Flying Pigeon Hologram On ATM, Debit And Credit Cards: నేటి కాలంలో, షాపింగ్ నుంచి బిల్లులు చెల్లించడం వరకు చాలా రకాల పనుల కోసం మనం క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్‌ను ఉపయోగిస్తాం. ఇప్పుడు పెద్ద సంఖ్యలో డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి, నగదుకు బదులుగా కార్డ్‌లను విరివిగా వినియోగిస్తున్నారు. డబ్బును వెంట తీసుకెళ్తే పోతుందని భయం ఉంటుంది. కార్డ్ పోయినా దానిని బ్లాక్ చేసి ఆర్థిక నష్టం నుంచి తప్పించుకోవచ్చు, పైగా వాటిని తీసుకెళ్లడం సులభం. అయితే.. మీరు ఎప్పుడైనా మీ దగ్గర గానీ, మీకు తెలిసి వ్యక్తుల దగ్గర గానీ ఉన్న క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్‌ను (ఏటీఎం కార్డ్) ఎప్పడైనా పరిశీలనగా చూసారా?. అలా చూసి ఉంటే, చాలా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ మీద ఎగిరే పావురం గుర్తును (Flying Dove Hologram On ATM, Debit And Credit Cards) గమనించి ఉంటారు. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ మీద ఉండే ఈ హోలోగ్రామ్ స్టిక్కర్ వెనుక చాలా అర్ధం ఉంది.
ఎగిరే పావురం గుర్తు ఉంటే మీ కార్డ్‌లో ఈ కీలక ఫీచర్ ఉన్నట్లు
మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్‌లో ఎగిరే పావురం గుర్తు ఉంటే, ఆ కార్డ్‌లో కాంటాక్ట్‌లెస్ ఫీచర్ ఉందని అర్థం. అంటే లావాదేవీ సమయంలో దానిని పాయింట్ ఆఫ్ సేల్ (PoS) మెషీన్‌లో స్వైప్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి బదులుగా, ఆ కార్డును మెషీన్ మీద ఉంచినా లేదా సమీపంలోకి తీసుకువెళ్లినా చాలు, బిల్ పేమెంట్ పూర్తవుతుంది. ఎగిరే పావురం గుర్తుతో ఉండే హోలోగ్రామ్ కార్డ్ ముందు భాగంలో లేదా వెనుక భాగంలో ఉంటుంది. ఆ హోలోగ్రామ్‌పై కాంతి పడ్డప్పుడు మెరుస్తుంది. ఆ కార్డును అటు ఇటు కదిలిస్తే పావురం ఎగురుతున్నట్లు కనిపిస్తుంది.
ఎగిరే పావురం హోలోగ్రామ్ అర్ధం ఏమిటి?
క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్‌లపై ఉంటే హోలోగ్రామ్ చెల్లింపుల ప్రక్రియను మరింత సురక్షితంగా మారుస్తుంది. ఈ హోలోగ్రామ్ ఉండటం వల్ల, ఆ కార్డ్ చెల్లుబాటు అవుతుందని అర్ధం. ఆ కార్డ్‌తో చేసే ఆర్థిక లావాదేవీలతో ఎటువంటి రిస్క్ ఉండదని హోలోగ్రామ్ సూచిస్తుంది. ఎవరైనా మీకు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేస్తున్నప్పుడు, ఆ కార్డ్‌పై ఎగిరే పావురం హోలోగ్రామ్ స్టిక్కర్ ఉందో లేదో ఖచ్చితంగా తనిఖీ చేయండి. ప్రీమియం వీసా బ్రాండ్ మార్క్ (PVBM)ను ఉపయోగించని కార్డ్‌లకు ఫ్లయింగ్ పీజియన్ హోలోగ్రామ్ ఉండడం అవసరం.
లావాదేవీల సమయంలో ఎలాంటి ఆర్థిక మోసం జరగకుండా నిరోధించే భద్రత లక్షణాలను PVBM కలిగి ఉంది. ఎగిరే పావురం హోలోగ్రామ్ వెర్షన్‌తో వచ్చిన కార్డ్‌ల కంటే PVBM మరింత మెరుగ్గా పని చేస్తుంది. వీసా (VISA) డోవ్ హోలోగ్రామ్‌ను ఉపయోగించినట్లే, మాస్టర్ కార్డ్ (Master Card) వరల్డ్ మ్యాప్ డిస్కవర్-ఎ-గ్లోబ్ హోలోగ్రామ్‌ను ఉపయోగిస్తుంది. కొన్ని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్‌లపై అమెరికన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం ఉంటుంది.
మరో ఆసక్తికర కథనం: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెరుగుతాయా, గుడ్ న్యూస్ వింటామా?