SEBI On Stock Market Influencers: స్టాక్‌ మార్కెట్‌లో క్రయవిక్రయాలపై సలహాలు ఇస్తూ పెట్టుబడిదార్లను ప్రభావితం చేస్తున్న అన్‌రిజిస్టర్డ్‌ ఫిన్‌ఫ్లుయెన్సర్ల ‍‌పై (ఫైనాన్షియల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లు), స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ 'సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా' (SEBI) కొరడా ఝళిపించింది. రెగ్యులేటర్‌ వద్ద రిజిస్టర్‌ కాని ఫిన్‌ఫ్లూయెన్సర్ల (Unregistered Fininfluencers) దూకుడుకు కళ్లెం వేసేందుకు మరో కొత్త ఆర్డర్‌ రిలీజ్‌ చేసింది. స్టాక్ మార్కెట్‌ గురించి అవగాహన పెంచుతున్నామనే పేరిట, ఫిన్‌ఫ్లుయెన్సర్లు ఇకపై ప్రస్తుత మార్కెట్ ధరలు ఉపయోగించకుండా సెబీ నిషేధం విధించింది. ప్రజలకు అవగాహన కల్పించడానికి, మూడు నెలల లోపు ధరలను మాత్రమే ఉదాహరణగా తీసుకోవలసి ఉంటుంది.  

2025 జనవరి 29, బుధవారం నాడు, సెబీ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఆ సర్క్యులర్‌లో FAQs (Frequently Asked Questions) జారీ చేసింది. వాటిలోని ఒక ప్రశ్నలో... అవగాహన & సలహా లేదా సిఫార్సు మధ్య వ్యత్యాసం గురించి సెబీ వివరించింది. స్టాక్‌ మార్కెట్‌ పరిజ్ఞానం అందించే వ్యక్తి నిషేధిత కార్యకలాపాలలో (షేర్ల కొనుగోళ్లు & అమ్మకాలపై సలహాలు ఇవ్వడం) పాల్గొనకూడదు. సెబీ దగ్గర రిజిస్టర్‌ చేసుకోని వ్యక్తి.. తన సంభాషణ లేదా ప్రసంగం, వీడియో, టిక్కర్, స్క్రీన్ షేరింగ్ మొదలైన వాటి ద్వారా షేర్ల భవిష్యత్‌ ధరలపై సలహా ఇవ్వకూడదు. షేర్ల క్రయవిక్రయాలను సిఫార్సు చేయడానికి ఆ స్టాక్‌ పేరును లేదా కోడ్‌ను ఉపయోగించకూడదు. లైవ్‌ స్టాక్స్‌ ధరలకు సంబంధించి మూడు నెలల లోపు గణాంకాలను మాత్రమే స్టాక్‌ మార్కెట్‌ ఎడ్యుకేటర్లు వినియోగించాలి. దీనికంటే ఎక్కువ కాలం నాటి ధరలను ఉదహరిస్తూ కంపెనీ షేర్లు లేదా స్టాక్‌ కోడ్‌ల గురించి చెబుతూ సలహాలు ఇవ్వకూడదు.

వాస్తవానికి, సెబీ వద్ద రిజిస్టర్ చేసుకోని ఫైన్‌ఫ్లుయెన్సర్‌లు చాలా మంది ఉన్నారు & స్టాక్ మార్కెట్ పరిజ్ఞానం/ విద్య పేరుతో స్టాక్స్‌ కొనమని లేదా విక్రయించమని సలహాలు ఇస్తూనే ఉన్నారు. వీళ్లను నమ్మి కోట్లాది మంది చిన్న పెట్టుబడిదార్లు ‍‌(Small investors) నష్టపోతున్నారు. స్మాల్ ఇన్వెస్టర్ల ఆర్థిక భద్రత కోసం తీసుకున్న తాజా చర్యతో అన్‌రిజిస్టర్డ్‌ ఫిన్‌ఫ్లుయెన్సర్ల దూకుడు తగ్గుతుంది, వాళ్ల సబ్‌స్క్రైబర్ బేస్‌ కూడా భారీగా తగ్గిపోవచ్చు. 

వాస్తవానికి, స్టాక్‌ మార్కెట్‌ పరిజ్ఞానం అందించడంపై ఎవరిపైనా నిషేధం లేదు. అయితే, సెబీ దగ్గర రిజిస్టర్‌ చేసుకున్న వ్యక్తులు మాత్రమే పెట్టుబడి సలహాలు ఇవ్వాలి, ఇతరులు ఇవ్వకూడదు.

SEBI సర్క్యులర్‌లోని కీలక నిబంధనలు:

- రిజిస్టర్‌ చేసుకోని వ్యక్తులు పెట్టుబడి సలహాలు ఇవ్వకూడదు- తప్పుడు వాగ్దానాలు చేయకూడదు- నియమాలను ఉల్లంఘించే వ్యక్తులతో స్టాక్ బ్రోకర్లు, ఎక్స్ఛేంజీలు, ఆర్థిక సంస్థలకు ఎలాంటి సంబంధం ఉండకూడదు- ఒక ఆర్థిక సంస్థ తప్పుడు వాదనలు చేసే వారితో కలిసి పని చేస్తే, ఆ సంస్థ కూడా జవాబుదారీగా మారుతుంది- స్టాక్ మార్కెట్ గురించి బోధించడం పర్వాలేదు, కానీ చిట్కాలు లేదా అంచనాలను అందించకూదు- సెబీలో నమోదు చేసుకున్న సంస్థలకు, ఆర్థికంగా & ఆర్థికేతరంగా, ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌తోనూ సంబంధం ఉండకూడదు- నియమాలను ఉల్లంఘించే వారితో డబ్బు, సిఫార్సులు లేదా కస్టమర్ డేటాను మార్పిడి చేయకూడదు- నిబంధనలను ఉల్లంఘించే వారిపై జరిమానాలు, సస్పెన్షన్ లేదా రిజిస్ట్రేషన్ రద్దు కూడా ఉంటుంది- ఈ నియమాలు 29 ఆగస్టు 2024 నుంచి అమలులో ఉన్నాయి

మరో ఆసక్తికర కథనం: మీరు వదిలేసిన బ్యాంక్‌ అకౌంట్‌లో చాలా డబ్బు ఉండొచ్చు - ఆ డబ్బును ఇలా విత్‌డ్రా చేయండి