దేశంలో 5జీ నెట్‌వర్క్‌ కోసం రూ.2 లక్షల కోట్లను వెచ్చించనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ప్రకటించింది. రిలయన్స్‌ ఛైర్మన్‌ & మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముఖేష్‌ అంబానీ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) మాట్లాడారు. మార్కెట్‌ ఎదురు చూస్తున్న చాలా అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ ఈవెంట్‌ను లక్షలాది మంది ఇన్వెస్టర్లు, ఎనలిస్ట్‌లు ఆసక్తిగా ట్రాక్ చేశారు. 


వరుసగా మూడో ఏడాది వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2021లో జరిగిన AGMలో, గ్రీన్ ఎనర్జీలోకి అడుగు పెట్టడంపై ముఖేష్‌ ప్రకటన చేశారు. 2020లో, గూగుల్‌ను మైనారిటీ పెట్టుబడిదారుగా ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు.


రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ టెలికాం విభాగం (జియో), మరో రెండు నెలల్లో 5G సేవలను ప్రారంభించనుందని కంపెనీ ఇవాళ్టి వార్షిక సాధారణ సమావేశంలో ఛైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు.


ఈ దీపావళి నాటికి దిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలో 5జీ సేవలు ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది చివరికల్లా ప్రతి పట్టణంలోనూ 5జీ సర్వీసులు అందిస్తామని ప్రకటించారు. వెయ్యి నగరాల్లో సేవలు అందించాలన్నది జియో లక్ష్యంగా చెప్పిన ముఖేష్‌, దానిని సాధించే సత్తా జియోకు ఉందన్నారు.


'మేడ్ ఇన్ ఇండియా' 5G కొలాబరేషన్‌లో తమకు ప్రపంచ ప్రముఖ టెక్ కంపెనీల భాగస్వామ్యం ఉందంటూ.. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎరిక్సన్, నోకియా, సామ్‌సంగ్, సిస్కో పేర్లను ప్రస్తావించిన ముఖేష్‌... క్వాల్‌కమ్‌తోనూ భాగస్వామ్యాన్ని ప్రకటించారు. 


భారతీయ మార్కెట్ కోసం సరసమైన ధరలో 5జీ స్మార్ట్ ఫోన్‌ను అభివృద్ధి చేయడానికి గూగుల్‌తో కలిసి కంపెనీ పని చేస్తోందని పేర్కొన్నారు.


రిలయన్స్‌ రిటైల్‌ గురించీ ఛైర్మన్‌ మాట్లాడారు. రూ.2 లక్షల కోట్ల టర్నోవర్, రూ.12,000 కోట్ల ఎబిటా రికార్డును సాధించినందుకు రిటైల్ నాయకత్వ బృందాన్ని అభినందించారు. రిలయన్స్ రిటైల్ ఆసియాలోని టాప్-10 రిటైలర్లలో ఒకటిగా ఉందని వెల్లడించారు.


పవర్ ఎలక్ట్రానిక్స్‌లో కొత్త గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖేశ్ అంబానీ చెప్పారు.


2035 నాటికి నెట్‌ కార్బన్ జీరోగా మారే లక్ష్యం దిశగా RIL సాగుతున్నట్లు తెలిపారు. నాలుగు గిగా ఫ్యాక్టరీలను స్థాపించడానికి జామ్‌నగర్‌లో ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు గత సంవత్సరం ముఖేష్‌ ప్రకటించారు. ఇవాళ, పవర్ ఎలక్ట్రానిక్స్ కోసం కొత్త గిగా ఫ్యాక్టరీని ప్రకటించాలని ప్రకటించారు. 


ఈ సంవత్సరం, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ వ్యాపారాన్ని ప్రారంభిస్తామని ఇషా అంబానీ ప్రకటించారు. ప్రతి భారతీయుడి రోజువారీ అవసరాలను తీర్చేలా మంచి నాణ్యత, సరసమైన ధరల్లో ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, అందించడమే ఈ వ్యాపారం లక్ష్యంగా ఇషా వివరించారు.


ఏజీఎం నేపథ్యంలో భారీ గ్యాప్‌ డౌన్‌ నుంచి కోలుకున్న రిలయన్స్‌ షేరు ధర ఒక దశలో రూ.2,655 వరకు వెళ్లింది. ముఖేష్‌ అంబానీ నుంచి ఆశించిన స్థాయిలో ప్రకటనలు లేకపోవడంతో ఏజీఎం సమయం నుంచి మళ్లీ దిగాలు పడింది. చివరకు 0.69% నష్టంతో రూ.2,600 వద్ద ముగిసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.