Price Bomb: ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణంతో మూలుగుతున్న భారత ప్రజానీకం నెత్తి మీద మరో తాటిపండు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలకు ప్రతిరోజూ అవసరమైన సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూల ధరలు పెరగవచ్చు.


సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూల తయారీపై భారం
సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూల తయారీలో ఉపయోగించే కీలకమైన ముడి పదార్థమైన 'శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆల్కహాల్‌'పై (saturated fatty alcohol) మీద అదనపు సుంకాలు విధించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే విధిస్తున్న యాంటీ డంపింగ్ డ్యూటీ (antidumping duty), కౌంటర్‌వైలింగ్ డ్యూటీని (countervailing duty) మరింత పెంచాలన్న ప్రతిపాదన భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద ఉంది. 


ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే, సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూల ధరలు పెరుగుతాయి. చివరకు ఆ భారాన్ని మోయాల్సింది సామాన్య జనమే.


డ్యూటీ పెంపు ప్రతిపాదనను ఇండియన్ సర్ఫ్యాక్టెంట్ గ్రూప్ (ISG) వ్యతిరేకించింది. కొత్త టారిఫ్ ప్రతిపాదనను అమలు చేయవద్దంటూ ఆర్థిక శాఖకు లేఖ రాసింది. అసాధారణ సుంకాలు విధిస్తే పన్నుల నిర్మాణం తారుమారవుతుందని, వినియోగదారు పరిశ్రమలో పోటీ తగ్గుతుందని ఆ లేఖలో ISG ప్రస్తావించింది. ఆయా కంపెనీల ఉపాధి సామర్థ్యం ప్రభావితమవుతుందని పేర్కొంది. ఎందుకంటే, కంపెనీ మనుగడ, లాభదాయకత కోసం ఉత్పత్తి కార్యకలాపాలను ఆయా సంస్థలు తగ్గించుకోవలసి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు రాసిన లేఖలో ISG వెల్లడించింది. భారతదేశం ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతోంది కాబట్టి, ధరలు ఇంకా పెరిగితే వినియోగదారుల బాధ మరింత పెరుగుతుందని పేర్కొంది.


సుంకాలు పెంచవచ్చని ప్రభుత్వ విభాగం సిఫార్సు
భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్', రెండు నెలల క్రితం, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ నుంచి 'శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆల్కహాల్‌' దిగుమతులపై అదనపు కౌంటర్‌వైలింగ్ సుంకంతో పాటు యాంటీ డంపింగ్ డ్యూటీకి అధిక రేటు నిర్ణయించవచ్చంటూ సిఫార్సు చేసింది.


అయితే, యాంటీ డంపింగ్‌, కౌంటర్‌వైలింగ్ సుంకాల పెంపుపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ సుంకాలు పెరిగితే, ఆ భారం తుది వినియోగదారుకు బదిలీ చేస్తామని RSPL గ్రూప్ ప్రెసిడెంట్ సుశీల్ కుమార్ బాజ్‌పాయ్ చెప్పారు. ఈ కంపెనీ
ఘరీ డిటర్జెంట్‌, వీనస్ సబ్బులను తయారు చేస్తుంది.


దీనిని బట్టి, భారత ప్రభుత్వం సుంకాలు పెంచితే, దానికి తగ్గ ప్రణాళికలతో సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూల కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. సుంకాల బరువు తమ మీద పడకుండా, తమ లాభాలు తగ్గకుండా చూసుకుంటాయి. ఉత్పత్తుల రేట్లు పెంచి, పన్ను మోతను వినియోగదార్లకు బదిలీ చేయడానికి వినియోగదారు కంపెనీలు తగిన ప్రణాళికలతో రెడీగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.


సాధారణంగా, దేశంలోకి దిగుమతులను నిరుత్సాహపరచడానికి లేదా తగ్గించడానికి యాంటీ డంపింగ్, కౌంటర్‌వైలింగ్ డ్యూటీలను ఆయా దేశాలు విధిస్తాయి. తద్వారా, దేశీయంగా ఆయా ఉత్పత్తులను ఉత్పత్తి చేసే పరిశ్రమలు, సంస్థలను రక్షించే ప్రయత్నం చేస్తాయి. మరొక ఉదాహరణలో.. ఎగుమతి కంపెనీ లేదా ఎగుమతి దేశం ఒక ఉత్పత్తిపై రాయితీ ఇచ్చినప్పుడు, దిగుమతి చేసుకునే కంపెనీల మీద దిగుమతి దేశం అదనపు సుంకాన్ని విధిస్తుంది.