Gold Prices Are Likely To Reach Rs 85000: భారతీయులకు బంగారం - వెండిపై ఉన్న ప్రేమను ఎవరూ అడ్డుకోలేరు. మన జనం కూడా ఆ ప్రేమను ఎప్పుడూ దాచుకోరు, బహిరంగంగా ప్రదర్శించడానికే ఇష్టపడుతుంటారు. పుత్తడి విషయంలో ఈ సీజన్ చాలా ముఖ్యమైనది. నవరాత్రులు, దసరా, ధన్‌తేరస్, దీపావళి, ఛత్ పండుగలు ప్రజల ఆనందాన్ని పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ తర్వాత భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుంది, బంగారు దశ తారస్థాయికి చేరుతుంది. దీనిలో కోట్ల రూపాయల విలువైన బంగారం కొనుగోలు మరియు లక్షల వివాహాలకు విక్రయించబడుతుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా బంగారం ధర ఇప్పటికే పెరిగింది, ఇంకా భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది కాకుండా, మన దేశంలో పండుగల సీజన్ కొనసాగుతోంది, ఆభరణాల కొనుగోళ్లు భారీగా ఉంటాయి. సహజంగానే, డిమాండ్ పెరగడం వల్ల బులియన్ మార్కెట్‌లో బూస్ట్ కనిపిస్తుంది. ఈ సంవత్సరంలో ఇంకా 3 నెలలు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, బంగారం ఇప్పటికే 19.80 శాతం రాబడిని ఇచ్చింది.
గ్లోబల్ మార్కెట్లలో $3000 - ఆశ్చర్యపోకండి
ప్రపంచ స్థాయిలో బంగారం ధరలకు సంబంధించి సిటీ గ్రూప్, గోల్డ్‌మన్ సాచ్ సంస్థలు వాటి పరిశోధన నివేదికలు రిలీజ్ చేశాయి. BMI రిపోర్ట్ కూడా ఉంది. గ్లోబల్ మార్కెట్‌లో, బంగారం ధర ఔన్సుకు (28.35 గ్రాములు) 3000 డాలర్లకు చేరొచ్చని ఆ మూడు సంస్థలు అంగీకరించాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సుకు 2,678 డాలర్లుగా ఉంది. ఇదే రీతిలో పెరిగితే, ఇది 3 నెలల్లో ఔన్స్‌కు 3000 డాలర్లకు చేరే ఛాన్స్ ఉందట.
ఔన్సు గోల్డ్ రేటు $3000 డాలర్లు అనగానే, ఇది చాలా ఎక్కువ అనిపించొచ్చు, ఆశ్చర్యం కలిగించొచ్చు. కానీ, ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఇది వాస్తవ రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే, బంగారం ఎప్పుడూ సురక్షితమైన పెట్టుబడి సాధనంగా (Safe Haven) పరిగణిస్తారు. ప్రపంచ అనిశ్చితి సమయంలో, పెట్టుబడిదార్లకు బంగారం చాలా బలమైన మద్దతు అందిస్తుంది.
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా గోల్డ్ మార్కెట్లో గందరగోళం నెలకొంది. ఈ విపత్తు బంగారం వ్యాపారులకు అవకాశంగా మారుతోంది. ఈ సంవత్సరం ముగిసిన తర్వాత వెనక్కు తిరిగి చూస్తే, ఇప్పుడున్న పసుపు లోహం ధర మీకు చౌకగా అనిపించవచ్చు. డిసెంబర్ నాటికి పుత్తడి మరో 12 శాతం రాబడిని ఇవ్వొచ్చని గ్లోబల్ రీసెర్చ్ కంపెనీలు అంచనా వేశాయి. మిగిలిన మూడు నెలల్లో 12 శాతం పెరగడం అంటే, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న వివాదం కమోడిటీ మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని అర్ధం. గోల్డ్‌తో పాటు వెండి, ఇతర విలువైన లోహాల ధరలు కూడా పెరుగుతూనే ఉంటాయని అంచనా.
బంగారం ధర గురించి ఆసక్తికర విషయాలు
ఎల్లో మెటల్ రేటు పెరగడం వెనుక కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటాయి. ప్రపంచ సంక్షోభ సమయాల్లో, బంగారాన్ని హెడ్జింగ్‌గా ఉపయోగిస్తారు. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల నుంచి పెద్ద సంస్థల వరకు, అన్నీ బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. యుద్ధ సమయంలో భారతదేశంలో బంగారం ధర గ్లోబల్ మార్కెట్ కంటే వేగంగా పెరుగుతుందని చరిత్ర చెబుతోంది. ఉదాహరణకు.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల, 2022 ఫిబ్రవరిలో, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 4.55 శాతం పెరిగింది. భారతదేశంలో మాత్రం దీనికి రెట్టింపుగా, దాదాపు 8.5 శాతం పెరిగింది.
భారతదేశంలో బంగారం ధరలు
ప్రస్తుతం, భారత్‌లో బంగారం ధర 10 గ్రాములకు (MCX Price) రూ. 76,315 గా ఉంది. ఇది, డిసెంబర్ నాటికి రూ. 85,000 కు చేరితే ఏకంగా 12 శాతం పెరిగినట్లు లెక్క. నగలు కొనేవాళ్లు ఇబ్బంది పడినప్పటికీ, పెట్టుబడిదార్లకు ఇది గణనీయమైన లాభాలు అందిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: పది పాసైతే చాలు, టాప్-500 కంపెనీల్లో ఛాన్స్ - మీ కలను నిజం చేసే 'ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్'