Benefits of Travel Insurance: కొందరు పని/వ్యాపారం/ఉద్యోగం కోసం, మరికొందరు అభిరుచులను నెరవేర్చుకోవడం/పిక్నిక్ వంటివాటి కోసం తరచూ ప్రయాణాలు చేస్తారు. రెండో వర్గానికి చెందిన ప్రజలు మంచి జ్ఞాపకాలను సృష్టించడానికి కొత్త ప్రదేశాలకు వెళ్తుంటారు. పిక్నిక్‌ల సమయంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు మంచి మూడ్‌ను పాడు చేస్తాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మీ మధుర జ్ఞాపకాలను మాసిపోనివ్వని శక్తి "ప్రయాణ బీమా"కు ఉంది.
US డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రకారం, US ఎయిర్‌లైన్స్‌లో ఏటా లక్షలాది ప్రయాణీకుల బ్యాగ్‌లు మిస్ అవుతున్నాయి. అంటే.. బ్యాగులు కనిపించకుండాపోవడం, దొంగతనానికి గురికావడం వంటివి. అక్కడే కాదు, మన దేశంలోనూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి చికాకులు లేకుండా చూసుకోవడానికి ఉన్న ఉత్తమ మార్గం ప్రయాణ బీమా. ఇది, నమ్మకమైన ప్రయాణ సహచరుడిలాంటిది.
ప్రయాణాలకు అత్యధికంగా ఖర్చు చేస్తున్నవారిలో భారతీయుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. దేశీయంగా & అంతర్జాతీయంగా హాలిడే ట్రిప్, పిక్నిక్ వంటి వాటి కోసం భారతీయుల ప్రయాణ పరిధులు విస్తరిస్తున్నందున, ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రాముఖ్యత గతంలో కంటే ఇప్పుడే ఎక్కువగా పెరిగింది. ఏదైనా కారణం వల్ల ప్రయాణం ఆలస్యమైనా, మొదలుకాకపోయినా, మధ్యలో ఆగిపోయినా, వైద్యపరమైన అవసరం ఏర్పడినా లేదా మరేదైనా ఊహించని పరిస్థితి వచ్చినా ప్రయాణ బీమా మీకు పరిహారం చెల్లిస్తుంది. చాలా దేశాలు ఇప్పుడు ప్రయాణ బీమాను తప్పనిసరి చేశాయి.
1) వైద్య అవసరాలు: పిక్నిక్ లేదా హాలిడే ట్రిప్ కోసం వెళ్లేవాళ్లు మాత్రమే కాదు... వ్యక్తిగత ప్రయాణీకులు, కుటుంబాలు, వ్యాపార ప్రయాణికులు, విదేశాల్లో విద్య కోసం వెళ్లేవాళ్లకు మెడికల్ ఎమర్జెన్సీ ఎప్పుడైనా, ఎక్కడైనా సంభవించొచ్చు. దీనివల్ల ఊహించని ఖర్చులు పెరుగుతాయి. ఈ తరహా ఇబ్బంది సెలవుల ఆనందాన్ని పాడు చేస్తుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ దీనికి పరిష్కారం చూపుతుంది.
2) ఆర్థికంగా ప్రయోజనకరం: ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు ప్రతి ఒక్కరి బడ్జెట్‌కు సరిపోయేలా ఉంటాయి. మొత్తం కుటుంబం కోసం కూడా దీనిని తీసుకోవచ్చు, అనేక పర్యటనలకు పొడిగించుకోవచ్చు. తరచుగా ప్రయాణించే వ్యక్తులు ప్రత్యేక వార్షిక, మల్టీ-ట్రిప్ బీమా పాలసీని తీసుకోవచ్చు. నిర్దిష్ట దేశాల సమూహాల కోసం ప్రత్యేకమైన ప్రయాణ బీమాలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు... మీరు 26 యూరోపియన్ దేశాలతో కూడిన స్కెంజెన్ దేశాలకు హాలిడే ట్రిప్ వేస్తే... 26 వేర్వేరు పాలసీలకు బదులుగా ఒకే గ్రూప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. దీనివల్ల డబ్బు మిగులుతుంది.
3) ప్రతికూల సంఘటనలు: ప్రయాణీకుల పత్రాలు/సామాను పోయినా, విమానం/రైలు/బస్ ఆలస్యంగా బయలుదేరినా మీ పిక్నిక్ ప్లాన్ చెడిపోతుంది, బుర్ర ఖరాబవుతుంది. ఇలాంటి సంఘటనలను కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది, మీకు కలిగిన అసౌకర్యానికి తగిన పరిహారం ఇప్పిస్తుంది.
4) 24/7 మద్దతు, ప్రత్యేక ప్రయోజనాలు: ప్రయాణ బీమా కలిగిన వ్యక్తి ఏ టైమ్ జోన్‌లో ఉన్నా లేదా అతనికి ఏ సమయంలో సహాయం కావాలన్నా, అతను ఒంటరినని ఫీల్ కాడు. అవసరమైన ప్రతిసారీ 24x7 కాల్ సెంటర్ సపోర్ట్ లభిస్తుంది.
5) పాలసీ కొనుగోలు: ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రయాణ బీమాను కొనుగోలు చేయడం చాలా సులభం. మీరు ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. ట్రిప్ వ్యవధి, కవరేజ్, మెడికల్ కవరేజ్, ట్రిప్ క్యాన్సిలేషన్ ప్రొటెక్షన్ వంటి మీ అవసరాలకు తగ్గట్లుగా పాలసీని పొందొచ్చు.
మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకుండా పిక్నిక్‌కు వెళ్తే, ఏదైనా అవాంతరం ఎదురైనప్పుడు, ఇన్ని రకాల ప్రయోజనాలను మిస్ అయ్యే అవకాశం ఉంది.
మరో ఆసక్తికర కథనం: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్ - UPI సేవలు క్లోజ్!