Sam Altman Comments On Former Colleagues: మైక్రోసాఫ్ట్‌ (Microsoft)లో చేరిక అనంతరం ఓపెన్ ఏఐ (OpenAI) మాజీ సహ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్ (Sam Altman) తన మాజీ సహచరులపై ప్రసంశలు కురిపించారు. చరిత్ర పుస్తకాలలోకి ఎక్కే ఒక అద్భుతమైన పని చేస్తున్నారని కొనియాడారు. వారిని చూసి తాను చాలా గర్వపడుతున్నట్లు చెప్పారు. వారితో  ఏదో ఒక విధంగా కలిసి పని చేయడం సంతోషంగా ఉందని, ‘ఒక టీం, ఒక మిషన్’ అంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఓపెన్ ఏఐ లీడర్‌షిప్ టీమ్, ముఖ్యంగా మీరా బ్రాడ్ (Mira Brad), జాసన్ (Jason) అద్భుతంగా పని చేస్తున్నారని, అది చరిత్రలో నిలిచిపోతుందని, వారిని చూస్తే చాలా గర్వంగా ఉందని ఆల్ట్‌మాన్ అన్నారు. 


సామ్ ఆల్ట్‌మన్‌ని OpenAI కంపెనీ CEO బాధ్యతల నుంచి తప్పించిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్(Microsoft) సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella)  కీలక ప్రకటన చేశారు. ఆల్ట్‌మన్‌తో పాటు గ్రెగ్ బ్రాక్‌మన్‌ (Greg Brockman) కూడా మైక్రోసాఫ్ట్‌లో చేరుతున్నట్టు ట్వీట్ చేశారు. ఇద్దరు OpenAI మాజీ ఉద్యోగులూ మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో చేరనున్నట్టు ప్రకటించారు. AI రీసెర్చ్ టీమ్‌ని వీళ్లిద్దరూ కలిసి లీడ్ చేస్తారని, వాళ్లకు కావాల్సిన వనరులను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 


OpenAI లో మైక్రో సాఫ్ట్ అతిపెద్ద వాటాదారుగా ఉంది. ఇప్పటి వరకు $13 బిలియన్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టింది.  OpenAIని అభివృద్ధి చెందేలా చూడటమే సత్య నాదెళ్ల, తన ప్రధాన ప్రాధాన్యత అని సామ్ ఆల్ట్‌మాన్ అన్నారు. తమ భాగస్వాములు, కస్టమర్‌లకు పూర్తి స్థాయిలో సేవలను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. OpenAI/Microsoft భాగస్వామ్యం దీన్ని సాధ్యం చేస్తుందని ఆల్ట్‌మాన్ Xలో పోస్ట్ చేశారు.


శామ్‌ ఆల్ట్‌మన్‌‌ను బలవంతంగా తప్పించిన ఓపెన్ ఏఐ
కంటెంట్‌ సెర్చ్‌ను కృత్రమ మేథకు జత చేసి, చాట్‌జీపీటీని సృష్టించిన శామ్‌ ఆల్ట్‌మన్‌ను CEO సీటు నుంచి బలవంతంగా దింపేస్తూ ఓపెన్‌ఏఐ కంపెనీ నిర్ణయం తీసుకుంది. శామ్‌ ఆల్ట్‌మన్ CEO పదవి నుంచి వైదొలిగారని, తాత్కాలిక CEOగా టెక్నాలజీ చీఫ్ మిరా మురాటిని నియమించినట్లు OpenAI డైరెక్టర్ల బోర్డు శుక్రవారం ప్రకటించింది. డైరెక్టర్ల బోర్డుతో అతను నిజాయితీగా వ్యవహరించడం లేదని, బోర్డు  బాధ్యతలకు అడ్డుపడుతున్నాడని పేర్కొంది. "శామ్‌ ఆల్ట్‌మన్‌ నాయకత్వంపై బోర్డుకు ఇకపై విశ్వాసం లేదు" అని ఆ ప్రకటనలో వెల్లడించింది. 


CEO సీటు నుంచి దిగిపోయినా... శామ్‌ ఆల్ట్‌మన్‌ కంపెనీలోనే కొనసాగుతారని, CEOకి రిపోర్ట్‌ చేస్తూ, తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తారని ఓపెన్‌ఏఐ డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. OpenAI CEO బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు శామ్‌ ఆల్ట్‌మన్ కూడా వెల్లడించారు, దీనిపై Xలో ట్వీట్‌ చేశారు. ఓపెన్‌ఏఐలో పని చేయడాన్ని తాను ఇష్టపడ్డానని, నిపుణులతో కలిసి పని చేయడాన్ని ఆస్వాదించానని, తన వల్ల ప్రపంచం కొంచెం మారిందని తాను నమ్ముతున్నానని ఆ ట్వీట్‌లో రాశారు. 


మరో కీలక పరిణామం
శామ్‌ ఆల్టమన్‌ను తప్పించిన గంటల వ్యవధిలోనే ఓపెన్‌ఏఐ కంపెనీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓపెన్‌ఏఐ కో-ఫౌండర్‌, ప్రెసిండెట్‌ గ్రెగ్‌ బ్రాక్‌మన్‌ (Greg Brockman) కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని గ్రెగ్‌ బ్రాక్‌మన్‌ స్వయంగా Xలో పోస్ట్‌ చేశారు. గత 8 సంవత్సరాలుగా తామంతా కలిసి సృష్టించిన అద్భుతాల పట్ల తాను గర్విస్తున్నాని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. శామ్‌ ఆల్ట్‌మన్‌ తొలగింపు తర్వాత ఓపెన్‌ఏఐని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు ట్వీట్‌లో వివరించారు.