Reliance Industries Q4 Results today: మార్కెట్ విలువ పరంగా దేశంలోని అతి పెద్ద కంపెనీ, ఇండెక్స్ హెవీ వెయిట్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ నాలుగో త్రైమాసికం ఫలితాలు ఇవాళ (శుక్రవారం, 21 ఏప్రిల్ 2023) విడుదల కానున్నాయి. రిలయన్స్ ఆదాయాలపై మార్కెట్ ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తూనే ఉంటుంది కాబట్టి, ఈ మేజర్ కంపెనీ ఫలితాల్లో తెలియనివి, ఆశ్చర్యం కలిగించే నంబర్లు పెద్దగా ఉండవు.
ఆయిల్-టు-రిటైల్ మేజర్, తన త్రైమాసికం ఆదాయాలను ఎప్పుడూ మార్కెట్ గంటల తర్వాతే విడుదల చేస్తుంది. 2023 మార్చి త్రైమాసికం (Q4FY23) ఫలితాల విషయంలోనూ ఈ రోజు ఇదే జరుగుతుంది.
రిలయన్స్ ఆదాయాల నుంచి మార్కెట్ విశ్లేషకులు పెద్దగా ఏమీ ఆశించడం లేదు. తక్కువ అంచనాల ప్రభావం గత కొన్ని సెషన్‌లుగా స్టాక్ ట్రెండ్‌లో ప్రతిబింబిస్తోంది. ఈ నెలలో ఇప్పటి వరకు, రిలయన్స్ స్టాక్ నికర కేవలం 0.6% లాభపడగా, బెంచ్‌మార్క్ నిఫ్టీ 1.5% పెరిగింది.
ఇవాళ ఉదయం 10.55 గంటల సమయానికి రిలయన్స్ షేర్ ధర 0.21% లేదా రూ. 4.85 తగ్గి, ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతోంది. గత ఆరు నెలల కాలంలో ఈ కౌంటర్ 5% పైగా నష్టపోయింది. గత ఒక ఏడాది కాలంలో దాదాపు 16% పడిపోయింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చూసినా (YTD) 9% పైగా నెగెటివ్ రిటర్న్స్ ఇచ్చింది.
రిలయన్స్ ఆదాయాలపై అంచనా లెక్కలు ఇవి..
మార్చి త్రైమాసికంలో RIL టాప్‌లైన్ (ఆదాయం), బాటమ్‌లైన్‌లో (లాభం) వృద్ధి నామమాత్రంగా పెరిగే అవకాశం ఉందంటున్న విశ్లేషకులు, నిర్వహణ లాభంలో (ఆపరేటింగ్ ప్రాఫిట్) బలమైన రెండంకెల వృద్ధిని అంచనా వేస్తున్నారు.
ఏడు బ్రోకరేజీలు ఇచ్చిన సగటు అంచనాల ప్రకారం... Q4లో కంపెనీ ఏకీకృత ఆదాయం సంవత్సరానికి (YoY) కేవలం 1.2% పెరిగి రూ. 2.14 లక్షల కోట్లకు చేరుకుంటుంది. నికర లాభం సంవత్సరానికి 4% పెరిగి రూ. 16,853 కోట్లుగా నమోదవుతుంది.
త్రైమాసిక ఫలితాలు విడుదల తర్వాతి రోజు రిలయన్స్ స్టాక్ పని తీరు
RIL ఆదాయాల ప్రకటించిన తర్వాతి రోజుల్లోకి, అంటే చరిత్రలోకి తొంగి చూస్తే అవి పచ్చగా కనిపించవు. ఫలితాల ప్రకటన తర్వాత, గత 12 త్రైమాసికాల్లోని 11 సందర్భాల్లో RIL స్టాక్ పడిపోయింది. వీటిలో, 7 సార్లు స్టాక్ ప్రైస్ బాగా తగ్గింది. పాజిటివ్‌గా ఉన్న ఒక్కసారి కూడా నామమాత్రంగా (+0.3) పెరిగింది. 2022 సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాలను అక్టోబర్ నెలలో విడుదల చేయగా, ఆ ఒక్క సందర్భంలో మాత్రమే ఈ పాజిటివ్ ఫలితం కనిపించింది. 2020 సెప్టెంబర్ త్రైమాసికం ఆదాయాలను నవంబర్ నెలలో విడుదల చేయగా, ఫలితాల తర్వాతి రోజు అత్యంత భారీగా 8.6 శాతం క్షీణించింది.
2020 ఏప్రిల్ - -2.2
2020 ఆగస్ట్ - -2.8
2020 నవంబర్ - -8.6
2021 జనవరి - -5.4
2021 మే - -1.8
2021 జులై - -1.3
2021 అక్టోబర్ - -1.0
2022 జనవరి - -4.1
2022 మే - -4.0
2022 జులై - -3.3
2022 అక్టోబర్ - +0.3
2023 జనవరి - -0.5
రిలయన్స్ స్టాక్ ఫలితాల తర్వాతి రోజు చరిత్ర పునరావృతం అవుతుందా లేదా సంప్రదాయం ఈసారి విచ్ఛిన్నం అవుతుందా అన్నది సోమవారం (24వ తేదీ) తేలుతుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.