Adani-Hindenburg Issue: 2023 జనవరి 24న అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన వివాదాస్పద నివేదికపై, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల కమిటీ చేస్తున్న దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. భారత క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ (SEBI), ఈ నెల 2వ తేదీన (ఆదివారం) ఆ కమిటీకి వివరణాత్మక ప్రెజెంటేషన్ అందించిందని సమాచారం. సెబీ చైర్‌పర్సన్ మధాబి పురి బచ్ ఈ బ్రీఫింగ్ ఇచ్చారు. ఇదే ఆమె మొదటి, ముఖ్యమైన వివరణ అని మార్గెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక అవసరమైతే తప్ప కమిటీ ముందు ఆమె హాజరుకారని తెలుస్తోంది. అయితే, ఆరుగురు సభ్యుల కమిటీకి అవసరమైన అన్ని సమాచారాలను సెబీ అందిస్తూనే ఉంటుంది.
హిండెన్‌బర్గ్ నివేదిక కేసులో సెబీ కూడా సొంతంగా దర్యాప్తు చేస్తోంది, తన నివేదికను సుప్రీంకోర్టుకు అందజేస్తుంది.
పబ్లిక్, ప్రైవేట్ కంపెనీల వివరాలు
అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీలతో పాటు, ప్రైవేట్ కంపెనీల్లోని వాటా లావాదేవీలపై సుప్రీంకోర్టు కమిటీకి సెబీ వివరించినట్లు ఈ విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు. ఆఫ్‌షోర్ కంపెనీలు, ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ (FII) హోల్డింగ్స్, మినిమమ్ స్టాక్ మార్కెట్ ఫ్లోట్స్ వంటి ఇతర అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
షార్ట్ సెల్లింగ్ నియంత్రణకు సంబంధించి తన విధానం (2007లో సెబీ ప్రవేశపెట్టింది), ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లలో అనుసరించే అధికార విధానాలపై బచ్ ప్యానెల్‌కు వివరించారు. పెట్టుబడిదార్ల రక్షణ కోసం రెగ్యులేటర్ ప్రస్తుతం అమలు చేస్తున్న వ్యవస్థలు, వాటిని మరింత బలోపేతం చేయడానికి ఏం చేయవచ్చో సెబీ చీఫ్ తెలియజేశారు.
స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల నుంచి సమాచారం సేకరణ
స్టాక్ ధరల్లో విపరీతమైన కదలిక వెనుక ఏదైనా కృత్రిమ కారణం ఉందేమో పరిశీలించడానికి.. హిండెన్‌బర్గ్ నివేదికకు ముందు, తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల కొనుగోలుదార్లు, అమ్మకందార్ల సమాచారాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి సెబీ సేకరించింది.
యుఎస్ ట్రేడెడ్ బాండ్లు, నాన్ ఇండియన్ ట్రేడెడ్ డెరివేటివ్ ఇన్‌స్ట్రుమెంట్లలో అదానీ గ్రూప్ కంపెనీపై షార్ట్ పొజిషన్లను తాను క్రియేట్ చేసినట్లు, జనవరి 24 వెల్లడించిన నివేదికలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వెల్లడించింది.
సెక్యూరిటీస్ మార్కెట్‌కు సంబంధించి అదానీ గ్రూప్ కంపెనీల్లో పరిశోధించడానికి, "హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రచురణకు ముందు, పోస్ట్ చేసిన తర్వాత" మార్కెట్ కార్యకలాపాల్లో వివరీత తేడాలపై దర్యాప్తు ఒక బృందాన్ని సెబీ ఏర్పాటు చేసింది. ఈ బృందం, సుప్రీంకోర్టు నియమిత కమిటీకి అవసరమైన సహాయాన్ని అందిస్తుంది.
తన దర్యాప్తును రెండు నెలల్లోగా ముగించి సుప్రీంకోర్టు కమిటీకి ఆ నివేదికను సమర్పించాలని స్టాక్ మార్కెట్స్ నియంత్రణ సంస్థ భావిస్తోంది.
జనవరి 24 నాటి హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలోని ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించినప్పటికీ, గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీలు కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా 125 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయాయి.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలోని నిజానిజాలను తేల్చేందుకు ఒక విచారణ కమిటీని సుప్రీంకోర్టు నియమించడాన్ని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ స్వాగతించారు.