రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు, వాటిలో ఎలాంటి మార్పులు లేవని ఆర్బీఐ ప్రకటించింది. నేడు దిల్లీలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ మేరకు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష వివరాలను తెలియజేశారు. రెపో రేటు 4 శాతంగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగుతాయని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తి కొనసాగుతుండడంతో రెపో రేటుపై యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
కొవిడ్..
కొవిడ్ విజృంభణతో భారత ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. కేవలం భారత్ కాదు.. ప్రపంచ దేశాలు కూడా కరోనా ధాటికి కుప్పకూలిపోయాయి. చైనా, అమెరికా, ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా పతనమయ్యాయి. తిరిగి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు భారత్ సహా అనేక దేశాలు కొవిడ్ ప్యాకేజీలను ప్రవేశపెట్టాయి. ఆర్బీఐ కూడా ఎన్నో చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రపంచదేశాలు కరోనా చేసిన ఆర్థిక నష్టాన్ని పూడుస్తున్నాయి.