" హమారా బజాజ్ "  అనేది స్లోగన్ కావొచ్చు కానీ దేశ ప్రజలు నిజంగానే బజాజ్‌ను తమ ఇంటి సభ్యునిగా చేర్చున్నారు. ఒకప్పుడు పెళ్లి అంటే కట్నం కింద బజాజ్ స్కూటర్ ఉండాల్సిందే. ఆ స్కూటర్ దేశాన్ని ఎంతగా ఓ ఊపు ఊపిందో యాభై ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆ స్కూటర్ సృష్టికర్త రాహుల్ బజాజ్ తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికంగా మన మధ్య ఉండకపోవచ్చు కానీ ఆయన కృషి.. పట్టుదల .. దేశ పారిశ్రామిక రంగంలో ఎప్పటికీ చెరగని సంతకం లాంటిదే.




దశాబ్దాల క్రితమే చేతల్లో "మేక్ ఇన్ ఇండియా" చేసి చూపించిన రాహుల్ బజాజ్ !   


మేక్ ఇన్ ఇండియా అనేది ఇప్పటికీ ఇంకా నినాదంగానే ఉంది. స్వదేశీ టెక్నాలజీతో సొంత తయారీతో విదేశీ ఉత్పత్తులకు సవాల్ చేసే సామర్థ్యం ఇంకా మన దగ్గరకు పూర్తి స్థాయిలో రాలేదు. కానీ రాహుల్ బజాద్ దశాబ్దాల క్రితమే ఈ ఘనత సాధించారు. స్వదేశీ టెక్నాలజీ అంటే ఏమిటో లోకానికి చాటి చెప్పారు. మన రోడ్లు, మన అవసరాలు, మన కొనుగోలు శక్తిని చూసి స్వదేశీ టెక్నాలజీతో స్కూటర్లను ఆవిష్కరించి వాహన రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించారు.


స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో పుట్టిన రాహుల్ బజాజ్  !


స్వాతంత్ర్యోద్యమం గురించి చదివిన వారికి జమ్నాలాల్‌ బజాజ్ గురించి తెలియకుండా ఉండదు. ఆయనను జాతిపిత గాంధీ తన ఐదో కుమారుడిగా చెప్పుకునేవారు. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా పలుసార్లు జైలుకు కూడా వెళ్లారు. ఆయన మనవడే రాహుల్‌ బజాజ్‌.  1938, జూన్ 10వ తేదీన జన్మించారు. వ్యాపారరీత్యా మధ్యదప్రదేశ్‌లోని వార్దా, పుణె, ముంబై నగరాలకు నివాసాలను మార్చారు. ముంబైలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో పట్టా పొందిన రాహుల్ బజాజ్ 1964లో హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీయే పూర్తి చేశారు. ఆ సమయంలోనే మహారాష్ట్రకు చెందిన  గులాబ్ సింగ్‌తో వివాహం జరిగింది.


బజాజ్ స్కూటర్ "హమారా బజాజ్" అని ప్రజల చేత అనిపించేలా చేసిన రాహుల్ !
 
రాహుల్ బజాజ్ తండ్రి బజాజ్ ఆటోను 1940లో ప్రారంభించారు. తొలి నాళ్లలో విదేశాల నుంచి విడి భాగాలను తెచ్చి అమ్మిన బజాజ్‌ తరువాత సొంతంగానే ద్విచక్రవాహనాలను తయారు చేసేవారు. ఇది కంపెనీకి కష్టమయ్యేది. 1965లో కంపెనీ బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ బజాజ్‌ తక్కువ కాలంలోనే కంపెనీపై పట్టు సాధించి 1968నాటి ఛైర్మన్‌ అయ్యారు.  రాహుల్‌ రాకతో బజాజ్‌ నిజమైన ప్రస్థానం ప్రారంభమైంది. రాహుల్‌ కంపెనీ ఎదుగుదలకు అష్టకష్టాలు పడ్డారు. ఆ కష్టాలకు తగ్గ ఫలితం కూడా దక్కింది.  బజాజ్‌ చేతక్‌ ద్విచక్ర వాహనాల చరిత్రను తిరగరాసింది. స్వల్పకాలంలో ద్విచక్ర వాహనానికి పర్యాయపదంగా మారింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు స్కూటర్‌ అంటే బజాజ్‌ చేతకేనని మధ్యతరగతి ప్రజలతో మమేకమైంది. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేక బ్లాక్‌ మార్కెట్‌ విక్రయాలు కూడా జరిగాయంటే వీటికి అప్పట్లో ఉన్న డిమాండ్‌ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఆ రోజుల్లో బజాజ్‌ స్కూటర్‌ని బహుమతిగా అడగని పెళ్లికొడుకు లేడంటే అతిశయోక్తి కాదు. ఆర్డర్‌ చేసిన తరవాత స్కూటర్‌ కోసం ఒక్కోసారి ఏళ్ల తరబడి వెయిటింగ్ పిరియడ్ ఉండేది.


ప్రభుత్వాలపై పోరాడే గుణం ! 


రాహుల్ బజాజ్ .. బజాజ్‌ సంస్థను నడపించడం ప్రారంభించిన కొత్తలో లైసెన్స్ రాజ్ ఉండేది. దాంతో ఆయన ప్రభుత్వాలపై విరుచుకుపడేందుకు ఏ మాత్రం వెనుకాడేవారు కాదు. ఎమర్జేన్సీ సమయంలో బజాజ్‌ కంపెనీపై ఐటీ అధికారులు ముప్పేట దాడి చేశారు. ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ప్రభుత్వం.. కంపెనీ విస్తరణకు రాహుల్‌ పెట్టుకున్న దరఖాస్తుకు మోక్షం కల్పించింది. కంపెనీ విస్తరణకు అనుమతులు నిరాకరించడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు.  పీవీ హయాంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల్ని రాహుల్‌ స్వాగతించి ప్రభుత్వానికి అండగా నిలిచారు. కానీ, ఆ వెంటనే బహుళజాతి విదేశీ కంపెనీలకు రెడ్ కార్పేట్ పరచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సీఐఐ వ్యవస్థాపకుడు రాహుల్‌ బజాజే.  చాలా తక్కువ వ్యవధిలోనే సీఐఐ ఒక ప్రధాన వ్యాపార వాణిజ్యవేత్తల సంఘంగా తయారు  చేశారు.


సాదాసీదా జీవనం రాహుల్ బజాజ్ స్టైల్ ! 
    
వేల కోట్ల ఆస్తికి అధిపతి అయినా రాహుల్ బజాజ్ ఏనాడూ  చాలా సాదాసీదాగా ఉంటారు.  పుణెలోని కంపెనీ ప్లాంట్‌లోనే ఇల్లు కట్టుకుని అక్కడే నివసించేవారు. పాత హిందీ సినిమాలు, పాటలంటే రాహుల్ బజాజ్‌కు చాలా ఇష్టం. సంఘసేవా కార్యక్రమాలు, ధార్మిక పనుల్లో రాహుల్ బజాజ్ పాల్గొంటారు.  ప్రపంచవ్యాప్తంగా గాంధీ విలువలను ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామాల్లో నీటి సంరక్షణ, గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్ల లాంటి అనేక కార్యక్రమాలు రాహుల్ బజాజ్ చేపట్టారు. జమ్నాలాల్‌ బజాజ్‌ పేరిట ఏటా నాలుగు అవార్డులు ఇస్తున్నారు. ఔరంగాబాద్‌లో ఆసుపత్రిని నెలకొల్పి పేదలకు వైద్యసేవలందిస్తున్నారు.