Retail inflation Sep 2022: మన దేశంలో సామాన్యుడి జేబు పూర్తిగా ఖాళీ అయి బజారున పడితే తప్ప, ద్రవ్యోల్బణం రూపంలో పడుతున్న దెబ్బలు ఆగేలాలేవు. దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగింది. మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది. 1+1 లాగా ఇది మరో దెబ్బ.


ద్రవ్యోల్బణం @ 7.41 శాతం
వినియోగదారుల ధరల సూచీ (Consumer Price Index - CPI) ఆధారంగా లెక్కేసే దేశ రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులోని 7 శాతం నుంచి సెప్టెంబర్ నెలలో 7.41 శాతానికి పెరిగింది. ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి. ఆహార వస్తువుల ధరలు పెరగడంతో సెప్టెంబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరిగింది.  


2021 సెప్టెంబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.35 శాతంగా నమోదైంది. అక్కడి నుంచి పెరుగుతూనే వస్తోంది. ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FIIలు) అదే నెల నుంచి స్టాక్‌ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కు తీసుకెళ్లడం ప్రారంభించారు. అప్పట్నుంచి మార్కెట్లు తిరోగమనంలో ఉన్నాయని స్టాక్స్‌ను ట్రాక్‌ చేసే వాళ్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హయ్యర్‌ మార్జిన్ 6 శాతం కంటే ఎక్కువగా CPI ఇన్‌ఫ్లేషన్‌ నమోదు రావడం ఇది వరుసగా తొమ్మిదో నెల. 2026 మార్చి నాటికి రిటైల్ ద్రవ్యోల్బణాన్ని రెండు వైపులా 2 శాతం మార్జిన్‌తో 4 శాతం (2-6) వద్ద కొనసాగించాలని ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్‌ని గతంలో ఆదేశించింది.


ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులోని 7.62 శాతం నుంచి సెప్టెంబర్‌లో 8.60 శాతానికి పెరిగింది. గత నెలలో పప్పులు, పాలు & పాల ఉత్పత్తులు, కూరగాయలు, తృణధాన్యాలు, మసాలా దినుసుల రేట్లు వరుసగా 11.53 శాతం, 7.13 శాతం, 18.05 శాతం, 3.05 శాతం, 16.88 శాతం పెరిగాయి. ఇంధన ద్రవ్యోల్బణం 10 శాతం పైనే కొనసాగింది.


కోడి గుడ్ల ధరలు ఆగస్టు నెల కంటే సెప్టెంబర్‌లో 1.79 శాతం తగ్గాయి. పండ్లు 7.39 శాతం నుంచి 5.68 శాతానికి దిగివచ్చాయి. 


వడ్డీ రేట్లు పెరిగే అవకాశం
వడ్డీ రేట్లను వరుసగా పెంచుతూ వెళ్తున్నా ఇప్పటికీ RBI సౌకర్యవంత స్థాయి కంటే పైనే ఉంది కాబట్టి, దేశంలో వడ్డీ రేట్లను సెంట్రల్‌ బ్యాంక్‌ మరోమారు పెంచే అవకాశం ఉంది.


పడిపోయిన పారిశ్రామిక ఉత్పత్తి
ఆగస్టులో, దేశ పారిశ్రామిక ఉత్పత్తి 18 నెలల కనిష్టానికి పడిపోయి, -0.8 శాతంగా నమోదైంది. తయారీ, మైనింగ్‌ రంగాల ఉత్పత్తులు తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. 2021 ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తి అత్యల్పంగా -3.2 శాతంగా ఉంది. 


పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (Index of Industrial Production -IIP) ఆధారంగా ఫ్యాక్టరీ ఔట్‌పుట్‌ని లెక్కిస్తారు. 2021 ఆగస్టులో 13 శాతం పెరిగిన IIP, ఈ ఏడాది జులైలో 2.2 శాతం మాత్రమే వృద్ధి చెందింది. 


ఆగస్టులో, తయారీ రంగం 0.7 శాతం క్షీణతను నమోదు చేసింది. ఏడాది క్రితం ఇదే నెలలో ఇది 11.1 శాతం వృద్ధిని సాధించింది. మైనింగ్‌ రంగం గత ఏడాది ఆగస్టులో 23.3 శాతం పెరగ్గా, ఈ ఏడాది ఆగస్టులో 3.9 శాతం క్షీణించింది. ఇదే కాలంలో విద్యుత్‌ రంగ వృద్ధి 16 శాతం నుంచి 1.4 శాతానికి తగ్గింది. 


మొత్తంగా చూస్తే... 2022-23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-ఆగస్టు కాలంలో IIP 7.7 శాతం మాత్రమే వృద్ధి చెందింది. 2021-22 ఇదే సమయంలో ఈ వృద్ధి 29 శాతంగా ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.