Wedding Business In India: భారతదేశంలో వివాహం అంటే మామూలుగా ఉండదు. సామాన్య జనం కూడా తమ ఇంట్లో పెళ్లిని తాహతుకు మించి జరిపిస్తారు. మన దేశంలో వివాహం ఇంటే కేవలం ఇద్దరు వ్యక్తుల కలయికకు సంబంధించిన వేడుక మాత్రమే కాదు, లక్షల కోట్ల రూపాయల వ్యాపారం కూడా.


ఈ ఏడాది నవంబర్ నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుంది. వ్యాపారస్తులకు ఇదే అసలైన పండుగ. 75 నగరాల డేటా ఆధారంగా, 'కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడ్' (CAIT) ఒక అధ్యయనం చేసింది. ప్రస్తుత వెడ్డింగ్‌ సీజన్‌లో దాదాపు 5.9 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా వేసింది.


శుభ ఘడియలు
ఈ ఏడాది పెళ్లి ముహూర్తాలు 12 నవంబర్ 2024 నుంచి ప్రారంభం అవుతాయి. గతేడాది ఇదే సీజన్‌ కంటే ఎక్కువగా ఈ సీజన్‌లో దాదాపు 48 లక్షల పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. 2023 ఇదే సీజన్‌లో దాదాపు 35 లక్షల వివాహాలు జరిగాయి. అప్పుడు దాదాపు రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ఈసారి 48 లక్షల పెళ్లిళ్లు జరగడం వల్ల వ్యాపారం మరింత పెరుగుతుందని లెక్కగట్టారు. 


భారతదేశంలో వివాహ వ్యాపారం రేంజ్‌ ఇదీ..
CAIT ప్రకారం, భారతదేశంలో వివాహ వేడుకకు సగటున రూ. 12 లక్షలు ఖర్చు చేస్తారు. ఒక భారతీయ కుటుంబం సగటు వార్షిక ఆదాయం కంటే ఇది దాదాపు 3 రెట్లు ఎక్కువ. భారతదేశ తలసరి GDP కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ. 


జెఫరీస్ రిపోర్ట్‌ ప్రకారం, 2023లో భారతదేశంలో జరిగిన మొత్తం వివాహాల్లో ఎలైట్ వెడ్డింగ్స్‌ది (ఖరీదైన పెళ్లిళ్లు) 1% వాటా. దేశంలో జరిగిన అన్ని వివాహాల మొత్తం ఖర్చులో 12% వాటా వీటిదే. ఎలైట్ వెడ్డింగ్‌కు సగటున కోటి రూపాయలు ఖర్చు అవుతుండగా, అతి తక్కువ ఖర్చుతో జరిగే పెళ్లికి సగటున రూ.3 లక్షలు ఖర్చవుతుంది. తక్కువ ఖర్చుతో చేసే వివాహాలు మొత్తం పెళ్లిళ్లలో 17%గా ఉన్నాయి. మొత్తం ఖర్చులో వీటి వాటా 4%. మిడ్-లెవల్ వివాహాలు 51% కాగా, వాటి వాటా ఖర్చు 63%. మధ్య స్థాయి వివాహాలకు సాధారణంగా రూ.10-25 లక్షల వరకు ఖర్చవుతుంది.


దిల్లీ మార్కెట్ కేంద్ర బిందువు
ఈ పెళ్లిళ్ల సీజన్‌లో దిల్లీ రిటైల్ మార్కెట్ కీలక పాత్ర పోషించనుంది. ఒక్క దిల్లీలోనే దాదాపు 4.5 లక్షల వివాహాలు జరుగుతాయని, వాటి వల్ల దాదాపు రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఎలైట్‌ వెడ్డింగ్స్‌లో ఎక్కువ భాగం దిల్లీలోనే జరుగుతాయి.


పెళ్లిళ్ల సీజన్‌లో వ్యాపారులు ఎలా లాభపడతారు?
పెళ్లిళ్ల సీజన్‌లో వధూవరులు, కుటుంబ సభ్యులు మాత్రమే కాదు.. ఈ సమయంలో మొత్తం మార్కెట్‌ కూడా పెళ్లి సన్నాహాల్లో పూర్తిగా బిజీగా ఉంటుంది. బంగారం, వెండి, వజ్రాభరణాల కొనుగోళ్లలో ఎక్కువ భాగం వివాహాలదే. వివాహ దుస్తులకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. దీని వల్ల భారతీయ ఫ్యాషన్ డిజైనర్లు, టెక్స్‌టైల్ పరిశ్రమలకు భారీ లాభాలు వస్తున్నాయి. పెళ్లిలో ధరించడానికి బంధుమిత్రులు కూడా కొత్త బట్టలు, నగలు కొంటుంటారు. 


వెడ్డింగ్‌ ఇండస్ట్రీలో క్యాటరింగ్ & కళ్యాణమంటపాలది కూడా దాదాపు 30% వాటా. దీని తరువాత, 19% బహుమతులు, 14% అలంకరణ సామగ్రిది. కొత్త దంపతులకు ఇచ్చే బహుమతులది కూడా ముఖ్యమైన భాగమే. డెస్టినేషన్ వెడ్డింగ్స్‌ కోసం దూరప్రాంతాల నుంచి బంధుమిత్రులు వస్తుంటారు. దీనివల్ల హోటళ్లు, రవాణా సంస్థలకు ఆదాయం పెరుగుతుంది.


పెళ్లిళ్ల సీజన్ అనేది బడా వ్యాపారులకే కాదు చిన్న వ్యాపారులకు కూడా సువర్ణావకాశం. శుభలేఖలు ప్రింట్‌ చేసే ప్రెస్‌లు, వేడుకల్ని చిత్రీకరించే డ్రోన్లు, ఫోటోగ్రాఫర్లు, షామియానా యజమానులు, వంట చేసేవాళ్లు, క్యాటరింగ్‌ బాయ్స్‌, బ్యూటీషియన్లు, మెహందీ కళాకారులు, పూలు అమ్మేవాళ్లు, మంగళవాద్యకారులు, డీజే మ్యూజియషన్లు, స్పీకర్లు అద్దెకు ఇచ్చే వాళ్లు... ఇలా చాలా వస్తువులు & సేవలు పెళ్లిళ్లతో ముడిపడ్డాయి. వెడ్డింగ్‌ సీజన్‌లో ఈ వ్యాపారాన్నీ క్షణం తీరికలేకుండా నడుస్తాయి.


వెడ్-టెక్‌ను ఉపయోగించడం వల్ల వివాహాలు మరింత మెరుగ్గా, సులభంగా జరుగుతున్నాయి. వెడ్-టెక్ కంపెనీలు ఆన్‌లైన్ వేదిక బుకింగ్, డిజిటల్ ఇన్విటేషన్ కార్డ్, ఆన్‌లైన్ గిఫ్ట్ రిజిస్ట్రీ, వర్చువల్ ప్లానింగ్ వంటి సౌకర్యాలు అందిస్తున్నాయి. దీంతో జంటలు ప్లాన్ చేసుకోవడం సులువుగా, కొత్త ట్రెండ్‌లా మారింది.


పర్యాటకుల గమ్యస్థానంగా మార్చడానికి ప్రయత్నాలు
భారత ప్రభుత్వం వివాహ పరిశ్రమను ప్రోత్సహించడానికి, భారతీయ వివాహ వేడుకలను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకంగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం, ‘డెవలపింగ్ టూరిజం ఇన్ మిషన్ మోడ్’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం లక్ష్యం.. భారతదేశాన్ని ఉత్తమ వివాహ గమ్యస్థానంగా మార్చడం. దీని కోసం, పర్యాటక మంత్రిత్వ శాఖ 25 రకాల ప్రదేశాలను ఎంపిక చేసింది. పర్వతాలు, సముద్రం, రాజులు & చక్రవర్తుల రాజభవనాలు వంటివి ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఇక్కడకు వచ్చే స్వదేశీ, విదేశీ బంధుమిత్రులు, పర్యాటకులు అందమైన దృశ్యాలను మాత్రమే కాదు, భారతీయ వివాహ సంప్రదాయాలు & ఆచారాలను కూడా చూస్తారు. అంతేకాదు, కొత్త & రుచికరమైన ఆహారాన్ని కూడా ఆస్వాదిస్తారు.


భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రజలకే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా కీలకం. వివాహాల సమయంలో పరిశ్రమలు ఊపందుకుంటాయి, కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. 


మరో ఆసక్తికర కథనం: మీరు షాక్‌ అయ్యే స్థాయికి బంగారం రేటు, ఈ ఏడాదే అది జరగొచ్చు!