ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. దేశంలోనే మొదటిసారిగా రూ.19 లక్షల కోట్ల మార్కెట్ విలువకు చేరుకున్న తొలి కంపెనీగా రికార్డు సృష్టించింది. గత మూడు సెషన్లలో స్ట్రాంగ్ ర్యాలీ కావడంతో కంపెనీ షేరు ధర గురువారం ఇంట్రాడేలో సరికొత్త గరిష్ఠమైన రూ.2,787కు చేరుకుంది. ఇంతకు ముందున్న గరిష్ఠ స్థాయి రూ.2750ని అధిగమించింది.
గురువారం ఉదయం రూ.2,750 వద్ద రిలయన్స్ షేరు ధర మొదలైంది. రూ.2,732 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత కొనుగోళ్లు పుంజుకోవడంతో ఏకంగా రూ.2,789ని తాకింది. చివరికి రూ.63 లాభంతో రూ.2,782 వద్ద ముగిసింది. కేవలం మూడు సెషన్లలోనే పది శాతం వరకు ఎగియడంతో రూ.18.84 ట్రిలియన్ల మార్క్‌ను చేరుకుంది.
దేశంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్న సంగతి తెలిసిందే. ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్స్ మార్కెటింగ్, ఆయిల్-గ్యాస్ అన్వేషణ, రిటైల్, డిజిటల్ సర్వీసులు, మీడియా, టెలికాం, ఎఫ్‌ఎంసీజీ వంటి కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఏప్రిల్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఎబిటాలో ఓ2సీ, ఆయిల్ అండ్ గ్యాస్ విభాగం 50 శాతం, రిటైల్ 10 శాతం, డిజిటల్ 34 శాతం, ఇతర వ్యాపారాలు 6 శాతం వరకు కంట్రిబ్యూట్ చేశాయి.
రియలన్స్ ఇండస్ట్రీస్ వ్యాపారం వృద్ధి దిశలో సాగుతుండటం, కొత్తగా ఎనర్జీ బూస్ట్ రావడంతో కంపెనీ షేరు ధర రూ.3,253ను చేరుకుంటుందని మోర్గాన్ స్టాన్లీ వెల్లడించింది. 'రాబోయే మూడేళ్ల కాలంలో గ్యాస్, చమురు రిఫైనింగ్ మార్కెట్లు కంపెనీ కొత్త ఎనర్జీ క్యాపెక్స్‌కు సగం వరకు ఫండింగ్ చేస్తుందని మా అంచనా. వేగంగా హైడ్రోజన్ మానిటైజేషన్ జరగడం వల్ల రిలయన్స్ నెట్ అసెట్స్ వాల్యూ పది శాతం పెరుగుతుందని అనుకుంటున్నాం. డిజిటల్, రిటైల్ విలువా పెరుగుతుంది. అలాగే కంపెనీ ఆర్‌ఓసీఈలో హైడ్రోజన్ 14-15 శాతం వరకు సాధిస్తుంది' అని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. సుదీర్ఘ కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ మరింత పెరుగుతుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది.