Reliance Campa Cola: భారతదేశంలో శీతల పానీయాల (soft drinks) మార్కెట్ నెమ్మదిగా వేడెక్కుతోంది. భారత మార్కెట్‌ను శాసిస్తున్న బహుళ జాతి కంపెనీలు కోకాకోలా, పెప్సీకి.. భారత్‌లో అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కంపెనీ నుంచి గట్టి పోటీ ఎదురు కాబోతోంది. దశాబ్దాల నాటి కూల్‌డ్రింక్ బ్రాండ్ కాంపా కోలాను కొత్త అవతార్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే విడుదల చేసింది. ఇప్పుడు, సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్‌లో గరిష్ట వాటాను కైవసం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది.
రిలయన్స్ జియో ఫార్ములా
విజయవంతమైన రిలయన్స్ జియో ఫార్ములానే శీతల పానీయాల మార్కెట్‌లోనూ అనుసరిస్తోంది రిలయన్స్ ఇండస్ట్రీస్. ప్లాన్‌లో భాగంగా దూకుడైన ధరల విధానాన్ని అనుసరించింది. కోకా కోలా, పెప్సీ ఉత్పత్తుల ధరల్లో సగం కన్నా తక్కువ రేటుకే కంపా కోలాను అమ్ముతోంది. కూల్‌డ్రింక్స్‌కు అత్యంత కీలకమైన వేసవి సీజన్‌లో గట్టి పోటీ ఎదురు కావడంతో.. కోకా కోలా, పెప్సీ కంపెనీలు వాటి ఉత్పత్తుల రేట్లను తగ్గిస్తున్నాయి. అయితే.. రేట్లు తగ్గించినంత మాత్రాన వాటి కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు.
దక్షిణాది కంపెనీతో రిలయన్స్ చర్చలు
జాతీయ మీడియా కథనం ప్రకారం... రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (Reliance Consumer Products - RCPL), చెన్నైకి చెందిన కాళీ ఎరేటెడ్ వాటర్ వర్క్స్‌తో (Kali Aerated Water Works) చర్చలు జరుపుతోంది. రిలయన్స్ కాంపా కోలాను కాళీ ఎరేటెడ్ వాటర్ వర్క్స్ ప్లాంట్లలో తయారు చేసి, మార్కెట్ చేయడం గురించి ఈ చర్చలు జరుగుతున్నాయి.
గత సంవత్సరం ఆగస్టులో కాంపా కోలాను కొనుగోలు చేయడానికి ముందే, కాళీ ఎరేటెడ్ వాటర్ వర్క్స్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడం కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ చర్చలు జరిపింది. కాళీ ఎరేటెడ్ వాటర్ వర్క్స్ దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శీతల పానీయాల బ్రాండ్ బోవోంటో (Bovonto) తయారు చేసి, విక్రయిస్తోంది. దక్షిణ భారతదేశంలో ప్రజాదరణ పొందిన కోలా బ్రాండ్స్‌లో బోవోంటో ఒకటి, కోకా కోలా & పెప్సీకి గట్టి పోటీ ఇస్తోంది. ఇది కాకుండా, నిమ్మ, ఆరెంజ్ ఫ్లేవర్ పానీయాలను కూడా కాళీ ఎరేటెడ్ వాటర్ వర్క్స్ తయారు చేస్తోంది. ఈ కంపెనీ జ్యూస్‌లు, కొబ్బరి నీళ్లను కూడా విక్రయిస్తుంది. కాళీ ఎరేటెడ్ వాటర్ వర్క్స్‌కు ఎనిమిదికి పైగా తయారీ ప్లాంట్లు ఉన్నాయి.
రిలయన్స్‌కు భారీ ప్రయోజనం
రిలయన్స్ - కాళీ ఎరేటెడ్ వాటర్ వర్క్స్ మధ్య ప్రతిపాదిత ఒప్పందానికి సంబంధించి చర్చలు తుది దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం కుదిరితే, కాళీ ఎరేటెడ్ వాటర్ వర్క్స్ తయారీ ప్లాంట్లలో కాంపా కోలా తయారై, మార్కెట్‌ను ముంచెత్తుతుంది. కాళీ ఎరేటెడ్ వాటర్ వర్క్స్ తయారీ సామర్థ్యంతో పాటు బలమైన పంపిణీ వ్యవస్థ కూడా ఒకే ఒప్పందంతో రిలయన్స్‌కు దక్కుతుంది.