Repo Rate Hike: భారతీయ రిజర్వు బ్యాంకు మరోసారి కీలక విధాన రేట్లను సవరించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రెపోరేటును 50 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. ఫలితంగా గృహ రుణాల ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. స్థిరాస్తి రంగానికి ఇది పెద్ద దెబ్బేనని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా స్వల్ప కాలం ఇళ్ల అమ్మకాలు తగ్గుతాయని కొందరు అంచనా వేస్తున్నారు. తాజా పెంపుతో రెపోరేటు 5.40 శాతానికి చేరిన సంగతి తెలిసిందే.


రెపోరేటు పెంపుతో ఈఎంఐల భారం పెరుగుతుందని స్థిరాస్తి రంగ నిపుణులు అంచనా వేశారు. స్వల్ప కాల వ్యవధిలో ఇళ్ల అమ్మకాలు తగ్గుతాయని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో ఇళ్ల మార్కెట్‌ బలంగా ఉండటంతో ఈ ప్రభావం నుంచి పరిశ్రమ త్వరగానే కోలుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ గృహ రుణాల వడ్డీరేట్లు సౌకర్యవంతమైన జోన్‌లోనే ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. పండుగల కాలంలో అమ్మకాలు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


'రెపో రేటు వల్ల ఇళ్ల అమ్మకాల జోరుకు అంతరాయం కలుగుతుందని మేం అంచనా వేశాం. కొనుగోలు దారుల సానుకూల సెంటిమెంటుతో ఈ ప్రభావం ఎక్కువ కాలం ఉండదు' అని క్రెడాయి అధ్యక్షుడు హర్షవర్ధన్‌ పటోడియా అంటున్నారు.


'ఇంటిరుణాల వడ్డీరేట్లు ఫ్లెక్సిబుల్‌గానే ఉన్నాయి. రెపోరేటు పెంపు స్వల్పకాలం ఇబ్బంది పెట్టినా సుదీర్ఘ కాలంలో సగటు ధరలు సౌకర్యవంతంగానే ఉన్నాయి' అని నరెడ్కో వైస్ ఛైర్మన్‌ నిరంజన్‌ హీరానందని పేర్కొన్నారు. 'సానుకూల సెంటిమెంటు కొనసాగుతుంది' అని శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ సీఎండీ మురళీ అంచనా వేశారు. రెపోరేటు ప్రభావం స్థిరాస్తి రంగంపై సాధారణంగానే ఉంటుందని బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సీఎఫ్‌వో అతుల్‌ గోయల్‌ వెల్లడించారు.


ఈ ఏడాది జనవరి-జూన్‌ మధ్యన ఇళ్ల అమ్మకాలు 60 శాతం పెరిగాయి. ఎనిమిది ప్రధాన నగరాల్లో 1,58,705 యూనిట్లు అమ్ముడయ్యాయి. తొమ్మిదేళ్లలో ఇదే అత్యధిక అర్ధ సంవత్సర డిమాండ్‌ కావడం గమనార్హం. తెలంగాణ, హైదరాబాద్‌లో అత్యధిక వృద్ధిరేటుతో ఇళ్ల అమ్మకాలు జరగడం తెలిసిందే. మోర్గటేజ్‌ రేట్లు, తక్కు వడ్డీరేట్లే ఇందుకు కారణం. కరోనా మహమ్మారి తర్వాత సొంతింటి కల నెరవేర్చుకోవాలన్న తపన చాలామందిలో పెరిగిందని అన్షుమన్‌ మేగజైన్‌ పేర్కొంది. పండుగల సీజన్‌ కావడంతో వడ్డీరేట్ల ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని వెల్లడించింది.


అంచనాలకు మించిన వడ్డింపు 


అనుకున్నదే జరిగింది. అంచనాలకు మించి వడ్డీలను వడ్డించింది ఆర్‌బీఐ. అనూహ్య స్థాయిలో రెపో రేట్ పెంచేసింది. బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వడ్డీని 50 బేస్ పాయింట్ల మేర పెంచింది. ప్రస్తుతం ఈ పెంపుతో వడ్డీ రేటు 5.40 శాతానికి చేరుకుంది. నిజానికి పరిశ్రమ వర్గాలు 35 బేస్ పాయింట్లు పెంచుతారని భావించాయి. కానీ...అంత కన్నా ఎక్కువే పెంచింది RBI.కొవిడ్ సంక్షోభం తలెత్తాక, ఇలా రెపో రేట్లు పెంచటం వరసగా మూడోసారి.  ఇప్పటికే బ్యాంకులు ఈ వడ్డీభారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి. ఇప్పుడు మరోసారి రెపో రేట్ పెంచటం వల్ల సామాన్యులపై ఇంకా భారం పెరగనుంది. మే నెలలో ఇదే విధంగా అనూహ్య స్థాయిలో 40 బేస్ పాయింట్లు పెంచింది RBI.అంతటితో ఆగకుండా జులైలోనూ ఓ సమీక్ష నిర్వహించి ఏకంగా మరో 50 పాయింట్లు పెంచింది. ఇప్పుడు మళ్లీ 50 బేస్ పాయింట్లు వడ్డించింది. ఈ వడ్డీ రేట్లను వెంటనే అమల్లోకి తీసుకురానున్నాయి బ్యాంకులు. ఫలితంగా హోమ్‌ లోన్స్‌, వెహికిల్ లోన్స్ సహా ఇతర రుణాలపై వడ్డీ భారం పెరగనుంది. నెలవారీ కట్టే EMIలు పెరగనున్నాయి.