RBI Repo Rate Hike:


భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) మరోసారి విధాన వడ్డీరేట్లను (Repo Rate hike) పెంచడం స్థిరాస్తి మార్కెట్లో నెగెటివ్‌ సెంటిమెంటును పెంచింది. ఫలితంగా బుధవారం సంబంధిత రంగానికి చెందిన షేర్లు (Real Estate Shares) పతనమవుతున్నాయి. ఆయా కంపెనీల యజమానులు సైతం రెపోరేట్ల పెంపు ఇళ్ల విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.


కేంద్ర బ్యాంకు 25 బేసిస్‌ పాయింట్ల మేర రెపోరేటు పెంచుతుందని మార్కెట్‌ వర్గాలు ముందే అంచనా వేశాయి. అయినా స్థిరాస్తి రంగాల షేర్లు ఢమాల్‌ అన్నాయి. ఫీనిక్స్‌ మిల్స్‌ షేర్లు ఐదు శాతం వరకు పతనమయ్యాయి. సన్‌టెక్‌ రియాల్టీ, ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఒబెరాయ్ రియాల్టీ షేర్లూ నేలచూపులు చూస్తున్నాయి. నిఫ్టీ రియాల్టీ సూచీ ఒక శాతం వరకు పతనమైంది.


'నేటి రెపోరేటు పెంపుతో వడ్డీరేట్లు 9.5 శాతం బెంచ్‌మార్క్‌ను దాటేస్తాయి. ఫలితంగా అందుబాటు ధరల్లో ఇళ్ల అమ్మకాలపై ఒత్తిడి నెలకొంటుంది. ఎందుకంటే మధ్యతరగతి వర్గాలు ధరల విషయంలో నిక్కచ్చిగా ఉంటారు' అని అనరాక్‌ ఛైర్మన్‌ అనుజ్‌ పూరి అన్నారు. 'ఇప్పటికే తక్కువ ధర ఇళ్ల రంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పుడు వడ్డీరేట్లు మరింత పెరగడం స్థిరాస్తి రంగానికి సాయపడదు' అని పేర్కొన్నారు.


ఆర్బీఐ ద్రవ్య విధానం స్థిరాస్తి రంగాన్ని చాలా విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే చాలా వరకు గృహరుణాలు రెపోరేటుతో అనుసంధానమై ఉంటాయి. కేంద్ర బ్యాంకు ఎప్పుడు విధాన రేటును సవరించినా వడ్డీరేట్లు (Interest Rates), ఈఎంఐలు (EMIs) పెరుగుతాయి. ఇళ్ల కొనుగోలు ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఫలితంగా డిమాండ్‌ తగ్గుతుంది. ఒకవేళ ఆర్బీఐ రెపోరేటును తగ్గిస్తే వడ్డీరేట్లు తగ్గుతాయి. కొనుగోలు ధర తగ్గడంతో స్థిరాస్తి రంగానికి ఊపొస్తుంది.


'ఇళ్ల అమ్మకాలపై రెపోరేట్ల ప్రభావం స్వల్పకాలమే ఉంటుంది. మొత్తంగా డిమాండ్‌ కాస్త తగ్గుతుంది. స్థిరాస్తి రంగం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న సమయంలో ఆర్బీఐ రెపోరేట్లు పెంచింది. ఇలాంటప్పుడు ధరల పెంపు సున్నితంగా మారుతుంది' అని స్టెర్లింగ్‌ డెవలపర్స్‌ ఛైర్మన్‌, ఎండీ రమణి శాస్త్రి అన్నారు. 'వచ్చే క్యాలెండర్‌ ఏడాది నుంచి కేంద్ర బ్యాంకు రెపోరేట్లను తగ్గిస్తుందని అంచనా వేస్తున్నా. ప్రతిష్ఠాత్మక సంస్థలు చేపట్టే నాణ్యమైన ప్రాజెక్టులకు డిమాండ్‌ ఉంటుందనే భావిస్తున్నాం' అని వైశ్రాయ్‌ మేనేజింగ్‌ పాట్నర్‌ సైరస్‌ మోదీ పేర్కొన్నారు.


గతేడాది మే నుంచి ఆర్బీఐ 250 బేసిస్‌ పాయింట్ల మేర రెపోరేటు పెంచినా విలాసవంతమైన ఇళ్లు, ఆస్తుల కొనుగోళ్లపై ప్రభావం చూపలేదని స్థిరాస్తి రంగ నిపుణులు అంటున్నారు. సంపన్నులు ధరల పెరుగుదల గురించి అతిగా ఆలోచించడం లేదని పేర్కొంటున్నారు. నచ్చిన ఇంటిని ఎంత ధర పెట్టైనా సొంతం చేసుకుంటున్నారని తెలిపారు. 'విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్‌ తగ్గలేదు. ఈ విభాగంలోని కస్టమర్లు ధరల పెంపును పరిగణనలోకి తీసుకోవడం లేదు' అని బెన్నెట్‌ అండ్‌ బెర్నార్డ్‌ కంపెనీ ఛైర్మన్‌ లింకన్‌ బన్నెట్‌ రోడ్రిగ్స్‌ అన్నారు. ఈ కంపెనీ గోవాలో విలాసవంతమైన ఇళ్ల ప్రాజెక్టులను చేపట్టింది.