Currency Notes Policy: కొందరు వ్యక్తులు ఉంటారు, కరెన్సీ నోట్ల మీద ఉండే తెల్లటి ప్రదేశంలో ఏదేదో రాస్తారు. ముఖ్యంగా, ఆర్థిక సంస్థల్లోని క్యాషియర్ల దగ్గర మనకు ఈ జాఢ్యం కనిపిస్తుంటుంది. ఒక నోట్ల కట్టలో ఎన్ని నోట్లు ఉన్నయో అర్ధం చేసుకునేలా, కట్టలో పైనున్న నోటు మీద ఆ నోట్ల మొత్తం విలువను రాస్తుంటారు. కొన్ని నోట్ల మీద ప్రేమ సందేశాలు, ఫోన్‌ నంబర్లు, మతపరమైన గుర్తులు.. ఇలా చాలానే చూస్తుంటాం.


ఇలా.. ఏదోకటి రాసి ఉన్న కరెన్సీ నోట్లు చట్ట విరుద్ధమని, ఇక పనికి రావని చెబుతూ... ఆ నోట్లను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారట. ఇలాంటి ఘటనల మీద ఫిర్యాదులు పెరిగిపోవడంతో.. కరెన్సీ నోట్ల మీద తన అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.


బ్యాంక్ నోట్‌పై ఏదైనా రాసినంత మాత్రాన దాని విలువ తగ్గదు, అతి చట్ట విరుద్ధం అయిపోదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక నోటు మీద ఏదో రాసి ఉందన్న కారణంతో బ్యాంకులో దానిని తీసుకోలేదని మీకు ఎవరైనా చెబితే, అది పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.


అబద్ధపు సందేశం గుట్టు రట్టు
కరెన్సీ నోటు మీద గీతలు ఉండడం చట్ట విరుద్ధం అవుతుంది, ఆ నోటు చెల్లుబాటు కాదని పేర్కొంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిందంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తున్నారు. ఆ సందేశాన్ని మీరు వీలైనంత ఎక్కువ మందికి షేర్‌ చేయండి, తద్వారా ఈ సమస్య ఎంత పెద్దదో భారతీయులంతా అర్థం చేసుకుంటారు అని కూడా ఆ స్క్రీన్‌షాట్‌తో పాటు ఒక మెసేజ్‌ పాస్‌ అవుతోంది.


దీనికి సంబంధించి, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేసే 'ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో'లోని ఫ్యాక్ట్ చెక్  (PIB Fact Check) విభాగం బృందం ఆదివారం (జనవరి 8, 2023) ట్విట్టర్‌లో వివరణ ఇచ్చింది. ఈ సందేశం కేవలం పుకారు మాత్రమేనని పీఐబీ స్పష్టం చేసింది. సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న స్క్రీన్‌షాట్‌లో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. బ్యాంకు నోట్లపై రాయడం వల్ల చట్ట విరుద్ధం కాదని ఫ్యాక్ట్ చెక్‌లో తెలిపింది.


ఆర్‌బీఐ క్లీన్ నోట్ పాలసీ
క్లీన్ నోట్ పాలసీ గురించి వెల్లడించిన RBI... కరెన్సీ నోట్లపై ఏమీ రాయవద్దని ప్రజలను అభ్యర్థించామని, అలా చేయడం వల్ల వారి రూపురేఖలు మారిపోతాయని, నోటు జీవిత కాలం తగ్గిపోతుందని తెలిపింది. కాబట్టి, నోట్ల మీద ఏమీ రాయొద్దు అన్నది విజ్ఞప్తే కానీ, నిబంధన కాదు. నోట్ల మీద గీతలు ఉన్నా, వాటి యదార్థ విలువతో అవి చెల్లుబాటు అవుతాయి.


దేశంలోని ప్రజల లావాదేవీల కోసం నాణ్యమైన బ్యాంకు నోట్లను ఆర్‌బీఐ జారీ చేస్తుంది. వాటిని పిన్నుల మిషన్‌తో (స్టేప్లర్‌) పిన్‌ చేయడం, వాటి మీద రాయడం, స్టాంప్ ముద్రలు సహా లేదా ఎలాంటి గుర్తులు వేయకుండా ఉండడం, పూలదండల రూపంలో, బొమ్మల రూపంలో, లేదా మతపరమైన ప్రదేశాలను అలంకరించడానికి ఉపయోగించకుండా చూడడం మనందరి బాధ్యత. బ్యాంక్‌ నోట్లు త్వరగా పాడైపోతే, వాటి స్థానంలో కొత్త నోట్లు ప్రింట్‌ చేయడానికి ఆర్‌బీఐ డబ్బు ఖర్చు చేస్తుంది. ఆ ఖర్చును పన్నుల రూపంలో భరించాల్సింది మనమే సుమా.