట్లు పొందొచ్చు

ఈ కియోస్క్‌లో టికెట్‌ ఉన్న భక్తులతోపాటు టికెట్ లేని భక్తులు కూడా లడ్డూలు కొనుగోలు చేయవచ్చు. తమ ఆధార్‌ నెంబర్ ఎంటర్ చేసి లడ్డూల టికెట్‌ పొందవచ్చు.  అయితే ఆధార్‌ ద్వారా లడ్డూలు పొందాలనే భక్తులకు రెండు మాత్రమే ఇస్తున్నారు. దీన్ని నాలుగుకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఈ కియోస్క్‌ల ద్వారా వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఇచ్చే ప్రక్రియపై వర్క్ చేస్తున్నారు. ఇది కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.