ఆంధప్రదేశ్‌లో పోలీసు నియామకాల భర్తీ ప్రక్రియలో అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఎస్‌ఐ నియామక ప్రక్రియలో ఛాతీ, ఎత్తు డిజిటల్‌ మీటర్‌ ద్వారా లెక్కించడంతో అనర్హులయ్యామని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిజిటల్‌గా కాకుండా మాన్యువల్‌గానే ఫిజికల్ పరీక్షలు నిర్వహించేలా పోలీసు నియామక బోర్డును ఆదేశించాలని వారు కోర్టును కోరారు. ఈ పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.సుజాత అక్టోబర్‌ 12న విచారణ జరిపారు. 


విచారణలో భాగంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా 56 వేల మంది ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలకు హాజరయ్యారని.. వారిలో సరిపడా ఎత్తు లేరనే కారణంగా 5 వేల మందిని తిరస్కరించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది జడ శ్రవణ్‌ కోర్టుకు తెలిపారు. తిరస్కరణకు గురైన అభ్యర్థులందరూ 2019లో క్వాలిఫై అయినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో.. 2019లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఇప్పుడెందుకు తిరస్కరణకు గురయ్యారని ధర్మాసనం ప్రశ్నించింది. 2019లో నిర్వహించిన పరీక్షల్లో ఎత్తు విషయంలో అర్హత సాధించిన పిటిషనర్లు ప్రస్తుతం డిజిటల్‌ మీటర్‌ను వినియోగించడంతో అనర్హులయ్యారన్నారు.


ప్రతి అభ్యర్థి విషయంలో చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అక్టోబరు 14, 15 తేదీల్లో జరిగే మెయిన్స్‌ను తాత్కాలికంగా వాయిదా వేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాల వల్ల నోటిఫికేషన్‌ రద్దు చేయాలని కోరారు. నిబంధనల మేరకే వ్యవహరించామని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. 


ALSO READ:


మెయిన్ పరీక్షల షెడ్యూలు ఇలా..


➥ అక్టోబరు 14న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు.


➥ అక్టోబరు 15న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-3 పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-4 పరీక్ష నిర్వహిస్తారు.


🔰 మెయిన్ పరీక్ష విధానం: 


➨ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.


➨  సివిల్ ఎస్‌ఐ పోస్టులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.


➨  ఏపీఎస్‌పీ ఎస్‌ఐ పోస్టులకు 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌కు కేటాయిస్తారు.


➨ ఇంగ్లిష్, తెలుగు, ఉర్డూ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.


➨ ఎస్‌ఐ తుది పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్-1 ఇంగ్లిష్ (డిస్క్రిప్టివ్), పేపర్-2 తెలుగు/ఉర్దూ (డిస్క్రిప్టివ్), పేపర్-2 అరిథ్‌మెటిక్ & రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్), పేపర్-4 జనరల్ స్టడీస్(ఆబ్జెక్టివ్) ఉంటాయి. వీటిలో పేపర్-1, పేపర్-2 కేవలం అర్హత పరీక్షలు మాత్రమే.


ఏ కేంద్రంలో ఎంత మంది?


ఫిజికల్ ఈవెంట్లలో మొత్తం 31,193 మంది అభ్యర్థులు సాధించారు. వీరిలో పురుషులు-27,590 మంది, స్త్రీలు-3603 మంది పరీక్షకు హాజరుకానున్నారు. వీరికి రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 


➥ విశాఖపట్నం కేంద్రంలో మొత్తం 11,365 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో పురుషులు-9913, స్త్రీలు-1452 మంది పరీక్షలు రాయనున్నారు.


➥ ఏలూరు కేంద్రంలో మొత్తం 4162 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో పురుషులు-3649, స్త్రీలు-513 మంది పరీక్షలు రాయనున్నారు.


➥ గుంటూరు కేంద్రంలో మొత్తం 7145 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో పురుషులు-6384, స్త్రీలు-761 మంది పరీక్షలు రాయనున్నారు.


➥ కర్నూలు కేంద్రంలో మొత్తం 8521 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో పురుషులు-7644, స్త్రీలు-877 మంది పరీక్షలు రాయనున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా 411 ఎస్సై పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్‌లో పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు మొత్తం 1,73,047 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,51,288 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 57,923 మంది అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. వీరిలో 49,386 మంది పురుషులు, 8537 మహిళలు ఉన్నారు. ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన 31,193 మంది అభ్యర్థులకు మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.


ఎస్‌ఐ పోస్టుల నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..