రైతన్నలకు శుభవార్త! ప్రధానమంత్రి కిసాన్‌ యోజనలో భాగంగా పదో విడత నగదు బదిలీ జరగనుంది. 2022, జనవరి 1నే రైతుల ఖాతాల్లోని నగదు బదిలీ అవ్వనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కొత్త సంవత్సరం మొదటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ నగదు బదిలీని ఆరంభిస్తారు. ఆ తర్వాత వచ్చే విడత నగదు బదిలీ తేదీని నిర్ణయిస్తారు.


ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే రైతులు ఈ-కేవైసీ చేయించుకోవాలి. తాజాగా రేషన్‌ కార్డును అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు పథకంలో పేర్లు నమోదు చేసుకోని వారు https://pmkisan.gov.in/ portal ద్వారా నమోదు చేసుకోవాలి. లేదంటే ప్రయోజనం పొందలేరు.


రైతులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం 'పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన'. ఇందులో భాగంగా రెండు హెక్టార్లకు తక్కువ భూమి ఉన్న పేద కర్షకులకు ప్రభుత్వం రూ.6000 వరకు ఇస్తోంది. ఇప్పుడీ పథకంలో ఓ మార్పు చేశారు. ఇకపై లబ్ధిదారులు ఇతర పత్రాలతో పాటు కచ్చితంగా రేషన్‌ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే డబ్బులు రావు.


అనర్హులు జొరపడకుండా..!


ఈ పథకంలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రేషన్‌ కార్డును తప్పని సరి చేసింది. అయితే అర్హతలు ఉండీ రేషన్‌ కార్డు లేకుంటే ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకున్న రైతులు, ఇకపై చేసుకోవాలని అనుకుంటున్న రైతులూ తప్పకుండా రేషన్‌ కార్డును చూపించాల్సిందే. కార్డు లేనివారు త్వరగా దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాల్సి ఉంటుంది. ఈ పథకానికి సంబంధించిన పోర్టల్‌లో రేషన్‌ కార్డు సంఖ్య సబ్‌మిట్‌ చేయాల్సి ఉంటుంది.


ఏయే పత్రాలు కావాలంటే..



  • లబ్ధిదారులకు రెండు హెక్టార్లకు మించి భూమి ఉండొద్దు.

  • భూమి యాజమాన్యం పత్రాలు

  • ఆధార్‌ కార్డు

  • గుర్తింపు కార్డు

  • డ్రైవింగ్‌ లేదా ఓటర్‌ ఐడీ

  • బ్యాంక్‌ ఖాతా పుస్తకం

  • మొబైల్‌ ఫోన్‌ నంబర్‌

  • చిరునామా

  • భూమి పరిమాణం సహా వివరాలు

  • ఒక పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో


రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే..



  • ముందుగా మీరు పీఎం కిసాన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

  • తర్వాత రైతుల కార్నర్ కనిపిస్తుంది.. దాని మీద క్లిక్ చేయాలి.

  • 'కొత్త రైతు నమోదు' ఎంపికపై క్లిక్ చేయాలి.

  • తరువాత, ఆధార్ సంఖ్యను నమోదు చేయాలి.

  • దీనితో పాటు, క్యాప్చా కోడ్‌ని నమోదు చేసి.. రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి.  తర్వాత ముందుకు వెళ్లాలి.

  • ఈ ఫారమ్‌లో మీ పూర్తి వ్యక్తిగత సమాచారాన్ని ఎంటర్ చేయాలి

  • బ్యాంక్ ఖాతా వివరాలు మరియు పొలానికి సంబంధించిన సమాచారాన్ని అందించాలి.

  • ఆ తర్వాత మీరు ఫారమ్‌ను సమర్పించవచ్చు.


ఇలా చెక్ చేసుకోవాలి


పీఎం కిసాన్ లబ్ధిదారుడు తన ఖాతాలో డబ్బు పడిందో లేదో తెలుసుకోవాలంటే.. ముందుగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి హోమ్ పేజీ pmkisan.gov.in కి వెళ్లండి. హోమ్ పేజీలో ఉన్న 'లబ్ధిదారుని స్థితి' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. తరువాత విండో తెరుచుకోగానే.. ఏదైనా ఎంపికను ఎంచుకోండి – ఆధార్ నంబర్, ఖాతా సంఖ్య లేదా మొబైల్ నంబర్.. ఎంటర్ చేయాలి. అలా ఎంచుకున్న ఎంపికను ఎంచుకున్న తర్వాత, ‘'డేటాను పొందండి'’ పై క్లిక్ చేయండి. డేటా మీ కంప్యూటర్ స్క్రీన్‌లో కనిపిస్తుంది. లేదా ఇక్కడ కనిపించే ‘'పీఎం కిసాన్ బెనిఫిసియరీ స్టేటస్' డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయొచ్చు.