Sumeet Industries: అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెక్స్‌టైల్ కంపెనీ సుమీత్ ఇండస్ట్రీస్ రిజల్యూషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ కంపెనీ కొనుగోలు కోసం ఇప్పటి వరకు 8 బిడ్లు వచ్చాయి. దేశంలోని అతి పెద్ద లిస్టెడ్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries Ltd) కూడా పోటీలోకి రావడంతో రేసు ఆసక్తికరంగా మారింది.
రుణ సంక్షోభంలో కూరుకుపోయిన సుమీత్ ఇండస్ట్రీస్‌ను కొనుగోలు చేయడానికి ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముకేష్ అంబానీకి (Mukesh Ambani) చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు కోల్‌కతాకు చెందిన MPCI కూడా పోటీ పడుతోంది. ఈ రెండు సంస్థలు కాక మరో 6 కంపెనీలు బిడ్‌లు, అవసరమైన పత్రాలు సమర్పించాయి.
కంపెనీ నెత్తిన వందల కోట్ల రూపాయల అప్పులు
సుమీత్ ఇండస్ట్రీస్ రిజల్యూషన్ ప్రక్రియలో భాగంగా ఈ నెల ప్రారంభంలోనే బిడ్డింగ్ నిర్వహించారు. ప్రస్తుతం, ఆ ఎనిమిది బిడ్‌లను పరిశీలిస్తున్నట్లు రిజల్యూషన్ కోసం నియమితుడైన అధికారి చెప్పారు. గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఉన్న సుమీత్ ఇండస్ట్రీస్ నూలు, పాలిస్టర్‌లను తయారు చేస్తుంది. రుణదాతలకు మొత్తం రూ. 667 కోట్లు బకాయిపడింది. ఇందులో బ్యాంక్ ఆఫ్ బరోడాకు అత్యధిక వాటా ఉంది.
రుణ సంక్షోభంలో చిక్కుకున్న తర్వాత, దానిని తన సొంత స్థాయిలో పరిష్కరించడానికి సుమీత్ ఇండస్ట్రీస్ ప్రయత్నించింది. రుణ పునర్నిర్మాణం (debt reconstruction) కోసం రుణదాతలతో చర్చలు జరిపినా విజయం సాధించలేకపోయింది. అంతిమంగా, గత ఏడాది డిసెంబర్‌లో దివాలా పరిష్కార న్యాయస్థానం ఎదుట ఈ కంపెనీ హాజరుకావలసి వచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం, ఇప్పుడు సుమీత్ ఇండస్ట్రీస్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ కొనసాగుతోంది. అంటే, ఈ కంపెనీని వేలం వేసి విక్రయించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ వేలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా 8 సంస్థలు బిడ్లు వేశాయి. ఏ కంపెనీ ఎక్కువ మొత్తాన్ని ఆఫర్ చేస్తే, ఆ కంపెనీ చేతికి సుమీత్ ఇండస్ట్రీస్ వెళ్తుంది. ఆఫర్ మొత్తం రుణదాతలకు చేతికి వెళ్తుంది.
అప్పులిచ్చిన బ్యాంక్‌ల లిస్ట్
సుమీత్ ఇండస్ట్రీస్‌కు ఎక్కువ అప్పు ఇచ్చిన సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా. సమిత్ ఇండస్ట్రీస్‌కు ఉన్న మొత్తం రుణాల్లో దాదాపు 65 శాతం ఈ బ్యాంక్ వాటానే. ఆ తర్వాత IDBI బ్యాంక్‌కు 21 శాతం బకాయి ఉంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జర్మనీకి చెందిన ఓల్డెన్ బర్గిస్చే లాండెస్ బ్యాంక్ AG కూడా సుమీత్ ఇండస్ట్రీస్ రుణదాతల లిస్ట్‌లో ఉన్నాయి.
రేస్‌లో రిలయన్స్‌తో పాటు ఇంకా ఎవరున్నారు?
సుమీత్ ఇండస్ట్రీస్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిన పెద్ద కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్, MPCI. వీటితో పాటు భోలా రామ్ పేపర్స్ అండ్ పవర్, భిలోసా ఇండస్ట్రీస్, భూమి టెక్స్ ఇండస్ట్రీస్, ఈగల్ గ్రూప్, గిలాన్ ఇండస్ట్రీస్, డైమండ్ వ్యాపారి చునిభాయ్ గజేరా వంటి పేర్లు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.