SBI WhatsApp Banking Service: సాంకేతికత పెరుగుతున్న కొద్దీ బ్యాంక్‌ సేవలు సులభంగా మారుతున్నాయి. ఒకప్పటి భారీ వరుసలు, వంతు వచ్చే వరకు గంటల తరబడి వేచి చూడడం వంటివి ఇప్పుడు బ్యాంకుల్లో కనిపించడం లేదు. చాలా పనులు నెట్‌ బ్యాకింగ్‌ లేదా యాప్‌ ద్వారా పూర్తవుతున్నాయి. 


అయితే.. కొన్ని పనుల కోసం ఇప్పటికీ బ్యాంక్‌ బ్రాంచ్‌కు ఖాతాదారులు వెళ్లాల్సి వస్తోంది. మిగిలినవారి సంగతేమోగానీ.. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు (సీనియర్‌ సిటిజన్లు) ఇది నరకయాతనగా మారింది. వృద్ధుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దాదాపుగా అన్ని బ్యాంకులు వాళ్లకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నాయి. వాళ్లు బ్యాంక్‌ వద్దకు రానవసరం లేకుండానే చాలా సేవలు అందిస్తున్నాయి. పెరిగిన సాంకేతికతతో ఇది సాధ్యమవుతోంది.


ఒక్క మెసేజ్‌తో పని పూర్తవుతుంది
దేశంలో అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించింది. ఇప్పుడు, పెన్షన్ స్లిప్ పొందడానికి సీనియర్ సిటిజన్లు బ్యాంక్‌ బ్రాంచ్‌ వరకు వెళ్లి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాట్సాప్‌లో కేవలం ఒక సందేశం పంపితే చాలు, ఈ ఫెలిలిటీ పొందవచ్చు. దీని గురించి తన ట్విట్టర్‌ హ్యాండిల్‌లోనూ SBI సమాచారం పోస్ట్‌ చేసింది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి, వాట్సాప్‌లో (WhatsApp) 9022690226 నంబర్‌కు హాయ్ అనే సందేశం పంపవలసి ఉంటుంది.






SBI బ్యాంక్ వాట్సాప్ ఫెసిలిటీ కోసం 'హాయ్' అని మెసేజ్ చేసిన తర్వాత, మీకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి, వాటిలో బ్యాలెన్స్ సమాచారం, మినీ స్టేట్‌మెంట్, పెన్షన్ స్లిప్ ఉంటాయి. పెన్షన్ స్లిప్‌ మీద క్లిక్ చేసి, పెన్షన్ స్లిప్ పొందాలనుకుంటున్న నెలను ఇక్కడ ఎంచుకోండి. కొద్దిసేపట్లోనే మీకు పెన్షన్ స్లిప్ అందుతుంది.


SBI వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్
ఒక్క వృద్ధులకే కాదు, మిగిలిన ఖాతాదారులు అందరికీ SBI వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్ ఉపయోగపడుతుంది. ఈ సదుపాయం కింద, SBI కస్టమర్ తన ఖాతాలోని నగదు నిల్వ సమాచారాన్ని, మినీ స్టేట్‌మెంట్‌ను పొందవచ్చు. ఈ సదుపాయాన్ని మీరు అందుకోవాలంటే, ముందుగా మీరు రిజిస్టర్ చేసుకుని ఉండాలి. ఇందుకోసం, 'WARG' అక్షరాలను టైప్‌ చేసి, స్పేస్ ఇచ్చి మీ ఖాతా నంబర్‌ను నమోదు చేసి 7208933148 నంబర్‌కు SMS పంపాలి. మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ నుంచి మాత్రమే ఈ SMS పంపాలి. దీంతో, మీ రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది.


రిజిస్ట్రేషన్ తర్వాత, స్టేట్‌ బ్యాంక్‌కు చెందిన 90226 90226 నంబర్ నుంచి మీ వాట్సాప్ నంబర్‌కు ఒక సందేశం వస్తుంది. ఇప్పుడు మీరు ఆ నంబర్‌కు 'హాయ్' సందేశాన్ని పంపవచ్చు. లేదా, SBI నుంచి వచ్చిన మెసేజ్‌కు రిప్‌లై ఇవ్వవచ్చు. ఇది కాకుండా, SBI బ్యాంకింగ్‌ సేవలను పొందేందుకు వాట్సాప్‌లో ఇచ్చిన సూచనలను అనుసరించవచ్చు.