హోం లోన్ కు దరఖాస్తు చేస్తాం.. కానీ కొన్నిసార్లు బ్యాంకులు లోన్ ఇవ్వకపోవచ్చు. అంత ఈజీగా మన అప్లికేషన్ ను ఆమోదించకపోవచ్చు. దీనికి దరఖాస్తు చేయడంలోని తప్పులే కాదు.. మరికొన్ని ఇతర కారణాలూ ఉన్నాయి. అయితే హోం లోన్ దరఖాస్తు తిరస్కరణకు కారణాలు ఏంటి? అప్పు ఇచ్చే ముందు బ్యాంకులు ఎలాంటి విషయాలను చూస్తాయి?


మీరు ఏ బ్యాంకు వెళ్లినా.. ముఖ్యంగా రెండు విషయాలను చూస్తారు. మెుదటిది క్రెడిట్ స్కోర్. రెండోది ఆదాయం. వీటిపైనే మన లోన్ ఆధారపడి ఉంటుంది. అయితే, లోన్ ఇచ్చేందుకు ప్రతీ బ్యాంకుకు కొన్ని నియమనిబంధనలు ఉంటాయనేది గుర్తుంచకోవాలి. ఆ బ్యాంకుకు కావాల్సిన కనీస అర్హతలు ఉంటేనే రుణం ఇస్తాయి.. లేదంటే అస్సలు ఇవ్వవు. మీ అప్లికేషన్ ను తిరస్కరిస్తాయి. లోన్ కోసం అప్లై చేసే వ్యక్తికి స్థిరమైన ఆదాయం ఉందా? లేదా? అనేది బ్యాంకులు ప్రధానంగా చూస్తాయి. అంతేకాదండి.. వయసు, నివాసం, ఎంత చదువుకున్నారనేది పరిశీలిస్తాయి. దరఖాస్తులో తప్పులు ఎంటర్ చేసినా.. మీ లోన్ పరిస్థితి అంతే.



  • మీ వయసు, సర్వీసు కాలం, ఈఎంఐ.. లోన్స్ తిరిగి చెల్లించే సమయం కూడా లోన్ వస్తుందా లేదా అనేది నిర్ణయిస్తాయి. తక్కువ వయసు ఉండి.. లోన్ చెల్లించేందుకు ఎక్కువ టైమ్ ఉంటే.. తక్కువ ఈఎంఐతో లోన్ తీర్చేందుకు ఛాన్స్ ఉంటుంది. కావున తొందరగా ఆమోదించే అవకాశం ఉంది. అదే మీ వయసు ఎక్కువగా ఉండి.. పదవీ విరమణకు దగ్గరగా ఉంటే లోన్ పూర్తి చేసేందుకు మీకు తక్కువ టైం ఉంటుంది. ఈఎంఐ కూడా పెరుగుతుందనేది గుర్తుపెట్టుకోవాలి. సాధార‌ణంగా నెల‌ ఆదాయంలో 50 శాతం లోప‌ల ఈఎంఐ ఉండాలి. అంత‌కు మించి ఈఎంఐ చెల్లించాల్సిన పరిస్థితి ఉంటే మీ లోన్ అప్లికేషన్ తిరస్కరించే అవకాశం ఉంది.

  • ఆస్తి విలువలో 85 శాతం వరకూ బ్యాంకులు రుణాలిస్తాయి. మార్కెట్ ధరతో సంబంధం లేదు. భవనం నిర్మించి ఎన్ని ఏళ్లు అవుతుంది, ఇల్లు ఉన్న ప్రదేశం, నిర్మాణ విలువలు, ప్రస్తుతం ఉన్న స్థితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆస్తి విలువ అంచనా వేస్తారు. ఒకవేళ మీ ఆస్తి విలువ తక్కువగా ఉండి.. మీకు లోన్ అర్హత ఉన్నా.. దరఖాస్తు తిరస్కరించవచ్చు. 

  • మీకు ఉండే ఆస్తి.. లోకల్ బాడీస్ నుంచి ఆమోదం పొందినదో లేదో బ్యాంకులు తనిఖీలు చేస్తాయి. స్థానిక అధికారులు సూచించిన గైడ్ లైన్స్ కు కట్టుబడి ఉండకపోతే.. లోన్ రాకపోవచ్చు. మీరు బిల్డర్ వద్ద నుంచి ఇంటిని కొనుగోలు చేశారనుకోండి.. బ్యాంకు ఆమోదం లేని.. లేదా బ్లాక్ లిస్టులో ఉన్న బిల్డర్ వద్ద నుంచి ఇంటిని కొనుగోలు చేస్తుంటే.. ఆస్తి విలువ, ఆదాయం ఎక్కువగా ఉన్నా.. దరఖాస్తు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.