PMJJBY: ఒకప్పుడు మధ్య తరగతి లేదా అధిక ఆదాయ వర్గాల ప్రజలకు మాత్రమే ఇన్సూరెన్స్‌ స్కీమ్స్‌ కొనగలిగే స్థోమత ఉండేది. పేదవాళ్లు కూడా బీమా ఫెసిలిటీ, ఆర్థిక భద్రతను పొందాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. దాని పేరు "ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన" (PM Jeevan Jyoti Bima Yojana). దీనిలో, ఏడాదికి కేవలం రూ. 436 కట్టి రూ. 2 లక్షల వరకు బీమా రక్షణ పొందొచ్చు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో లాంచ్‌ చేసింది. మీరు కూడా, అతి తక్కువ ప్రీమియం ఈ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ కవరేజ్‌ పొందాలంటే, ముందు ఈ పథకం పూర్తి వివరాలు తెలుసుకోండి.


'ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన' వివరాలు
18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సున్న ఎవరైనా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) కింద ప్రీమియం కట్టొచ్చు. ప్రమాదం, అనారోగ్యం వంటి కారణాలతో పాలసీదారు మరణిస్తే నామినీకి రూ. 2 లక్షల వరకు బీమా డబ్బు లభిస్తుంది. అంటే, తన మరణాంతరం కూడా తన కుటుంబానికి ఆర్థిక రక్షణను పాలసీదారు అందించగలడు. మరోవైపు, ఏదైనా ప్రమాదంలో అవయవ వైకల్యం ఏర్పడితే, రూ. 1 లక్ష వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. 


ప్రీమియం ఎలా కట్టాలి?
PMJJBY కొనాలంటే మీకు బ్యాంక్‌ అకౌంట్‌ లేదా పోస్టాఫీసు ఖాతా ఉండాలి. ప్రీమియం కోసం ప్రతి సంవత్సరం రూ. 436 మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. 2022 సంవత్సరానికి ముందు ఈ మొత్తం రూ. 330 గా ఉండగా, ఆ తర్వాత రూ. 426 కు పెంచారు. ఇప్పుడు రూ. 436 చేశారు. ప్రీమియం కడితే, బీమా కవరేజ్‌ ఏటా జూన్ 1 నుంచి తర్వాతి సంవత్సరం మే 30 కాలంలో చెల్లుబాటులో ఉంటుంది. ఈ పాలసీ కోసం ఆటో డెబిట్ సిస్టమ్ ద్వారా ప్రీమియం అమౌంట్‌ కట్‌ అవుతుంది. అంటే.. జూన్ 1న, మీ సేవింగ్స్ ఖాతా నుంచి డబ్బు ఆటోమేటిక్‌గా కట్‌ అవుతుంది, బీమా ప్రీమియం కోసం డిపాజిట్ అవుతుంది. 


ఈ పాలసీని కొనుగోలు చేయడానికి అవసరమైన  పత్రాలు:
ఆధార్ కార్డ్ (Aadhaar Card)
పాన్ కార్డ్ (PAN Card)
రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు (Passport Size Photos)
బ్యాంక్/పోస్టాఫీస్‌ పాస్ బుక్ (Bank Passbook)
మొబైల్ నంబర్ (Mobile Number)


పాలసీ దరఖాస్తు & క్లెయిమ్ ప్రాసెస్‌
మీరు, మీ అకౌంట్‌ ఉన్న బ్యాంక్‌ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి PMJJBY కోసం అప్లై చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం జూన్ 1న, ఆటో డెబిట్ మోడ్ ద్వారా మీ సేవింగ్స్ అకౌంట్‌ నుంచి ప్రీమియం అమౌంట్‌ను కట్‌ చేస్తారు.  పాలసీహోల్డర్‌ మరణిస్తే, నామినీకి పాలసీని క్లెయిమ్ చేసే హక్కు ఉంటుంది. పాలసీదారు మరణ ధృవీకరణ పత్రం, వ్యక్తిగత రుజువు, నామినీ ఐడీ వంటి పేపర్లు సబ్మిట్‌ చేసి బీమా డబ్బును క్లెయిమ్ చేయవచ్చు. ప్రమాదం కారణంగా పాలసీదారు వికలాంగుడైతే, బీమా కోసం క్లెయిమ్ చేయవచ్చు. దీని కోసం హాస్పిటల్‌ బిల్స్‌ వంటివి సమర్పించాలి. 


మరో ఆసక్తికర కథనం: ఆపిల్‌ సీఈవోకి చేదు అనుభవం, సొంత కంపెనీ క్రెడిట్‌ కార్డు కోసం అప్లై చేస్తే రిజెక్ట్‌ చేశారు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial