Reliance industries Wyzr Brand: దేశంలో అత్యంత ధనిక పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ, కొత్త బిజినెస్‌ స్ట్రాటెజీలో ఉన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్ (Consumer Electronics), గృహోపకరణాల (Home Appliances) విభాగంలో పాతుకుపోవడానికి వ్యూహాన్ని సిద్ధం చేశారు. ఈ ప్లాన్‌ ప్రకారం, అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఎల్‌ఈడీ బల్బుల నుంచి ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వరకు అన్నింటిని ఉత్పత్తి చేసి, విక్రయిస్తుంది. 


రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ప్లాన్‌ ఇది
ప్రస్తుతం, మన దేశంలో, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్ అండ్‌ హోమ్‌ అప్లయెన్సెస్‌ సెగ్మెంట్‌లో విదేశీ కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ET రిపోర్ట్‌ ప్రకారం, దేశీయ మార్కెట్‌లో విదేశీ పెత్తనాన్ని సవాల్‌ చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించింది. ప్లాన్‌లో భాగంగా, "వైజర్ బ్రాండ్‌"తో (Wyzr Brand) 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులను భారీ స్థాయిలో తయారు చేస్తుంది. 


రెండు కంపెనీలతో చర్చలు
నివేదిక ప్రకారం.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నేరుగా కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలను ఉత్పత్తి చేయదు, వేరే కంపెనీలతో తయారు చేయిస్తుంది. వైజర్ బ్రాండ్‌తో ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తయారు చేసేందుకు దేశీయ కాంట్రాక్ట్ తయారీ కంపెనీలు డిక్సన్ టెక్నాలజీస్ ‍‌(Dixon Technologies), మిర్క్ ఎలక్ట్రానిక్స్‌తో (Mirc Electronics - ఒనిడా మాతృ సంస్థ) ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉంది.


రిలయన్స్ తీసుకొచ్చే ఉత్పత్తులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగమైన 'రిలయన్స్ రిటైల్' ‍‌(Reliance Retail), వైజర్ బ్రాండ్‌తో ఎయిర్ కూలర్‌ను ఇటీవలే విడుదల చేసింది. ఈ బ్రాండ్‌ను విస్తరించాలన్నది కంపెనీ ఆలోచన. టీవీ, ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్, ఎల్‌ఈడీ బల్బ్‌ వంటి వాటిని వేరే కంపెనీలతో తయారు చేయించి, వైజర్‌ బ్రాండ్‌తో అంబానీ కంపెనీ లాంచ్‌ చేయనుంది. ఈ బ్రాండ్ మార్కెట్‌లో మంచి వాటాను సాధించినప్పుడు, కంపెనీ తన సొంత ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, తయారీని ప్రారంభించవచ్చు.


ప్రస్తుతం, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్ విభాగంలో రిలయన్స్ ఉనికి పరిమితంగా ఉంది. 2022లో, అమెరికన్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ సన్మీనాకు ‍‌(Sanmina) చెందిన భారతీయ యూనిట్‌లో 50.1 శాతం వాటాను రూ.1,670 కోట్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌ కొనుగోలు చేసింది. చెన్నైలో 100 ఎకరాల్లో సన్మీనాకు తయారీ ఫ్లాంట్‌ ఉంది. వైజర్ బ్రాండ్ ఉత్పత్తులను కూడా ఆ ప్లాంట్‌లో తయారు చేయవచ్చు.


అయితే, ఈ స్కీమ్‌కు సంబంధించిన వివరాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 2024 మార్చి త్రైమాసిక ఫలితాలను మూడు రోజుల క్రితం విడుదల చేసిన RIL, అందులోనూ ఈ పథకం గురించి సమాచారం ఇవ్వలేదు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.