Record Number Demat Accounts Opened In FY24: గత ఆర్థిక సంవత్సరంలో ‍‌‍(2023-24) దేశీయ మార్కెట్‌లో అద్భుతమైన ర్యాలీ నమోదైంది. 31 మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, BSE సెన్సెక్స్ 25 శాతానికి పైగా లాభపడగా, NSE నిఫ్టీ50 28 శాతానికి పైగా పెరిగింది. స్టాక్ మార్కెట్‌లోని ఈ ర్యాలీ కొత్త ఇన్వెస్టర్లను మార్కెట్ వైపు ఆకర్షించింది, సాదర స్వాగతం పలికింది.


తొలిసారిగా 15 కోట్లు దాటిన నంబర్‌
2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 3.7 కోట్ల కొత్త డీమ్యాట్ ఖాతాలు ఓపెన్‌ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే, 01 ఏప్రిల్ 2023 నుంచి 31 మార్చి 2024 వరకు, ప్రతి నెలా మార్కెట్‌లో సగటున 30 లక్షలకు పైగా కొత్త డీమ్యాట్ ఖాతాలు తెరవబడ్డాయి. ట్రేడింగ్‌ జరగని రోజులను కూడా కలుపుకుని, మొత్తం 365 రోజులనూ పరిగణనలోకి తీసుకుంటే, రోజుకు సగటున ఒక లక్షకు పైగా డీమ్యాట్‌ ఖాతాలు ప్రారంభమయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా మొత్తం డీమ్యాట్ ఖాతాదార్ల సంఖ్య 15 కోట్లు దాటింది.


ఒక్క ఏడాదిలోనే భారీగా పెరిగిన నంబర్‌
2023-24 ఆర్థిక సంవత్సరంలో, ప్రధాన డిపాజిటరీలు 'సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్' (CDSL), 'నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ' (NSDL) రెండింటిలో ప్రారంభమైన మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 15.14 కోట్లకు చేరుకుంది. ఈ సంఖ్య ఏడాది క్రితం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 11.45 కోట్లుగా ఉంది. ఈ లెక్కన, ఒక్క ఏడాదిలోనే డీమ్యాట్ ఖాతాల సంఖ్య 11.9 శాతం పెరిగింది.


4 సంవత్సరాల్లో 4 రెట్లు
ఇటీవలి సంవత్సరాల్లో భారత స్టాక్ మార్కెట్ పెట్టుబడిదార్ల సంఖ్యలో విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి కాలం నుంచి షేర్లలో డబ్బులు పెట్టే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో, భారతదేశంలో మొత్తం 4 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 16 కోట్ల స్థాయికి చేరువలో ఉంది. అంటే, కేవలం గత 4 ఏళ్లలోనే డీమ్యాట్ ఖాతాల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది.


లక్ష కోట్ల క్లబ్‌లో చేరుతున్న కంపెనీలు
గత కొన్నేళ్లుగా స్టాక్ మార్కెట్ అద్భుతమైన ర్యాలీని కనబరుస్తోంది. ఇది, ప్రజలకు అదనపు ఆదాయంగా కనిపిస్తోంది. అందుకే ఎక్కువ మంది జనం దలాల్‌ స్ట్రీట్‌లో షాపింగ్‌ కోసం వస్తున్నారు. ముఖ్యంగా, నవతరం పెట్టుబడిదార్లు పాత సంప్రదాయాలను లెక్క చేయడం లేదు. అధిక రాబడి కోసం ఎక్కువ రిస్క్‌ తీసుకుంటున్నారు. యువత తీసుకుంటున్న రిస్క్‌ కారణంగా, దేశీయ స్టాక్ మార్కెట్‌లో రూ.లక్ష కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన కంపెనీల సంఖ్య  గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెండింతలు పెరిగి 80కి చేరుకుంది. ఏడాది క్రితం ఇలాంటి కంపెనీల సంఖ్య 48 మాత్రమే.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: గవర్నర్ శక్తికాంత దాస్ ప్రసంగంలోని 10 కీలక విషయాలు