TCS Shares Buyback: దేశంలోనే అతి పెద్ద ఐటీ సర్వీసెస్‌ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షేర్ బైబ్యాక్ ఆఫర్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొంటే, వచ్చే మూడు నెలల్లో 5% నుంచి 17% వరకు లాభం సంపాదించే అవకాశం ఉంది. 5%-17% నంబర్లను చూసి తక్కువ అంచనా వేయవద్దు. టీసీఎస్‌ షేర్‌ ప్రస్తుతం రూ. 3,500 పైన ట్రేడ్‌ అవుతోంది కాబట్టి, మంచి మొత్తాన్ని పొందొచ్చు.


Q2 FY24 ఆర్థిక ఫలితాలను బుధవారం (11 అక్టోబర్‌ 2023) రోజున రిలీజ్‌ చేసిన టీసీఎస్‌, ₹17,000 కోట్ల షేర్ బైబ్యాక్‌ను కూడా ప్రకటించింది. నిన్నటి (గురువారం) ముగింపు ధర ₹3,542తో పోలిస్తే 17.5% ప్రీమియంతో, ఒక్కో షేరును ₹4,150 చొప్పున కొనుగోలు చేస్తుంది. మొత్తం 40.9 మిలియన్ షేర్లను బైబ్యాక్‌ చేస్తుంది. దీన్నుంచి ప్రయోజనం పొందాలనుకునే పెట్టుబడిదార్లు బైబ్యాక్‌లో షేర్లను టెండర్ చేయవచ్చు.


దాదాపు 6.15 మిలియన్ షేర్లు లేదా బైబ్యాక్‌లో 15% వాటాను స్మాల్‌ షేర్ హోల్డర్ల కోసం కంపెనీ రిజర్వ్ చేసింది. రికార్డ్‌ తేదీ నాటికి ₹2 లక్షల కంటే తక్కువ విలువైన టీసీఎస్‌ షేర్లను పోర్ట్‌ఫోలియోలో హోల్డ్‌ చేస్తున్న ఇన్వెస్టర్‌ను స్మాల్‌ ఇన్వెస్టర్‌/ రిటైల్‌ ఇన్వెస్టర్‌గా లెక్కిస్తారు. టీసీఎస్‌ షేర్ల బైబ్యాక్‌ కోసం రికార్డ్‌ డేట్‌ను ఇంకా ప్రకటించలేదు.


బైబ్యాక్‌ ద్వారా టీసీఎస్‌ కొనాలనుకున్న 40.9 మిలియన్ షేర్ల కంటే తక్కువ షేర్లను మొత్తం అందరు ఇన్వెస్టర్లు కలిసి టెండర్‌ చేస్తే, ఒక్కో ఇన్వెస్టర్‌ టెండర్‌ చేసిన అన్ని షేర్లను కంపెనీ కొంటుంది. ఇక్కడ యాక్సెప్టెన్స్‌ రేషియో (acceptance ratio) 100%గా ఉంటుంది. ఒకవేళ, కంపెనీ కొనాలనుకుంటున్న షేర్ల కంటే ఎక్కువ షేర్లను అందరు ఇన్వెస్టర్లు ఇవ్వజూపితే, దామాషా ప్రకారం ఆ షేర్లను కొంటుంది. ఈ కేస్‌లో యాక్సెప్టెన్స్‌ రేషియో తగ్గుతుంది.


అంగీకార నిష్పత్తిని (acceptance ratio) బట్టి పెట్టుబడిదార్లు 5% నుంచి 17% మధ్య గెయిన్‌ అయ్యే అవకాశం ఉంది. షేర్ల అంగీకార నిష్పత్తి ఎంత ఎక్కువగా ఉంటే, టెండర్ చేసే పెట్టుబడిదార్లకు అంత మంచి రాబడి వస్తుంది.


బైబ్యాక్ రికార్డు తేదీ నాటికి TCS షేర్ల ముగింపు విలువ ₹4,150గా ఉంటుందని అనుకుంటే, గరిష్టంగా 48 షేర్లను కలిగిన (ఈ షేర్ల విలువ ₹2 లక్షల కంటే తక్కువగా, ₹1,99,200 అవుతుంది) వాటాదారును స్మాల్‌ ఇన్వెస్టర్‌ అవుతాడు.


గురువారం నాటి షేర్‌ క్లోజింగ్‌ ప్రైస్‌ ₹3,542.25 ప్రకారం, ఇప్పుడు 48 షేర్ల మొత్తం విలువ ₹1,70,028 అవుతుంది. 


రిటర్న్‌ ఆన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లెక్క:


షేర్‌ బైబ్యాక్‌ యాక్సెప్టెన్స్‌ రేషియో 100% అయితే, స్మాల్‌ ఇన్వెస్టర్‌ టెండర్‌ చేసిన మొత్తం 48 షేర్లను కంపెనీ తీసుకుంటుంది. ఇన్వెస్టర్‌కు ₹29,172 (₹1,99,200 - ₹1,70,028) లాభం వస్తుంది, ఇది 17% గెయిన్‌.
యాక్సెప్టెన్స్‌ రేషియో 75% అయితే, టెండర్‌ చేసిన 48 షేర్లలో 36 షేర్లను కంపెనీ తీసుకుంటుంది. ఈ కేస్‌లో ₹1,49,400 చెల్లిస్తుంది. ఇన్వెస్టర్‌కు ₹26,670 లాభం వస్తుంది, ఇది 12.94% రిటర్న్‌ ఆన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌.
యాక్సెప్టెన్స్‌ రేషియో 50% అయితే, స్మాల్‌ ఇన్వెస్టర్‌ టెండర్‌ చేసిన 48 షేర్లలో 24 షేర్లను కంపెనీ తీసుకుంటుంది. ఈ కేస్‌లో ₹99,600 పే చేస్తుంది. ఇన్వెస్టర్‌కు ₹21,336 లాభం వస్తుంది, ఇది 8.72% లాభం.
యాక్సెప్టెన్స్‌ రేషియో 25% అయితే, స్మాల్‌ ఇన్వెస్టర్‌ టెండర్‌ చేసిన 48 షేర్లలో 12 షేర్లను కంపెనీ తీసుకుంటుంది. ఈ కేస్‌లో ₹49,800 చెల్లిస్తుంది. ఇన్వెస్టర్‌కు ₹11,430 లాభం వస్తుంది, ఇది 5% గెయిన్‌.


సాధారణంగా, బైబ్యాక్ ప్రక్రియ దాదాపు మూడు నెలల వరకు ఉంటుంది. దీనికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాటాదార్ల ఆమోదం అవసరం కాబట్టి ఈ టైమ్‌ పడుతుంది. అంటే, ప్రస్తుత మార్కెట్‌ ప్రైస్‌ దగ్గర షేర్లు కొన్నవాళ్లు రాబోయే 90 రోజుల్లో 5% నుంచి 17% రాబడిని పొందే అవకాశం ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఎటూ కదలని గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial