Home Loan Outstanding: గృహ రుణాలకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) చెప్పిన వివరాలు షాకింగ్‌గా ఉన్నాయి. ఇంటి అప్పుల గణాంకాలు ఆశ్చర్యకరమైన వేగంతో పెరుగుతున్నాయి. ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు కోసం బ్యాంక్‌లు/ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి, హౌసింగ్ లోన్ డేటాను ఆర్‌బీఐ ఆదివారం విడుదల చేసింది. 


రెండేళ్లలో రూ.10 లక్షల కోట్ల ఔట్‌స్టాండింగ్‌
రిజర్వ్‌ బ్యాంక్‌ తాజా లెక్కల ప్రకారం, 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి (FY24) మొత్తం గృహ రుణ బకాయిలు (Home Loan Outstanding) రూ. 27.23 లక్షల కోట్లకు (రూ. 27.23 ట్రిలియన్లు) చేరింది. ఇవి.. 2022 మార్చి ముగింపు (FY22) నాటికి రూ. 17,26,697 కోట్లుగా ఉండగా, 2023 మార్చి ముగింపు ‍‌(FY23) నాటికి రూ.19,88,532 కోట్లుగా ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే, కేవలం గత సంవత్సరాల్లోనే గృహ రుణ బకాయిలు ఏకంగా రూ. 10 లక్షల కోట్లు (రూ.10 ట్రిలియన్లు) పెరిగాయి. 


గృహ రుణ బకాయిలు అంటే తీసుకున్న మొత్తం హౌసింగ్‌ లోన్‌ కాదు. అప్పు తీర్చగా ఇంకా మిగిలిన మొత్తాన్ని ఔట్‌స్టాండింగ్‌ అమౌంట్‌ అంటారు.


2024 మార్చి ముగింపు నాటికి వాణిజ్య స్థిరాస్తి రుణ బకాయిలు (Loan Outstanding Of Commercial Real Estate) రూ. 4,48,145 కోట్లకు చేరాయి. 2022 మార్చి ముగింపు నాటికి ఇవి రూ. 2,97,231 కోట్లు మాత్రమే. ఇవి కూడా రెండు సంవత్సరాల వ్యవధిలోనే దాదాపు 50% పెరిగాయి.


కొవిడ్-19 తర్వాత విపరీతంగా పెరిగిన డిమాండ్
కేంద్ర బ్యాంక్‌ గణాంకాల ప్రకారం, కొవిడ్-19 తర్వాత హౌసింగ్ సెక్టార్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. సొంత ఇల్లు ఉండాల్సిన అవసరం తెలిసొచ్చింది. రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుగోళ్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. హౌసింగ్‌ లోన్‌ ఔట్‌స్టాండింగ్‌ కేవలం రెండు సంవత్సరాల్లోనే రూ. 10 లక్షల కోట్లు పెరిగిందంటే, ప్రజలు ఏ స్థాయిలో హోమ్‌ లోన్స్‌ తీసుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. గృహ విక్రయాలు పెరగడమే కాదు, గత ఆర్థిక సంవత్సరంలో ధరలు విపరీతంగా పెరగడం కూడా రుణ బకాయిలు పెరగడానికి ఒక కారణమని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.


గృహ రుణాలు పెరగడానికి కొవిడ్‌ కాలంలో పుట్టుకొచ్చిన హౌసింగ్ డిమాండ్ కూడా ఓ కారణమని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ చెప్పారు. కొవిడ్‌ తర్వాత అన్ని ప్రైస్‌ రేంజ్‌ల్లోనూ గిరాకీ వృద్ధి చెందింది. కొవిడ్ కారణంగా ఆగిన కొనుగోలుదార్లు ఈ మధ్యకాలంలో ఇళ్ల కొనుగోళ్లు పూర్తి చేశారు. భరించగలిగే స్థాయి (Affordable Housing) నివాసాలకు డిమాండ్‌ పెంచడంలో ప్రభుత్వ ప్రయత్నాలు కూడా ముఖ్య పాత్ర పోషించాయి. హౌసింగ్ లోన్లలో కనిపిస్తున్న ఈ వృద్ధి భవిష్యత్తులో కూడా బలంగా ఉంటుందని నిపుణులు నమ్ముతున్నారు.


ప్రాప్‌ఈక్విటీ (PropEquity) MD & CEO సమీర్ జసుజా చెప్పిన ప్రకారం, గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో న్యూ లాంచ్‌లు పెరగడం, రేట్లు పెరగడం కూడా గృహ రుణాలను పెంచాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం తర్వాత టైర్ 1 నగరాల్లో ఇళ్ల ధరలు 50 నుంచి 100 శాతం పెరిగాయి. దీనివల్ల, ఇంటిపై తీసుకునే అప్పులు కూడా పెరిగాయి. గత కొంత కాలంగా ఖరీదైన ఇళ్లకు (Luxury Home) డిమాండ్ కూడా పెరుగుతోంది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి