Bus Hits Bike In Tamil Nadu: ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు తీసుకెళ్లాల్సిన బస్సు డ్రైవర్లు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ.. రోడ్డు పక్కన వెళ్తున్న వారి ప్రాణాలు తీస్తున్నారు. ఇలాంటి ఘటనే తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో బుధవారం జరిగింది. ఓ డ్రైవర్ నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఓ డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడుపుతూ.. బైక్‌ను బస్సు ఢీకొనడంతో తండ్రీకొడుకులు మ‌ృతి చెందారు. మ‌ృతుల్లో మూడేళ్ల బాలుడు ఉండడం అక్కడున్నవారి హృదయాలను కలిచివేసింది. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్ కుమార్ (32) అనే వ్యక్తి తన భార్య సుశీల, మూడేళ్ల కుమారుడితో కలిసి బైక్‌పై నగరంలోని పెరియానాయకన్‌పాళయం వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో వెనుక  వస్తున్న ఓ బస్సు బైక్‌ను వేగంగా ఢీకొట్టింది. ఘటనలో అశోక్, అతని కుమారుడు అక్కడికక్కడే మృతిచెందారు. అశోక్‌ భార్య సుశీలకు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


ప్రమాదం తరువాత బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ అక్కడి నుంచి పరారయ్యారు. ప్రమాదంపై ఆందోళన వ్యక్తం చేస్తూ స్థానికులు నిరసన తెలిపారు. డ్రైవర్ల ఆగడాలు పెరిగిపోతున్నాయని, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికే పదుల సంఖ్యలో అమాయకులను బలితీసుకున్నారని రోడ్డుపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెరియనాయకన్‌పాళయం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆందోళనకారులతో చర్చించారు. కేసుపై సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించారు.