Reshamandi Start-up Hits Rock BottomAll 500 Employees :  భారత్‌లో స్టార్టప్‌లకు ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. ఒకే ఒక్క ఐడియాతో స్టార్టప్ ప్రారంభించి వేల కోట్ల స్థాయికి తీసుకెళ్లిన యూనికార్న్‌లు  మన మందు ఉన్నాయి. కానీ ఇప్పుడు అనేక స్టార్టప్‌లు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. బైజూస్ లాంటి కంపెనీ విలువ జీరోకు పడిపోగా.. కొన్ని  వేల కోట్లు అలా కరిగిపోయాయి. వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. అంత పెద్ద కంపెనీకే సవాళ్లు ఎదురైతే తట్టుకోలేకపోయింది. ఇంకా ఎదుగుతున్న స్టార్టప్‌లకు అలాంటి సవాళ్లు ఎదురైతే.. నిలబడం కష్టమే. 


రేషమండి అనే స్టార్టప్ తాజాగా చేతులెత్తేసింది. కొత్త ఐడియాతో.. ఫామ్ టు ఫ్యాషన్ అనే కాన్సెప్ట్ తో ఈ స్టార్టప్‌ను యువ ఎంటర్ ప్రెన్యూర్లు  మయాంక్ తివారి, సౌరభ్ అగర్వాల్ ప్రారంభించారు.  వీరి ఆలోచనలకు మెచ్చి రెండు రౌండ్ల వరకూ పెట్టుబడులు వచ్చాయి. మొత్తం యాభై మిలియన్ల డాలర్ల వరకూ పెట్టుబడులను ఈ స్టార్టప్ ఆకర్షించింది. 2021లో 30 మిలియన్ల సిరీస్ ఏ ఫండింగ్ సాధించింది. తర్వాత రుణభారం తీర్చుకోవడానికి కొంత అప్పులు చేశారు. పలు కంపెనీలు ఈ స్టార్టప్‌కు పెట్టుబడి సాయం చేశాయి. మొత్తంగా యాభై మిలియన్ డాలర్లు సమకూర్చారు. అయితే గడువు ముగుస్తున్నా.. తిరిగి చెల్లింపులు చేయడంలో విఫలమయ్యారు. 


అనుకున్న విధంగా ఆర్థిక కార్యకలాపాలు సాగకపోడం.. ఆదాయం లేకపోవడంతో.. గత ఏడాదిగా తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వర్క్ ఫోర్స్ ను తగ్గించుకుంటూ వస్తున్నారు. వ్యాపార పరిమాణం  పెరగడం లేదు. ఫామ్ నుంచి నేరుగా ఫ్యాషన్ వరకు కాన్సెప్ట్ తో ఫైబర్ ను మార్కెట్ చేయడం ఈ స్టార్టప్ ప్రత్యేకత. దేశంలో ఇలాంటి కాన్సెప్ట్ ఇదే మొదటి సారి కావడంతో మంచి భవిష్యత్ ఉంటుందని అనుకున్నారు. అయితే ఈ కాన్సెప్ట్ ను ముందుకు తీసుకెళ్లి.. అవసరమైన వారందరి దరికి చేర్చడంలో అంట్రపెన్యూర్లు ఫెయిలయ్యారు. ఖర్చులు పెరిగిపోయాయి. చివరికి అప్పులు పెరిగిపోయాయి. 


కంపెనీలో సమస్యలు పెరిగిపోవడంతో గత కొంత కాలంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని మార్చుతూ పోతున్నారు. సీఎఫ్‌వోతో పాటు ఆడిటర్ ను కూడా మార్చారు. కొత్త ఆడిటర్ లెక్కలు తేల్చి.. కంపెనీ దగ్గర అసలు నగదు లేదని.. అప్పుల పాయిందని తేల్చారు. దీంతో కంపెనీని మూత వేయాలని నిర్ణయించారు. ఇప్పటికి పని చేస్తున్న ఐదు  వందల మంది ఉద్యోగుల్ని తొలగించారు. వెంటనే వెబ్ సైట్ ను డౌన్ చేశారు. యాప్ ను కూడా ఇనాక్టివ్ చేశారు. రేషమండి స్టార్టప్ ఫెయిల్యూర్.. టెక్ ప్రపంచంలో కొత్త భయాలను తీసుకొస్తోంది. ఆర్థిక పరమైన సవాళ్లు ఎదుర్కొంటున్న అనేక స్టార్టప్‌లకు కొత్త భయం  ప్రారంభమయింది. 


అయితే రేషమండి నిర్వహణలో మయాంక్ తివారి, సౌరభ్ అగర్వాల్ అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వారు ఉద్దేశపూర్వకంగా స్టార్టప్ ను నిర్లక్ష్యం చేశారని మాజీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.