India’s Crude Import Price Falls: భారతదేశం ముడి చమురుపై అతిగా ఆధారపడే ఆర్థిక వ్యవస్థ. మన దేశ చమురు అవసరాల్లో సింహభాగం దిగుమతుల ద్వారానే తీరుతోంది. మన దేశంలోకి దిగుమతి చేసుకునే ముడి చమురు ధరలు గత ఐదు సంవత్సరాలలో భారీగా పెరిగాయి. ప్రస్తుతం, భారత్‌కు, ముడి చమురు దిగుమతి సగటు ఖర్చు బ్యారెల్‌కు 70 డాలర్ల కంటే తక్కువగా ఉంది. 2021 ఆగస్టు తర్వాత, చమురు దిగుమతుల కోసం ఇంత తక్కువ మొత్తం చెల్లించాల్సి రావడం ఇదే తొలిసారి. 

ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో, బ్రెంట్ క్రూడ్‌ ధర బ్యారెల్‌ 65 డాలర్లకు కొంచం పైన ఉంది, సోమవారం  65 డాలర్ల కంటే దిగువకు పడిపోయింది. గత శుక్రవారం నాడు, భారతదేశ ముడి చమురు దిగుమతి ఖర్చు బ్యారెల్‌కు సగటున 69.39 డాలర్లకు చేరింది. ఇది, గత ఏడాది‍‌ (2024) ఏప్రిల్‌లో ఉన్న 89.44 డాలర్ల ఖర్చు కంటే 22 శాతం తక్కువ. 

 అవసరాల్లో 87 శాతం దిగుమతిచమురు రంగ నిపుణులు చెబుతున్న ప్రకారం, భారతదేశం, ప్రాసెస్ చేసిన ముడి చమురు అవసరాల్లో 87 శాతానికి పైగా మొత్తాన్ని దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటోంది. రిఫైనరీ (శుద్ధి) వ్యాపారంలో ముడి చమురు ప్రధాన ముడి పదార్థం, ఇది మొత్తం ఖర్చులో 90 శాతం వాటా కలిగి ఉంది.

ప్రపంచ వృద్ధి మందగించడం & వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతల మధ్య డిమాండ్ తగ్గడం వల్ల రాబోయే రోజుల్లో ముడి చమురు ధరలు మరింత తగ్గవచ్చన్నది నిపుణుల మాట. ముడి చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్‌ ప్లస్‌ దేశాలు నిర్ణయించడం కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్లను పడేసింది.      

వరుసగా రెండేళ్లు డిమాండ్‌లో తగ్గుదలఈ సంవత్సరం ముడి చమురు సగటు ధర బ్యారెల్‌కు 63 డాలర్ల వద్ద ఉంటుందని గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసింది. చమురు ఉత్పత్తి & ఎగుమతి దేశాల కూటమి అయిన OPEC, ఈ సంవత్సరం & వచ్చే ఏడాది చమురు డిమాండ్ తగ్గుతుందని వెల్లడిస్తూ ఓ నివేదిక రిలీజ్‌ చేసింది. OPEC సెక్రటేరియట్ రిపోర్ట్ ప్రకారం, 2025 & 2026 సంవత్సరాల్లో ముడి చమురు డిమాండ్‌లో వృద్ధి అంచనాలను రోజుకు సుమారు 1,00,000 బ్యారెళ్ల వరకు తగ్గించింది. ఈ ప్రకారం, ప్రతి సంవత్సరం రోజుకు 1.3 మిలియన్ బ్యారెళ్లు లేదా దాదాపు 1% మేర డిమాండ్‌లో కొరత ఏర్పడుతుందన్నది అంచనా.         

కేంద్ర మంత్రి మాటకొన్ని రోజుల క్రితం, కేంద్ర ప్రభుత్వం, భారతదేశంలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపును ప్రకటించింది. ఆ సమయంలో, విలేకరుల సమావేశంలో మాట్లాడిన కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పురి, చమురు కంపెనీలు 45 రోజుల రిజర్వ్స్‌ ఉంచుకున్నాయని, దీనివల్ల బ్యారెల్‌కు 75 ఖర్చు అవుతుందని చెప్పారు. బ్యారెల్ ధర 60 నుంచి 65 డాలర్లకు పడిపోయినప్పుడు, చమురు కంపెనీలు పెట్రోల్ - డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి ఆ రోజు అన్నారు. హర్‌దీప్ సింగ్ పురి మాట ప్రకారం, మన దేశంలో అతి త్వరలోనే పెట్రోల్‌ & డీజిల్‌ ధరలు తగ్గవచ్చు.