World's Richest Person: మెటా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (Meta CEO) అయిన మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) సంపద ఈ ఏడాది భారీగా పెరగడంతో, ఆయన ఒక కీలకమైన మైలురాయి దాటి అరుదైన మలిజీ చేరుకున్నారు. ఇటీవలే తొలిసారిగా 200 బిలియన్ డాలర్ల నికర విలువను (Mark Zuckerberg Net Worth) అధిగమించారు. ఇప్పుడు, ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా మారి మరో రికార్డ్‌ సృష్టించారు. ప్రస్తుతం, మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంపద విలువ 206.2 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు చేరుకుంది. 


ప్రపంచ కుబేరుల జాబితాలో, జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టి మార్క్‌ జుకర్‌బర్గ్‌ రెండో స్థానాన్ని సాధించారు. ఇప్పుడు, ప్రపంచ ప్రఖ్యాత టెస్లా (Tesla) కంపెనీ ఓనర్‌ ఎలాన్ మస్క్ (Elon Musk) మాత్రమే అతని కంటే ముందున్నారు. 


ఈ ఏడాది 78 బిలియన్ డాలర్లు పెరిగిన సంపద
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం, ఎలాన్ మస్క్ నికర విలువ (Elon Musk Net Worth) ప్రస్తుతం 256 బిలియన్ డాలర్లు. 206 బిలియన్ డాలర్లతో మార్క్ జుకర్‌బర్గ్ రెండో స్థానానికి చేరారు. దీంతో, 205 బిలియన్ డాలర్ల సంపద ఉన్న అమెజాన్ (Amazon) మాజీ సీఈవో జెఫ్ బెజోస్ (Jeff Bezos) థర్డ్‌ ప్లేస్‌లోకి జారిపోయారు. మార్క్ జుకర్‌బర్గ్‌కు 2024 సంవత్సరం బాగా కలిసొచ్చింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అతని సంపద 78 బిలియన్ డాలర్లు పెరిగింది. అంతేకాదు, గ్లోబల్‌ బిలియనీర్స్‌ లిస్ట్‌లో అతను 4 స్థానాలు ఎగబాకారు. ప్రస్తుతం, మార్క్ జుకర్‌బర్గ్ - ఎలాన్ మస్క్ మధ్య 50 బిలియన్ డాలర్ల గ్యాప్ మాత్రమే ఉంది. 


మెటా ప్లాట్‌ఫామ్స్‌ స్టాక్ ధర దాదాపు 70 శాతం జంప్‌
మార్క్ జుకర్‌బర్గ్‌కు మెటా ప్లాట్‌ఫామ్స్‌లో దాదాపు 13 శాతం వాటా ఉంది. ఫేస్‌బుక్‌ (Facebook), వాట్సాప్‌ (WhatsApp), ఇస్టాగ్రాం (Instagram) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు మెటా ప్లాట్‌ఫామ్స్‌ కిందకు వస్తాయి. ఈ సంవత్సరం, ప్రపంచంలోని టాప్‌-500 ధనవంతుల్లో, మార్క్‌ జుకర్‌బర్గ్‌ అత్యధిక డబ్బు సంపాదించారు. మెటా ప్లాట్‌ఫామ్స్‌ షేర్‌ ధర ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 70 శాతం పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టింది. రెండో త్రైమాసికంలో, కంపెనీ సేల్స్‌లో భారీ వృద్ధి నమోదైంది. AI చాట్‌బాట్‌లను మరింత ప్రభావవంతంగా మార్చడం కోసం లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడళ్లను పెంచడంపై కంపెనీ ఫోకస్‌ పెట్టింది. దీంతో కంపెనీ షేర్‌ ప్రైస్‌ తారాజువ్వలా దూసుకుపోతోంది. కంపెనీ షేర్లు అంచనాలకు మించి పెరగడంతో మార్క్ జుకర్‌బర్గ్ సంపద కూడా వేగంగా పెరిగింది.


బిలియనీర్స్‌ లిస్ట్‌లో మన వాళ్లు ఎక్కడ?
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) అధిపతి ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) సంపద విలువ 107 బిలియన్‌ డాలర్లు. అతను 14వ స్థానంలో ఉన్నారు. అదానీ గ్రూప్‌ (Adani Group) ఓనర్‌ గౌతమ్‌ అదానీ (Gautam Adani) సంపద విలువ 100 బిలియన్‌ డాలర్లు. అతను 17వ ప్లేస్‌లో ఉన్నారు.


మరో ఆసక్తికర కథనం: పది పాసైతే చాలు, టాప్‌-500 కంపెనీల్లో ఛాన్స్‌ - మీ కలను నిజం చేసే 'ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ స్కీమ్'