Pradhan Mantri Kaushal Vikas Yojana: దేశ యువతలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం "ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన"ను (PMKVY) 2015లో ప్రారంభించింది. ఈ గవర్నమెంట్‌ స్కీమ్‌ కింద యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం తోపాటు నైపుణ్యాన్ని పెంచేందుకు క్యాష్‌ ప్రైస్‌లు కూడా ఇచ్చి ప్రోత్సహిస్తారు. 


యూత్‌కు మాత్రమే అన్నాం కదాని 25 ఏళ్లు లేదా 30 ఏళ్ల లోపు వాళ్లకే అవకాశం ఉంటుందని అనుకోవద్దు. 45 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తులు కూడా ఈ పథకం కింద అప్లై చేసుకోవచ్చు.


యువకులు ఉద్యోగాల కోసం వెతుక్కోకుండా, సొంత కాళ్లపై ఎదిగేలా చూడడం ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన లక్ష్యం. ప్రారంభించిన తొలి సంవత్సరం 2015-16లో, దేశవ్యాప్తంగా 19.85 లక్షల మంది అభ్యర్థులు ఈ స్కీమ్‌ కింద శిక్షణ తీసుకున్నారు. PMKVY పైలెట్‌ ప్రాజెక్టు విజయవంతం కావడంతో దీనిని మరిన్ని రంగాలకు విస్తరించారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి భారత ప్రభుత్వ మిషన్లను ఇందులోకి చొప్పించారు. తద్వారా లెక్కలేనన్ని అవకాశాలు సృష్టించారు. ఇది యువతకే కాదు, దేశానికీ ఉపయోగపడింది. భారత శ్రామిక శక్తి నైపుణ్యం పెరిగి, ఉత్పాదకత వృద్ధి చెందింది.


ప్రయోజనాలు
PMKVY కింద యువతకు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక ట్రైనింగ్‌ సెంటర్లు (TCs) ఉంటాయి. ఈ ట్రైనింగ్‌ సెంటర్లలో 3 రకాల శిక్షణలు అందిస్తారు. అందులో షార్ట్‌ టర్మ్‌ ట్రైనింగ్‌ (STT) ఒకటి. పాఠశాల/కళాశాల విద్యను మధ్యలో వదిలేసిన వాళ్లు లేదా నిరుద్యోగులకు దీనివల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ (NSQF) ప్రకారం శిక్షణ అందించడమే కాకుండా... సాఫ్ట్ స్కిల్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫైనాన్షియల్, డిజిటల్ లిటరసీ, ఇంగ్లీష్‌ వంటి అంశాల్లోనూ ట్రైనింగ్‌ ఇస్తారు. కొన్ని రకాల కోర్సులను మాత్రం ఫీజ్‌ తీసుకుని నేర్పిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్లేస్‌మెంట్ సాయాన్ని కూడా ప్రభుత్వం అందిస్తుంది.


అంతర్జాతీయ ప్రమాణాలు, అవసరాలకు అనుగుణంగా యాడ్-ఆన్ బ్రిడ్జ్ కోర్సులను TCలో అందిస్తారు. ఆయా దేశాల్లో ఇంగ్లీష్‌ ఎలా మాట్లాడాలో నేర్పిస్తారు. దీనివల్ల భారతీయ యువత అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను కూడా వెతుక్కోవచ్చు. ఈ దిశగానూ కేంద్రం నుంచి సాయం అందుతుంది. ఎంచుకున్న ఉద్యోగ అవసరాన్ని బట్టి శిక్షణ కాలం మారుతుంది. 


దివ్యాంగ అభ్యర్థులు కూడా ఈ శిక్షణ కోసం అప్లై చేసుకోవచ్చు, వారికి ప్రత్యేక మద్దతు లభిస్తుంది.


PMKVY కింద దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్‌ తప్పనిసరిగా ఉండాలి. కోర్సు నేర్చుకునే వాళ్లకు 70% హాజరు కూడా ఉండాలి.


సర్టిఫికేట్ పొందిన ప్రతి ఒక్కరికి, మూడేళ్ల కాలానికి రూ. 2 లక్షల ప్రమాద బీమా (కౌశల్ బీమా) కల్పిస్తారు. దీనివల్ల, యువతలో భరోసా కూడా పెరుగుతుంది. ప్రమాద బీమా మాత్రమే కాదు.. శిక్షణ కాలంలో భోజనం & వసతి ఖర్చుల్లోనూ కేంద్ర ప్రభుత్వం సాయంగా నిలుస్తుంది. రానుపోను రవాణా ఖర్చులను కూడా అందిస్తుంది. 


అర్హతలు
భారతీయుడైన ఏ వ్యక్తి అయినా అర్హుడే
15-45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి
ఆధార్ కార్డ్, ఆధార్-లింక్డ్ బ్యాంక్ ఖాతా ఉండాలి


ఎలా దరఖాస్తు చేయాలి?
https://www.pmkvyofficial.org/pmkvy2/find-a-training-centre.php లింక్‌ ద్వారా మీ దగ్గరలోని శిక్షణ కేంద్రాన్ని గుర్తించి, నేరుగా వెళ్లి అప్లై చేయవచ్చు. లేదా https://www.pmkvyofficial.org/trainingcenter లింక్‌ ద్వారా ఆన్‌లైన్‌ ద్వారా కూడా అప్లై చేయవచ్చు.


మీరు ఏ ఉపాధి కోసం దరఖాస్తు చేస్తే దానికి సంబంధించిన పత్రాలు మీ దగ్గర ఉండాలన్న విషయం గుర్తుంచుకోండి.


మరో ఆసక్తికర కథనం: గోల్డ్‌ రష్‌ - అప్పుడు 102 రూపాయలే, ఇప్పుడు రూ.75,300