Reliance - Tata Play Update: భారతదేశ టెలివిజన్ రంగంలో మరింత లోతుగా పాతుకుపోవడానికి ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) చాలా సీరియస్ ప్రయత్నాలు చేస్తోంది. మన దేశంలో అత్యంత విలువైన బిజినెస్ గ్రూప్ టాటా గ్రూప్‌లోని 'టాటా ప్లే' మీద రిలయన్స్ కన్నేసిందని సమాచారం. ఆ కంపెనీలో పెద్ద వాటా కొని, టెలివిజన్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో తన స్థానాన్ని మరింత బలంగా మార్చుకునేందుకు యోచిస్తోందని మార్కెట్‌లో చెప్పుకుంటున్నారు.
వినోద రంగంలో గ్లోబల్ కంపెనీ వాల్ట్ డిస్నీకి 'టాటా ప్లే'లో 29.8 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ నుంచి ఆ మొత్తం వాటాను కొనుగోలు చేయడానికి RIL చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.
టాటా గ్రూప్‌లోని హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్‌కు, ప్రస్తుతం, 'టాటా ప్లే'లో 50.2 శాతం షేర్లు ఉన్నాయి. మిగిలిన షేర్లు డిస్నీతో పాటు, సింగపూర్‌కు చెందిన టెమాసెక్ (20 శాతం) దగ్గర ఉన్నాయి. 'టాటా ప్లే'లో తన వాటాను టాటా సన్స్ అమ్మదు. కాబట్టి.. రిలయన్స్ ఇండస్ట్రీస్ డిస్నీని దువ్వుతోంది. ప్రస్తుతం 'టాటా ప్లే'లో డిస్నీ వాటా విలువను లెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
తొలిసారి దిగ్గజాల కలయిక!
చర్చలు ఫలించి వాటాను అమ్మడానికి డిస్నీ ఒప్పుకుంటే, భారతదేశ కార్పొరేట్ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కతమవుతుంది. దేశంలో అత్యంత విలువైన బిజినెస్ గ్రూప్ టాటా గ్రూప్ - అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ తొలిసారి జట్టు కడతాయి. వాటి నేతృత్వంలో మొట్టమొదటి జాయింట్ వెంచర్‌లో ఏర్పడుతుంది.
ఈ జాయింట్ వెంచర్ పని చేయడం మొదలుపెడితే.. 'టాటా ప్లే' ప్లాట్‌ఫామ్‌లోకి జియో సినిమా కంటెంట్ మొత్తం వచ్చి చేరుతుంది. 'టాటా ప్లే' కస్టమర్లు జియో సినిమా కంటెంట్‌ను కూడా చూస్తారు.
వదిలించుకోవడానికే చూస్తున్న డిస్నీ
వాస్తవానికి 'టాటా ప్లే' IPO ద్వారా తన షేర్లను అమ్మేయాలని డిస్నీ భావించింది. అయితే, ఆ కార్యక్రమం వాయిదా పడడంతో, షేర్లు అమ్మడానికి ఇతర మార్గాలు వెతుకుతోంది. ఇది, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కలిసొచ్చింది.
ఈ వార్తలపై రిలయన్స్, డిస్నీ, టాటా సన్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
టెమాసెక్ కూడా 'టాటా ప్లే'లోని తన 20 శాతం వాటాను అమ్మడానికి టాటా గ్రూప్‌తో గత సంవత్సరం చర్చలు జరిపింది. అయితే, రెండింటి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
శాటిలైట్ టెలివిజన్ బ్రాడ్‌కాస్టింగ్ సెక్టార్‌లో ప్రస్తుతం 'టాటా ప్లే'కు గట్టి పోటీ ఉంది. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జియోసినిమా, అమెజాన్ ప్రైమ్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ బలమైన ప్రత్యర్థులుగా ఉన్నాయి.
వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ ప్రకారం... వాల్ట్ డిస్నీ, తన లీనియర్ టీవీ, కంటెంట్, OTT బిజినెస్‌లో 60 శాతం వాటాను రిలయన్స్‌కు 3.9 బిలియన్ డాలర్లకు విక్రయించడానికి ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంది. చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ ఒప్పందం గురించి అధికారికంగా ప్రకటించాలని ఆ రెండు కంపెనీలు భావిస్తున్నట్లు సమాచారం.
మరో ఆసక్తికర కథనం: ఈ సీజన్‌లో 42 లక్షల వివాహాలు, పెళ్లి ఖర్చు తెలిస్తే కళ్లు తేలేస్తారు!