Wedding Season 2024 Expenditure In India: ఇది మాఘమాసం. ఈ మాసంలో బలమైన ముహూర్తాలు ఉంటాయని, మరే నెలలోనూ ఇంతటి అద్భుత ఘడియలు ఉండవని బ్రాహ్మణ పండితులు చెబుతుంటారు. అందుకే.. వివాహాలు, గృహ ప్రవేశాలు సహా చాలా శుభకార్యాలను మాఘ మాసంలో జరిపిస్తుంటారు.
మన దేశంలో, పెళ్లిళ్ల సీజన్‌కు ప్రారంభంగా మాఘ మాసాన్ని గుర్తిస్తారు. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా లక్షలాది వివాహాలు జరుగుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థ లక్షల కోట్ల బూస్టర్ డోస్ లభించొచ్చంటూ 'కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్' (CAIT) లెక్కగట్టింది. CAIT పరిశోధన విభాగం దేశవ్యాప్తంగా 30 నగరాలకు చెందిన వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్లతో మాట్లాడి, ఒక రిపోర్ట్‌ను విడుదల చేసింది.
'కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ డేటా' ప్రకారం.. 2024 జనవరి 15 నుంచి 2024 జులై 15 వరకు ఉన్న వెడ్డింగ్ సీజన్‌లో (ఆరు నెలల కాలం) దేశవ్యాప్తంగా 42 లక్షల వివాహాలు జరుగుతాయి. ఈ కాలంలో వివాహ సంబంధిత కొనుగోళ్లు & సేవల వినియోగం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ. 5.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుంది. పెళ్లి ఖర్చుల రూపంలో దేశవ్యాప్తంగా మార్కెట్లలోకి భారీగా నగదు ప్రవాహం మొదలవుతుంది.
ఈ పెళ్లిళ్ల సీజన్‌లో, దేశ రాజధాని దిల్లీలోనే 4 లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని, దీని వల్ల దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని CAIT జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్‌వాల్ చెప్పారు. గత ఏడాదిలో, 2023 డిసెంబర్ 14న ముగిసిన పెళ్లిళ్ల సీజన్‌లో దాదాపు 35 లక్షల వివాహాలు జరగ్గా, దాదాపు రూ. 4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది.
CAIT ప్రకారం, ఈ సీజన్‌లో పెళ్లిళ్ల ఖర్చులు ఇలా ఉండొచ్చు...
- దాదాపు 5 లక్షల పెళ్లిళ్లలో, ఒక్కో వివాహానికి రూ. 3 లక్షల వరకు ఖర్చు చేస్తారని అంచనా.
- దాదాపు 10 లక్షల వివాహాల్లో, ఒక్కో శుభకార్యానికి రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా.
- దాదాపు 10 లక్షల వెడ్డింగ్స్‌లో, ఒక్కో వెడ్డింగ్‌కు రూ. 6 లక్షల నుంచి రూ. 10 లక్షలు వ్యయం చేస్తారని లెక్కగట్టారు.
- దాదాపు 10 లక్షల పెళ్లిళ్లలో, ఒక్కో పెళ్లికి రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలు ఖర్చవుతుంది.
- దాదాపు 6 లక్షల వివాహాల్లో, ఒక్కో వివాహానికి రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షలు వ్యయం అవుతుందని అంచనా.
- దాదాపు 60 వేల వెడ్డింగ్స్‌లో, ఒక్కో వెడ్డింగ్‌కు రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షలు ఖర్చు చేస్తారని లెక్కించారు.
- దాదాపు 40 వేల పెళ్లిళ్లలో ఒక్కో పెళ్లికి రూ. 50 లక్షల నుంచి కోటి రూపాయలకు పైగా వ్యయం అవుతుందని అంచనా.
ఇవన్నీ కలిపితే, ఈ ఆరు నెలల్లో, దాదాపు 42 లక్షల పెళ్లిళ్లలో వివాహ సంబంధిత కొనుగోళ్లు, సేవల ద్వారా రూ. 5.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా.
పెళ్లి ఖర్చు అంటే కేవలం వివాహం, భోజనాలకు అయ్యే వ్యయం మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. పెళ్లికి ముందు ఇంటికి రిపేర్లు చేయించడం, రంగులు వేయించడం వంటివి చేస్తారు. కాబట్టి, ఆ రంగంలో వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. ఇంకా.. ఆభరణాలు, కొత్త బట్టలు, పాదరక్షలు, ఫర్నీచర్, డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, పండ్లు, పూజ సామగ్రి, కిరాణా, తృణధాన్యాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రికల్ వస్తువులు, బహుమతులు వంటి వాటికి డిమాండ్ పెరుగుతుంది. తద్వారా ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా వ్యాపారం భారీ స్థాయిసో నడుస్తుంది. మొత్తంగా చూస్తే.. పెళ్లిళ్ల సీజన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది, ప్రజలకు పెద్ద సంఖ్యలో ఉపాధి కూడా లభిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి