RBI enhances UPI transaction limits   : పది రూపాయల టీ తాగినా...  పది వేల రూపాయల షాపింగ్ చేసినా ఇప్పుడు ఎవరూ జేబులో నుంచి డబ్బులు తీయడం లేదు. ఫోన్ తీసి.. ఫోన్ పే, గూగుల్ పే చేస్తున్నారు.  దేశవ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్ సిస్టమ్ అంతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది.  బ్యాంక్ ట్రాన్సాక్షన్లు కూడా ఈజీగా అయిపోతున్నాయి. కానీ రోజుకు లక్ష రూపాయల వరకే పరిమితి ఉండటంతో కొంత మంది ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఇబ్బందులను పరిష్కరించే దిశగా ఆర్బీఐ ముందడుగు వేసింది. అయితే ఈ పరిమితి టాక్స్ పేమెంట్స్ కు మాత్రమే కల్పించారు.  వ్యక్తిగత ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు చేసేవారు ఒక లావాదేవీలో రూ.5 లక్షల వరకు చెల్లించే అవకాశం ఉంది.               


ఇంతకు ముందే  యూపీఐ ద్వారా కొన్ని పేమెంట్స్‌కు ఐదు లక్షల వరకూ అనుమతి 


యూపీఐతో చేసే చెల్లింపులపై ఎలాంటి అదనపు ఛార్జీలు పడవు. ఇదే డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులతో  పేమెంట్స్ చేస్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్బీఐ ఈ పరిమితి పెంచడం ఇదేం తొలిసారి కాదు. అంతకుముందు 2023 డిసెంబర్‌లోనే ఆర్బీఐ.. హాస్పిటల్, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ వంటి వాటికి చేసే యూపీఐ పేమెంట్ లిమిట్‌ను రూ. 5 లక్షలకు పెంచింది. ఇప్పుడు అన్ని టాక్స్ పేమెంట్ లావాదేవీలకు పెంచింది. ఐపీఓల్లో పెట్టుబడి, రిటైల్‌ డైరెక్ట్‌ స్కీముల్లోనూ ఒక్క లావాదేవీకి యూపీఐ ద్వారా రూ.5 లక్షల వరకు చెల్లించే అవకాశం  ఇప్పటికే ఉంది.            


గంటల్లోనే చెక్కులు క్లియర్ చేసేలా కొత్త విధానం                       


ఇదే సమయంలో చెక్ క్లియరెన్స్‌పైనా ఆర్బీఐ గవర్నర్ దాస్ కీలక ప్రకటన చేశారు. చెక్ క్లియరెన్స్ వేగవంతం చేయాలని.. ఇది గంటల్లోనే పూర్తి కావాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 2 నుంచి 3 రోజుల వరకు పడుతుంది. అలాగే ఒక వ్యక్తి తన ఖాతా నుంచి మరొక వ్యక్తి ట్రాన్సాక్షన్స్‌ చేసుకునేందుకు అనుమతులు  ఇచ్చే డెలిగేటెడ్ చెల్లిపుల వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులకు తమ ఖాతాను ఆపరేట్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ మరింత విస్తరించే అవకాశం ఉందని  ఆర్బీఐ భావిస్తోంది.            


ఆర్బీఐ మానిటరింగ్ పాలసీలో ఎలాంటి మార్పులు చేయలేదు. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నందున ఇప్పుడు మార్పులు చేయాల్సిన అవసరం లేదని భావించినట్లుగా తెలుస్తోంది.