New Year Financial Planning 2025: మరికొన్ని రోజుల్లో 2024 ముగుస్తుంది. ఈ సంవత్సరంలో మీ ఆర్థిక ప్రయాణాన్ని అంచనా వేయాల్సిన టైమ్‌ వచ్చింది. ఏటా ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ను సమీక్షిస్తే, లక్ష్యాన్ని చేరే ప్రయాణంలో మీరు ఎక్కడ ఉన్నారో అంచనా వేయడానికి వీలవుతుంది. తద్వారా, కొత్త సంవత్సరంలో మీ ఆర్థిక పరిస్థితులను సర్దుబాటు చేయడం సులువుగా మారుతుంది. ఈ ప్రక్రియలో, మీ పొదుపులు, పెట్టుబడుల నుంచి బీమా కవరేజీ వరకు ప్రతి ఒక్కటి కవర్‌ కావాలి. అప్పుడే మీరు సాలిడ్‌ ప్లాన్‌ రూపొందించగలరు.


సంవత్సరాంతపు ఆర్థిక ప్రణాళికతో ప్రయోజనాలు: పన్ను భారాన్ని తగ్గించడం, పెట్టుబడులపై రాబడి పెంచడం, రిస్క్‌ తగ్గించడం, రిటైర్మెంట్‌ ప్లాన్‌ను మరింత మెరుగుపరచడం వంటివి.


ఆర్థిక సమీక్షలో చూడాల్సిన అంశాలు


మీ ఇంటి బడ్జెట్‌
మీరు తగ్గించగల లేదా ఎక్కువ ఖర్చు చేయాల్సిన ఖర్చులను గుర్తించడానికి ఈ సంవత్సరంలో మీ ఖర్చు అలవాట్లను సమీక్షించండి. ఉదాహరణకు, మీ డబ్బును పోషకాహారం లేదా నైపుణ్య వృద్ధి కోసం ఉపయోగిస్తే, OTT సబ్‌స్క్రిప్షన్‌ లేదా జిమ్ మెంబర్‌షిప్‌ వంటి వాటిపై చేయాల్సిన ఖర్చు తగ్గుతుంది.


ఆర్థిక స్థితిగతులు
రుణాలు లేదా క్రెడిట్ కార్డ్ బకాయిలు, పొదుపులు, పెట్టుబడులు సహా మీ ఆదాయం-అప్పుల లిస్ట్‌ తయారు చేయండి. ఈ నంబర్లు ఆశాజనకంగా లేకపోతే, సేవింగ్స్‌ పెంచుకుంటూ అప్పులు తీర్చే లక్ష్యంతో మీ ఆర్థిక వ్యూహాన్ని మళ్లీ రూపొందించండి.


ఆదాయ పన్ను ప్రణాళిక
ఆర్థిక ప్రణాళికలో ఇది కీలక భాగం. గత 2-3 సంవత్సరాలలో ఆదాయ పన్ను విధానాలు మారాయి. ఏ రకమైన పెట్టుబడులతో రాబడితో పాటు పన్ను ఆదా అవుతుందో చూడండి. పాత-కొత్త పన్ను విధానాల్లో మీకు ఏది సూట్‌ అవుతుంది సరిగ్గా అంచనా వేయండి. ఓవరాల్‌గా, మీ టాక్స్‌ ప్లానింగ్‌ నుంచి గరిష్ట ప్రయోజనాన్ని పొందేలా మీ పెట్టుబడులను ప్లాన్ చేయండి.


పెట్టుబడుల అంచనా
గత సంవత్సరంలో మీ పెట్టుబడులపై ఎంత రాబడి వచ్చిందో అంచనా వేయండి. మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా అవి పని చేయకపోతే, మీ పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేయండి, అసెట్ కేటాయింపును మార్చండి.


బీమా పాలసీ
మీరు కొత్తగా పెళ్లి చేసుకున్నా  లేదా ఇటీవల తల్లిదండ్రులు అయినా మీ బీమా కవరేజీని పెంచాల్సి రావచ్చు. మీరు బ్యాచిలర్‌గా ఉన్నప్పటి ప్లాన్‌ ఇప్పుడు సరిపోకపోవచ్చు. అలాగే, మీ పాలసీ మెడికల్‌ ఇన్‌ఫ్లేషన్‌ కంటే ముందుండేలా చూసుకోండి. తక్కువ ధరలో అధిక కవరేజ్ ఇచ్చే బెస్ట్‌ బీమా పాలసీని ఎంచుకోవడానికి ఆన్‌లైన్ కాలిక్యులేటర్‌ ఉపయోగించండి.


అత్యవసర నిధి
ప్రతి వ్యక్తికి ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఉద్యోగ నష్టం లేదా అత్యవసర వైద్యం వంటి ఆకస్మిక పరిస్థితుల్లో ఇదే అండగా నిలుస్తుంది. కనీసం మీ 6 నెలల ఖర్చులకు తగ్గకుండా ఈ ఫండ్‌లో డబ్బును ఉంచాలి. ఈ ఫండ్‌ను ఏటా సమీక్షించాలి, అవసరమైతే టాప్‌-అప్‌ చేయాలి.


సంవత్సరాంతపు ఆర్థిక సమీక్ష మీ ఫైనాన్షియల్‌ స్టేటస్‌ గురించి అప్‌డేట్‌ ఇస్తుంది. మీ ప్లాన్‌లో ఏవైనా లోపాలు ఉంటే మీకు చెబుతుంది. తద్వారా, కొత్త సంవత్సరాన్ని మీరు మరింత ఎఫెక్టివ్‌ ప్లానింగ్‌తో ప్రారంభించొచ్చు. మీ ఆర్థిక విషయాలపై మరింత స్పష్టత వస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం & మనశ్శాంతి పెరుగుతుంది.


మరో ఆసక్తికర కథనం: భారత రాష్ట్రపతికి 77 కంపెనీల్లో షేర్లు - వాటి విలువ తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి!