RBI launches UPI for Feature Phones: డిజిటల్‌ బ్యాంకింగ్‌ (Digital Banking), ఫైనాన్షియల్‌ ఇంక్లూషన్‌ (Financial Inclusion)  పరంగా భారత్‌ మరో ముందడుగు వేసింది! దేశ వ్యాప్తంగా కోట్ల సంఖ్యలో వాడుతున్న యూపీఐ సర్వీసులు (UPI Services) ఇప్పుడు ఫీచర్‌ ఫోన్లోనూ అందుబాటులోకి వచ్చాయి. ఫీచర్‌ ఫ్లోనో (Feature Phones) యూపీఐ సేవలను రిజర్వు బ్యాంక్ ఆఫ్‌ ఇండియా మంగళవారం ఆరంభించింది. అంటే ఇప్పుడు యూపీఐ విధానంలో నగదు చెల్లింపులు చేసేందుకు ఇంటర్నెట్‌ (Internet), స్మార్ట్‌ ఫోన్ (smart Phone) మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు.


యూపీఐ సర్వీసులు దేశంలో సంచలనం సృష్టించాయనే చెప్పాలి. ఒకప్పుడు ఏదైనా కొనుగోలు చేయాలంటే కేవలం నగదు లేదా క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను ఉపయోగించాల్సి వచ్చేది. మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులకు ఊపొచ్చింది. ఐదు రూపాయల వస్తువు కొనుకున్నా ఆ మొత్తాన్ని పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి యాప్స్‌ ద్వారా చేసేస్తున్నారు. ఇందుకు యూపీఐ సర్వీసునే ఉపయోగించుకుంటున్నారు.


దేశంలో 180 కోట్ల మొబైల్‌ ఫోన్‌ యూజర్లు ఉన్నారని అంచనా. ఇందులో 78 కోట్లు మాత్రమే స్మార్ట్‌ఫోన్లు. మిగతావన్నీ ఫీచర్‌ ఫోన్లు. గతంలో వీరు యూపీఐ సర్వీసులు ఉపయోగించుకొనేందుకు వీలుండేది కాదు. వీరందరినీ డిజిటల్‌ పేమెంట్స్‌ మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ నడుం బిగించింది. UPI123Pay అనే యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్ఫేస్‌ను తీసుకొచ్చింది. మంగళవారం ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ ఈ సేవలను ఆరంభించారు.


'యూపీఐ123పే దేశంలోని కోట్లాది మందిని డిజిటల్‌గా ఎంపవర్‌ చేయనుంది. రోజుకు వంద కోట్ల కన్నా ఎక్కువ లావాదేవీలు సాధించాలన్న ఎన్‌పీసీఐ కలను సాకారం చేస్తుంది' అని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) ఛైర్మన్‌ బిశ్వమోహన్‌ మాహాపాత్ర అన్నారు. 'డిజిటల్‌ చెల్లింపుల్లో మనమెంతో వృద్ధి సాధించాం. కానీ ఈ డిజిటైజేషన్‌ కేవలం స్మార్ట్‌ఫోన్లు ఉన్నవారికే పరిమితమైంది. దేశంలో 40 కోట్లకు పైగా ఫీచర్‌ ఫోన్‌ యూజర్లు ఉన్నారు. వారు డిజిటల్‌ చెల్లింపులు చేయలేకపోతున్నారు. వారినీ యూపీఐ పేమెంట్‌ మెథడ్‌ పరిధిలోకి తీసుకురావడమే మా లక్ష్యం' అని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ రవి శంకర్‌ అన్నారు.


UPI123Pay ద్వారా ఫీచర్‌ ఫోన్ల నుంచి యూపీఐ లావాదేవీలు చేపట్టేందుకు వీలవుతుంది. స్మార్ట్‌ఫోన్లలో స్కాన్ చేయడం మినహా మిగతా అన్ని ఆప్షన్లను ఫీచర్‌ ఫోన్‌ యూజర్లు వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఇంటర్నెట్‌ అవసరం లేదు. ఈ సేవలు వాడుకోవడానికి యూజర్లు ముందుగా తమ బ్యాంకు ఖాతాలను ఫీచర్‌ ఫోన్‌కు లింక్‌ చేసుకోవాలి. అప్పుడు UPI123Pay ద్వారా ఒక వ్యక్తి నుంచి మరొకరికి, మర్చంట్స్‌కు పేమెంట్‌ చేయొచ్చు. ప్రస్తుతానికి UPI123Pay హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో అందుబాటులో ఉంది. త్వరలో మిగతా భాషల్లోకి విస్తరించనుంది.