Sensex @ 65,000: 2021 అక్టోబర్ నుంచి ఈ ఏడాది ప్రథమార్ధం వరకు పారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) మన మార్కెట్‌ను గుల్లగుల్ల చేశారు. తమ పోర్ట్‌ఫోలియోలను ఖాళీ చేసి, లక్షల కోట్ల రూపాయలను వెనక్కు తీసుకున్నారు. సెన్సెక్స్, నిఫ్టీలను పీక్స్ నుంచి 15% వరకు పడేశారు. అయితే, మిగిలిన ఎమర్జింగ్ మార్కెట్లతో పోలిస్తే మనకు పోయింది చాలా తక్కువ. దేశీయ మ్యూచువల్ ఫండ్స్, రిటైల్ ఇన్వెస్టర్లు కలిసి ఎఫ్‌పీఐల అమ్మకాలను ఎదుర్కొన్నారు. గతంలో ఎన్నడూలేనంత డబ్బుల వరదను మార్కెట్‌లోకి పారించి, సూచీలు మరీ ఎక్కువగా పడిపోకుండా అడ్డుకున్నారు.
ప్రస్తుతానికి వస్తే, గత రెండు నెలలుగా ఎఫ్‌పీఐలు మళ్లీ కొనుగోళ్లు మొదలు పెట్టారు, నెట్ బయ్యర్స్‌గా మారారు. మంటలకు గాలి తోడైనట్లు వీరికి రిటైల్ ఇన్వెస్టర్లు జత కలిశారు. అందువల్లే, కనిష్ట స్థాయుల నుంచి మార్కెట్ బాగా పుంజుకుంది. జూన్ మధ్యలోని కనిష్ట స్థాయుల నుంచి ఇప్పటివరకు దాదాపు 15% పెరిగింది. ఈ నేపథ్యంలో, మార్కెట్ అంతర్లీన థీమ్ చాలా బుల్లిష్‌గా ఉందని మార్కెట్స్‌మోజో సీఐవో సునీల్ దమానియా చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని అంటున్నారు.
భారత్, గ్లోబల్ స్టాక్ మార్కెట్లను ట్రాక్ చేయడంలో దమానియాకు 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
అడపాదడపా కరెక్షన్‌లు కనిపించినా, మరో నాలుగు నెలల్లో లేదా ఈ ఏడాది డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 65000 మార్క్‌ను తాకుతుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఈ నాలుగు నెలల్లో, సెన్సెక్స్‌లో 10% జంప్ చూడవచ్చని దమానియా అంచనా వేశారు.
మార్కెట్లు రెండంకెల స్థాయిలో పుంజుకునే సమయంలో, లేదా ర్యాలీని పునఃప్రారంభించే ముందు కొన్ని కరెక్షన్లు లేదా సైడ్‌వేస్ సహజం. 2022 మొదటి సగం కంటే రెండో సగం చాలా మెరుగ్గా ఉంటుందని దమానియా పేర్కొన్నారు. ఫెడ్ రేట్ల పెంపు ఉన్నప్పటికీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ పెరుగుతుందని విశ్వసిస్తున్నారు. అయితే, అప్‌సైడ్ జర్నీ అంత సాఫీగా సాగకపోవచ్చు.
ఒకవేళ ఈ నెలలో (సెప్టెంబర్) మార్కెట్ గరిష్ట స్థాయిని తాకినా, తాకకపోయినా; దీపావళి నాటికి సెంటిమెంట్లు చాలా మెరుగ్గా ఉంటాయట. దీనికి కూడా దమానియా ఒక కారణం చెప్పారు. జీఎస్‌టీ (GST), ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఉత్సాహంగా ఉన్నాయి కాబట్టి, మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం డబ్బును ఖర్చు చేస్తూనే ఉంటుంది. దానివల్ల, రోడ్లు, ఓడరేవులు, రైల్వేలు వంటివాటికి కేటాయింపులు పెరుగుతాయి, క్యాపిటల్ గూడ్స్ ఇది పాజిటివ్ నోట్.
రక్షణ రంగం, రక్షణ ఎగుమతుల మీద ప్రభుత్వం బాగా ఖర్చు చేస్తోంది. అందువల్ల, డిఫెన్స్ కంపెనీలు అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తాయని ఆయన నమ్ముతున్నారు. భారత్ డైనమిక్స్ లేదా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ స్టాక్స్‌ను చూస్తే ఈ విషయం అర్దమవుతుంది.
నిఫ్టీ50 పరిస్థితి ఏంటి?
నిఫ్టీ కూడా 18000 మార్క్‌ను అందుకుంటుందన్నది సునీల్ దమానియా మాట. ఈ జర్నీలో చాలా అస్థిరంగా కదిలే అవకాశం ఉందట.
డి-స్ట్రీట్ ర్యాలీని ఏ రంగాలు లీడ్ చేస్తాయి?
2008 నుంచి తక్కువ పనితీరు కనబరుస్తున్నప్పటికీ, క్యాపిటల్ గూడ్స్ & ఇన్‌ఫ్రా రంగం బాగానే ఉన్నాయని మార్కెట్స్‌మోజో డేటా చెబుతోంది. ఆటో రంగానికి కూడా డిమాండ్ అద్భుతంగా ఉంది. మెటల్ ధరల్లో సవరణలు ఆటో కంపెనీలకు టెయిల్‌విండ్‌గా పనిచేస్తాయి. కాబట్టి, ఆటో కంపెనీలు మంచి పనితీరు కనబరిస్తే, ఆటో అనుబంధ కంపెనీలు కూడా దానిని అనుసరిస్తాయి. ఫైనల్‌గా చూస్తే... క్యాపిటల్ గూడ్స్, ఆటో, ఆటో అనుబంధ సెక్టార్లు బాగా ప్లే అవుతాయని దమానియా గట్టిగా చెబుతున్నారు.