రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. దీంతో రెపో రేటు 4 శాతంగా.. రివర్స్‌ రెపోరేటు 3.35 శాతంగానే ఉండనున్నాయి. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ బుధవారం నుండి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు సమావేశమై, కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుండడం, ద్రవ్యోల్బణ రేటు తగ్గుతుండడం వంటి పరిణామాల వేళ ఆర్బీఐ మరోసారి సర్దుబాటు వైఖరి వైపే మొగ్గుచూపింది.


తాజా నిర్ణయాల ప్రకారం.. వరుసగా 8వ సారి రెపో రేటును 4 శాతంగా, రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా కొనసాగిస్తున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని, మంచి రికవరీతో భారత్ ఇప్పుడు మంచి స్థానంలో ఉందని శక్తికాంత దాస్ అన్నారు. గత మానిటరీ పాలసీ సమావేశం సమయంతో పోలిస్తే ఇప్పుడు బాగుందని చెప్పారు. వృద్ధి క్రమంగా మెరుగుపడుతోందని, ద్రవ్యోల్భణం అంచనాలకు మించి ఉందని తెలిపారు. ఇంధన పన్నులు ద్రవ్యోల్భణం తగ్గుదలకు దోహదం చేస్తాయని వెల్లడించారు. డిమాండ్ క్రమంగా పెరుగుతోందని, అయినప్పటికీ కాస్తనెమ్మదిగా ఉందని చెప్పారు. పండుగ సీజన్ డిమాండ్‌ను తీర్చేవిధంగా ఉండాలని అన్నారు.