Reliance industries Share Price: మార్కెట్‌ విలువ పరంగా, భారతదేశంలో అతి పెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇటీవలే, ఈ కంపెనీ మరో సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. భారతదేశంలో, ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముకేష్ అంబానీ (Mukesh Ambani) నేతృత్వంలోని ఈ కంపెనీ మార్కెట్ విలువ (Reliance Industries market cap) రూ. 20 లక్షల కోట్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. మార్కెట్‌ విలువ పరంగా టాప్‌-50 కంపెనీల్లో రిలయన్స్‌ది 49వ స్థానం. దిగ్గజ కంపెనీలైన పెప్సికో, షెల్‌, పెట్రోచినా, సిస్కో వంటి వాటి కంటే RIL మార్కెట్‌ విలువే అధికం. 


'రూ. 20 లక్షల కోట్ల విలువైన కంపెనీ' ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (RIL). ఈ అద్భుత రికార్డును చేరుకునే ప్రయాణంలో, ముకేష్ అంబానీతో పాటు పెట్టుబడిదార్లు, షేర్‌హోల్డర్లను కూడా ధనవంతులను చేసింది ఈ సంస్థ.


20 ఏళ్లలో 27 రెట్లు పెరిగిన విలువ
సముద్రంలోని చమురు నుంచి ఆకాశంలోని టెలికాం తరంగాల వరకు చాలా రంగాల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ విస్తరించింది. ఈ వైవిధ్యమే బలంగా మారింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, లక్ష కోట్ల రూపాయల కంపెనీల క్లబ్‌లో దాదాపు 20 ఏళ్ల క్రితం చేరింది. 2005లో రూ.1 లక్ష కోట్ల మార్కెట్‌ క్యాప్‌ (M Cap) సాధించింది. 2024లో రూ.20 లక్షల కోట్ల మైలురాయిని అందుకుంది. రూ.లక్ష కోట్ల నుంచి రూ.20 లక్షల కోట్ల విలువకు చేరే క్రమంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్, తన ఇన్వెస్టర్లకు 27 రెట్ల రాబడి ఇచ్చింది.


షేర్ విలువ రూ.53 మాత్రమే
దాదాపు 20 ఏళ్ల క్రితం, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ షేరు ధర దాదాపు రూ.110 మాత్రమే. ఇప్పుడు రూ.2,900 పైన ఉంది. ఈ లెక్కన.. 2005 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ప్రైస్‌ 2,600 శాతం ర్యాలీ చేసింది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే షేరు ధర 27 రెట్లు పెరిగింది. 2005లో ఈ కంపెనీలో రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, ఆ పెట్టుబడి విలువ ఇప్పటికి రూ.27 లక్షలు అయి ఉండేది.


2002 జులై నుంచి ఇప్పటి వరకు చూస్తే, ఈ స్టాక్ దాదాపు 5,500 శాతం లేదా 56 రెట్లు బలపడింది. అప్పట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఒక షేర్ విలువ రూ.53 మాత్రమే.


రూ. లక్ష కోట్ల నుంచి రూ. 20 లక్షల కోట్ల వరకు - రిలయన్స్‌ జర్నీ ఇది


2005 - రూ.1లక్ష కోట్లు 
2007 ఏప్రిల్‌ - రూ.2 లక్షల కోట్లు 
2007 సెప్టెంబర్‌ - రూ.3 లక్షల కోట్లు, 
2017 జులై - రూ.5 లక్షల కోట్లు
2019 నవంబర్‌ - రూ.10 లక్షల కోట్లు 
2021 సెప్టెంబర్‌ - రూ.15 లక్షల కోట్లు 
2024 జనవరి 29 - రూ.19 లక్షల కోట్లు
2024 ఫిబ్రవరి 13 - రూ.20 లక్షల కోట్లు


చివరి లక్షల కోట్ల రూపాయల విలువను నెల రోజుల లోపులోనే రిలయన్స్‌ సాధించడం విశేషం.


ఈ రోజు (గురువారం, 15 ఫిబ్రవరి 2024) ట్రేడింగ్‌లో, మధ్యాహ్నం 12.10 గంటల సమయానికి రిలయన్స్ షేర్లు 0.88% నష్టపోయి రూ.2,936.60 వద్ద ట్రేడవుతున్నాయి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: శనివారం నాడు కూడా స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌, స్పెషల్‌ టైమింగ్స్‌, కారణం ఇదే