Travel Tips: ప్రస్తుతం, తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు (Dasara Holidays 2024) నడుస్తున్నాయి. చాలామంది ఈ సెలవుల్లో విహారయాత్రలకు వెళ్తున్నారు. పిక్నిక్‌కు వెళ్తే.. ట్రావెల్‌ టికెట్ బుకింగ్ నుంచి హోటల్ రూమ్‌ బుకింగ్ వరకు, ఫుడ్‌ నుంచి డ్రింక్స్‌ వరకు చాలా ఖర్చవుతుంది. హాలిడే ట్రిప్‌కు వెళ్లేవాళ్లు వీటన్నింటి కోసం ముందు నుంచే ప్లాన్‌ చేసి బడ్జెట్‌ కేటాయిస్తుంటారు. అయితే, ప్రయాణంలో ఏదైనా ప్రమాదం జరిగితే, మొత్తం టూర్‌ ప్లాన్‌ & పిక్నిక్‌ మూడ్‌ పాడవుతుంది.


ఇలాంటి సిట్యుయేషన్లను నివారించడానికి ప్రయాణ బీమా (Travel Insurance) రూపంలో ముందస్తు భద్రత ఏర్పాట్లు ఉన్నాయి. మీరు కూడా ప్రయాణం చేయాలనుకుంటున్నట్లయితే ప్రయాణ బీమా తీసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల మీరు ఎలాంటి చింత లేకుండా మీ ట్రిప్‌ని పూర్తిగా ఆస్వాదించొచ్చు.


ప్రయాణ బీమా వల్ల ప్రయోజనాలు
హాలిడే ట్రిప్‌లో భాగంగా మీరు కొత్త ప్రాంతానికి వెళ్తారు. ఆ ప్రదేశంలో అనుకోని సంఘటన జరిగితే ప్లాన్‌ మొత్తం స్పాయిల్‌ అవుతుంది. ఉదాహరణకు.. మీరు దేశంలో ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మీ లగేజీ కనిపించకుండా పోవచ్చు లేదా దొంగతనానికి గురి కావచ్చు. లేదా, ప్రయాణంలో ఆలస్యం కారణంగా మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. లేదా, అనుకోని ప్రమాదం జరిగి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. ఇలాంటి సందర్భంలోనే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది, జరిగిన నష్టానికి ప్రయాణ బీమా ద్వారా పరిహారం అందుతుంది.


మరో ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి విదేశానికి వెళ్లినప్పుడు అతని పాస్‌పోర్ట్ లేదా ఏదైనా కీలక డాక్యుమెంట్‌ పోగొట్టుకోవచ్చు. అతను ప్రయాణిస్తున్న విమానం హైజాక్ కావచ్చు లేదా విమానానికి ప్రమాదం జరగొచ్చు. లేదా, ప్రయాణ సమయంలో ఆరోగ్యం క్షీణించవచ్చు. ఈ పరిస్థితులన్నింటిలోనూ ప్రయాణ బీమా పనికొస్తుంది, మీకు జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తుంది. మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, మీకు మాత్రమే కాకుండా మీతో పాటు ప్రయాణించే వారందరికీ బీమా కవరేజ్‌ వర్తిస్తుంది. 


విహారయాత్రలు మాత్రమే కాదు, ఉద్యోగం/వ్యాపారం కోసం ప్రయాణం చేస్తున్నా & బంధుమిత్రులను కలవడానికి వెళ్తున్నా.. ఎలాంటి కారణంతో మీరు ప్రయాణం చేస్తున్నా ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవచ్చు. దేశం లోపల ప్రయాణించినా, విదేశాలకు వెళ్తున్నా ఈ ఇన్సూరెన్స్‌ కవరేజ్‌లోకి రావచ్చు.


ఇలా క్లెయిమ్ చేయవచ్చు
ప్రయాణ బీమాను క్లెయిమ్ చేయడానికి, మీరు పూర్తి పాలసీ డాక్యుమెంట్లు & సపోర్టింగ్ డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లాలి. లేదా, ఈ పత్రాలను మీ ల్యాప్‌టాప్‌, ఫోన్‌, పెన్ డ్రైవ్‌ లేదా క్లౌడ్‌లో ఉంచుకోవచ్చు. దీవల్ల, క్లెయిమ్‌ చేయాల్సిన సమయంలో పేపర్లు లేవని ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. బీమాను క్లెయిమ్ చేయవలసిన పరిస్థితి వస్తే, కంపెనీ కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసి జరిగిన నష్టం గురించి చెప్పండి. మీ దగ్గర ఉన్న అన్ని పత్రాలను ఇ-మెయిల్ చేయవచ్చు. ఒకవేళ మీరు వేరే దేశంలో ఉన్నట్లయితే, కంపెనీ మీకు ఆ దేశంలోని తన ఆఫీస్‌ నంబర్‌ను ఇస్తుంది. ఆ నంబర్‌కు కాల్‌ చేసి సమస్యను వివరించాలి, అవసరమైన పత్రాలు అందించాలి.


ఇలా కొనుగోలు చేయండి
మీ యాత్రను ప్రారంభించే ముందు ఏదైనా ప్రయాణ బీమా కంపెనీ నుంచి ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ (Travel Insurance Policy) ప్రయాణ బీమాను కొనుగోలు చేయొచ్చు. బీమా ఏజెంట్‌ నుంచి కొనొచ్చు లేదా ఆన్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చు. బీమాను కొనుగోలు చేస్తున్నప్పుడు, ప్రయాణ బీమాకు సంబంధించిన ప్రతి నిబంధన & షరతును జాగ్రత్తగా చదవండి. కొన్ని బీమా కంపెనీల నుంచి కోట్స్‌ తీసుకుని, ఉత్తమంగా అనిపించిన దానిని ఎంచుకోండి. మీ ట్రిప్ సమయంలో జరిగే అన్ని సంఘటనలను మీ బీమా పాలసీ కవర్ చేస్తుందో లేదో చూసుకోండి.


మరో ఆసక్తికర కథనం: పెళ్లంటే 3 ముళ్లు, 7 అడుగులు మాత్రమే కాదు - అదో పెద్ద వ్యాపార కూడలి