Rupee vs US Dollar: రూపాయి విలువ మళ్లీ పాయే. ఎప్పటికప్పుడు కొత్త జీవితకాల కనిష్టాలకు దిగజారుతున్న రూపాయి విలువ, ఇవాళ్టి (సోమవారం) ట్రేడ్‌ ఓపెనింగ్‌లోనూ కూలబడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్‌లో ఆరంభం కావడమే 43 పైసలు కోల్పోయి గ్యాప్‌ డౌన్‌తో పాతాళ జర్నీని ప్రారంభించింది. ఉదయం 9.15 గంటల వద్ద జీవితకాల కనిష్ఠమైన 81.47 వద్ద ఓపెనైంది. ఆపై 81.52 కి పడిపోయింది. మునుపటి ముగింపు కంటే 43 పైసల పతనాన్ని నమోదు చేసింది.


మునుపటి (శుక్రవారం) సెషన్‌లో, రూపాయి 30 పైసలు క్షీణించి, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే తాజా జీవితకాల కనిష్ట స్థాయి 81.09 వద్ద ముగిసింది.


అమెరికన్ కరెన్సీ రోజురోజుకూ బలపడటం, పెట్టుబడిదారులలో రిస్క్ అవెర్స్‌ సెంటిమెంట్‌ (రిస్క్‌ తీసుకోవడానికి ఇష్టపడకపోవడం) మన యూనిట్‌ మీద ప్రభావం చూపాయి.


చివరి 9 సెషన్లలో 8 సార్లు రూపాయి కుప్పకూలింది, ఈ 8 సెషన్లలో 2.51 శాతం బలహీనపడింది. మొత్తంగా ఈ ఏడాది 8.5 శాతం పతనమైంది.


కారణాలు
అంతేగాక; ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు వడ్డీ రేట్ల పెంపులో యుఎస్ ఫెడ్ దూకుడు, మార్కెట్లు నష్టపోయినా పర్వాలేదన్న ఫెడ్‌ ఛైర్‌ వ్యాఖ్యలు, రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా భౌగోళికంగా రాజకీయ వేడి మళ్లీ పెరగడం, దేశీయ ఈక్విటీల్లో డౌన్‌ ట్రెండ్‌, కీలకమైన ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPI) పెట్టుబడులు వెనక్కు వెళ్లడం (ఔట్‌ ఫ్లో) వంటి కారణాలు ఫారెక్స్‌ ఇన్వెస్టర్ల ఆకలిని తగ్గించాయి. 


ఆర్‌బీఐ మీటింగ్‌
ఈ వారం జరగనున్న RBI సమావేశం మీద ఇప్పుడు ఫారెక్స్ ట్రేడర్ల ఫోకస్ ఉంది. RBI నిర్ణయాలు శుక్రవారం వెలువడతాయి. RBI కూడా మొండిగా ముందుకే వెళ్తుంది, కరెన్సీ మరింత బలహీనపడకుండా అడ్డుకోవడానికి 50 bps రేట్లు పెంచుతుందని మార్కెట్‌ భావిస్తోంది. 


ఆరు కీలక దేశాల కరెన్సీల బాస్కెట్‌ ఆధారంగా లెక్కించే డాలర్ ఇండెక్స్ ఇవాళ 0.67 శాతం పెరిగి 113.94 కి చేరుకుంది.


గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.58 శాతం తగ్గి 85.65 అమెరికన్‌ డాలర్లకు చేరుకుంది.


నెట్‌ సెల్లర్స్‌గా FPIలు
శుక్రవారం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FPI) మన క్యాపిటల్ మార్కెట్‌లో నికర విక్రయదారులుగా (నెట్‌ సెల్లర్స్‌) మారారు. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం వాళ్లు రూ.2,899.68 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.


సెప్టెంబర్ 16తో ముగిసిన వారానికి మన దేశ ఫారెక్స్ నిల్వలు 5.219 బిలియన్ డాలర్లు క్షీణించి 545.652 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.