What Is The History Of Currency In The World: డబ్బులెవరికీ ఊరికే రావు.. చిన్నదో పెద్దదో కష్టపడి చేసే పనికి ప్రతిఫలంగా పొందేదాన్ని డబ్బు అంటున్నాం. దాన్ని అవసరాలు తీర్చుకునే వస్తువులను కొనటంతోపాటూ, వీలైతే లగ్జరీలను వాడుతున్నాం. వాలెట్ లో పేపర్ ముక్కలనో, బ్యాంక్ ఖాతాలో నంబర్లనో డబ్బు అంటున్నాం. డబ్బును నంబర్లుగా కాకుండా ఒక కాన్సెప్ట్ గా ఆలోచించటం ఈ ఆధునిక కాలంలో అరుదు. 20వ శతాబ్దపు ప్రముఖ బ్రిటిష్ చరిత్రకారుడు చార్లెస్ సెల్ట్‌మన్ (1886-1957) డబ్బుకు సంబంధించి అందరికీ అర్థమయ్యే నిర్వచనాన్ని చెప్పారు. 


వస్తువుల మార్పిడిని సులభతరం చేయడానికి ఉపయోగించే మెటల్‌ని కరెన్సీ అని, నిర్దిష్ట బరువు ప్రమాణాల ప్రకారం ఉపయోగించినప్పుడు ఆ కరెన్సీని డబ్బు అని, పరికరంతో ముద్రించిన డబ్బును నాణెం అని విశదీకరించారు. ప్రపంచంలోని వివిధ సంస్కృతుల డబ్బు చరిత్రను, మీకు తెలియని డబ్బు, కరెన్సీ, ద్రవ్య సిద్ధాంతం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 


సుమారు 5000 సంవత్సరాల క్రితం నాగరికత మొదలవగానే మనుషులు కరెన్సీ అనే కాన్సెప్ట్ ను కనుగొన్నారు. కాలక్రమంలో డబ్బు రూపం అభివృద్ధి చెందుతూనే ఉంది. సెల్ట్‌మాన్ నిర్వచనం ప్రకారం చూస్తే "డబ్బు కంటే ముందు కరెన్సీ వచ్చింది. నాగరికత ప్రారంభమైన తర్వాత కొంతకాలానికే కరెన్సీల అభివృద్ధి జరిగింది. ఈజిప్షియన్లు మెజర్మెంట్ సిస్టంను అభివృద్ధి చేశారు. దీని ద్వారా విలువైన లోహాలతో, నాన్‌మెటాలిక్ వస్తువులను మార్పిడి చేసుకోవటానికి ఉపయోగించారు." డెబెన్ ప్రమాణం..దాదాపు 93.3 గ్రాముల రాగి, వెండి, బంగారం కొలతగా నిర్ణయించారు.. 12వ రాజవంశం (1985-1773 BCE), కైట్ వ్యవస్థను తీసుకొచ్చారు. పది కైట్‌లు ఒక డెబెన్‌తో సమానం. వెండి లేదా బంగారం కొలతలకు మాత్రమే డెబెన్‌లు ఉపయోగించారు. సెల్ట్‌మాన్ ప్రకారం, డెబెన్, కైట్‌లు రెండిటినీ కరెన్సీగా, డబ్బుగా కూడా పరిగణించవచ్చు.


నాణెం ఎలా ప్రారంభమయింది?


దాదాపు 2000 సంవత్సరాలు నాణేలు చలామణిలో ఉన్నప్పటికీ, మెటల్‌ని బట్టి నిర్దిష్టమైన విలువలు అంటే..బంగారానికి, వెండికి, కాపర్‌కు వేరు వేరు  వాల్యూ ఏర్పరచింది మాత్రం అప్పటి లిడియా దేశంలో పురాతన అనటోలియన్ రాజ్యం. ఆ తర్వాత కింగ్ గైజెస్ పాలనలో లిడియా అత్యంత సంపన్న దేశంగా మారింది. 


గైజెస్ ఆ రాజ్యంలోని స్థానిక ఎలెక్ట్రమ్ నిక్షేపాలను (సహజమైన వెండి-బంగారు మిశ్రమం) సద్వినియోగం చేసుకున్నాడు. వీటిని ప్రాస్పెక్టర్లు లిడియన్ రాజధాని సార్డిస్‌కు తీసుకువచ్చారు. ఎలెక్ట్రమ్‌ను రిఫైనరీకి తీసుకువచ్చి, అక్కడ బంగారం, వెండిని వేరు చేసి ప్రపంచంలోని మొట్టమొదటి అధికారిక నాణేల కరెన్సీగా మార్చారు . పొరుగున ఉన్న గ్రీకులు వారి వ్యాపార చతురత మెచ్చి ఆర్థిక ఆలోచనల కోసం లిడియన్లను గౌరవించారు. కాబట్టి వారు కూడా నాణేల కరెన్సీ ఆలోచనను స్వీకరించారు. 


కాగితం కరెన్సీ


ఆ తర్వాత అనేక దేశాలు బంగారు, వెండి నాణేలను విపరీతంగా ముద్రించాయి. 431-404 BCE కాలంలో గ్రీకులు కొత్త ఆలోచనను మొదలుపెట్టారు. అదే బ్యాంకింగ్. ప్రారంభంలో ఈ వ్యవస్థ భిన్నంగా ఉన్నా, అది కాలక్రమేణా రూపాంతరం చెందుతూ వచ్చింది. డబ్బు కాన్సెప్ట్‌లో ముఖ్యమైన దశ కాగితం కరెన్సీ. ఇది దేశాల ఎకానమీలో రెవల్యూషనరీ మార్పులు తెచ్చింది. అప్పుడు కూడా డబ్బు ప్రమాణం అన్ని దేశాల్లో ఒకేలా ఉండేది కాదు. ఆఫ్రికాలోని కొంగో రాజ్యంలో ఇనుప ముక్కలను కరెన్సీగా వాడేవారు. చైనీస్ ఎకానమిస్ట్‌లు పేపర్ కరెన్సీని ఇది వరకు నాణేల్లా కాకుండా పేమెంట్ల విధానంలో ఉపయోగించాలని భావించారు. ఈ ఆలోచన ప్రపంచ దేశాల్లో విస్తరించి కాగితపు కరెన్సీ విలువ సంతరించుకుంది.